ఆలూ ఎర్రగా పండింది!

కెంపు రంగులో ఎర్రెర్రగా మెరిసిపోతున్న వీటిని అదాటున చూస్తే... ‘టొమాటోల్నో, దానిమ్మ కాయల్నో ఇలా రాశులుగా పోసినట్టున్నారే’ అనిపిస్తే అందులో మీ పొరపాటేం లేదు. రంగుతో మాయ చేసేలా ఉన్నా... ఇవన్నీ కూడా ఎరుపు రంగు బంగాళాదుంపలు. బంగ్లాదేశ్‌లోని బోగ్రా జిల్లా మహాస్థాన్‌గఢ్‌ మార్కెట్లో నిత్యం ఈ బంగాళాదుంపల

Updated : 31 Jul 2022 08:37 IST

ఆలూ ఎర్రగా పండింది!

కెంపు రంగులో ఎర్రెర్రగా మెరిసిపోతున్న వీటిని అదాటున చూస్తే... ‘టొమాటోల్నో, దానిమ్మ కాయల్నో ఇలా రాశులుగా పోసినట్టున్నారే’ అనిపిస్తే అందులో మీ పొరపాటేం లేదు. రంగుతో మాయ చేసేలా ఉన్నా... ఇవన్నీ కూడా ఎరుపు రంగు బంగాళాదుంపలు. బంగ్లాదేశ్‌లోని బోగ్రా జిల్లా మహాస్థాన్‌గఢ్‌ మార్కెట్లో నిత్యం ఈ బంగాళాదుంపల కుప్పల్ని చూడొచ్చు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా పండించే ‘రెడ్‌ స్కిన్‌ పొటాటో’ల్ని రైతులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. అలా సంచులు సంచులుగా పెద్ద మొత్తంలో మార్కెట్లో దిగిన ఆ దుంపల్ని ఓ దగ్గర పోస్తారు. నీటితో శుభ్రం చేస్తూ, మట్టిని తొలగిస్తూ... తడి ఆరిపోయాక అమ్మడానికి సిద్ధం చేస్తారు. ఆ తతంగంలో అంగడి అంతా పరుచుకున్న ఆ ఎర్రని దుంపలు... రత్నాల రాశుల్లా కనువిందు చేస్తుంటాయి. అందుకే మరి, ఆ అందాల దృశ్యాల్ని కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు పోటీపడుతుంటారు!


బెల్జనిక్‌ దీవి

కాశం నుంచి చూస్తే అచ్చంగా వేలిముద్రని తలపించే ఈ దీవి క్రొయేషియా సమీపంలో ఉంది. బెల్జనిక్‌ అన్నది దీని పేరు. బొటనవేలి ఆకారంలో ఉండటమే కాదు... ఆ వేలిలోని సన్నటి రేఖల్ని తలపించే వరుసలూ కనిపించడమే ఈ దీవి ప్రత్యేకత. ఇంతకీ ఆ వరుసలు... సముద్ర జలాలు ఇక్కడి పంటల్ని ముంచెత్తకుండా రైతులు కట్టుకున్న చిన్న గోడలు. అన్నట్టు... సాగుకోసం వాడుకోవడం తప్ప ఈ చిన్న దీవిలో ఎవరూ నివాసం ఉండరు!


మీకు తెలుసా!

మానవ చరిత్రలో అత్యంత పొడవైన వ్యక్తిగా రికార్డు సృష్టించింది అమెరికాకి చెందిన రాబర్ట్‌ వాడ్లోవ్‌. అంగుళం తక్కువ తొమ్మిది అడుగులు ఉన్న అతడు ఇరవై రెండేళ్లు (1918-1940) మాత్రమే జీవించాడు. బతికి ఉన్నప్పుడు దుస్తులూ పాదరక్షలూ ప్రత్యేకంగా చేయించినట్లే అతని శవపేటికను కూడా పెద్ద సైజులో తయారుచేయించాల్సి వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..