రేగుపండ్లనీ ఎండబెట్టేద్దాం..!
తీపీ పులుపూ వగరూ కలగలిసిన రుచితో ఉండే రేగుపండ్లు అంటే అందరికీ ఇష్టమే. కానీ సీజన్లో బండ్లనిండా వచ్చే ఈ పండ్లకోసం ఆ తరవాత ఎంత వెతికినా కనిపించవు. అందుకే ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరాల్లానే ఎండిన రేగుపండ్లూ వస్తున్నాయిప్పుడు. ఆ పండ్లతో జామ్‌లూ సాస్‌లూ జ్యూస్‌లూ చేయడంతోపాటు పొడి రూపంలోనూ నిల్వచేసి అమ్ముతున్నారు. ఎందుకూ అంటే... రేగుపండులో ఔషధ గుణాలెన్నో ఉన్నాయని సంప్రదాయ వైద్యులతోపాటు శాస్త్ర నిపుణులూ చెబుతున్నారు..!
ఒకప్పుడు కొండకొనల్లోనూ డొంకల్లోనూ పెరిగే చెట్లకు కాసే ఎర్రని రేగుపండ్లనే కోసుకొచ్చి అమ్మేవారు. వాటిల్లోనే పెద్దవీ చిన్నవీ రకాలు ఉండేవి. కానీ క్రమంగా వాటి స్థానాన్ని చిన్నసైజు ఆపిల్‌ను తలపించే ఆకుపచ్చని యాపిల్ రేగు పండ్లు ఆక్రమించాయి. వీటిల్లోనూ ఎర్రని కశ్మీరీ ఆపిల్, సుందరి, మిస్ ఇండియా రకాలను ఇప్పుడు ఎక్కువగా పండిస్తున్నారు.
సంస్కృతంలో బదరీ, హిందీలో బేర్ పండ్లుగా పిలిచే రేగు పండ్లలో రంగూ సైజుని బట్టి 400కు పైనే రకాలున్నాయి. షుగర్‌కేన్, లి, షెర్వుడ్, చికొ, హనీజార్ రకాలు తాజాగా తినడానికి బాగుంటే; లాంగ్, షాంక్సి లి రకాలు ఎండాక తినడానికి బాగుంటాయి. చైనా, వియత్నాం, కొరియా దేశాల్లో గుండ్రంగానూ కోలగానూ పెద్దసైజులో ఉండే రేగుపండ్ల పంటే ఎక్కువ. అందుకే వీటిని చైనా ఆపిల్, రెడ్ డేట్స్ అనీ పిలుస్తుంటారు. అక్కడ వీటిని ఎండబెట్టి తినడం ఎప్పటినుంచో వాడుకలో ఉంది. పర్షియన్ వంటకాల్లో ఎండిన రేగు పండ్లను వాడుతుంటారు. మనదగ్గర ఇప్పుడిప్పుడే ఎండుపండ్ల వాడకం పెరిగింది. అందుకే ఈమధ్య రేగుపండ్లనీ ఫ్రీజ్ డ్రైయింగ్ చేసి లేదా గాలికి ఆరబెట్టి ప్యాక్ చేసి అమ్ముతున్నారు. వీటితో చేసిన జామ్‌లూ, జెల్లీలూ, జ్యూస్, టీ, వినెగర్, క్యాండీలూ కూడా వస్తున్నాయి. రేగుపూల నుంచి ప్రత్యేకంగా తేనెని కూడా సేకరిస్తుంటారు. మొరాకోలోని అట్లాస్ పర్వతాలు ఈ రకమైన తేనెకి పెట్టింది పేరు. పోతే, ఈ మధ్య అన్ని పండ్లనీ టీ రూపంలో తాగడం పెరిగింది. అందులో భాగంగా రేగుపండ్ల పొడి టీ బ్యాగ్‌ల రూపంలోనూ వస్తోంది. డెజర్ట్‌లు, స్వీట్లు, ఐస్‌క్రీమ్స్‌లో కూడా ఈ పొడి వాడుతున్నారిప్పుడు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పండ్లకు మిర్చి, బెల్లం చేర్చి వడియాల్లా పట్టడం తెలిసిందే. కానీ తమిళనాట మాత్రం లడ్డూలూ పప్పుచెక్కల్లా చేసి ఏడాది పొడవునా చప్పరిస్తుంటారు.
ఎందుకంటే ఇది అజీర్తికి మంచి మందు. కొన్నిచోట్ల కాల్చుకునీ ఉడికించుకునీ ఎండబెట్టీ కూడా తింటారు. నిజానికి ఏ రూపంలో తిన్నా ఈ పండు అద్భుతమైన ఔషధఫలం.
ఆయుర్వేద వైద్య గ్రంథాలైన చరక, శుశ్రుత సంహితలను బట్టి- రేగుపండ్లతో చేసిన పచ్చళ్లనీ, కషాయాల్నీ అనేక వ్యాధుల నివారణలో వాడినట్లు తెలుస్తోంది. చైనా సంప్రదాయ వైద్యం ఈ పండుని రక్తాన్ని శుద్ధిచేసి, ఆయుష్షును పెంచే మందుగా పేర్కొంటోంది. పోషకాలపరంగా చూసుకున్నా పిండిపదార్థాలతోపాటు పీచూ ఖనిజాలూ 18 రకాల అమైనో ఆమ్లాలూ విటమిన్లూ ఇందులో పుష్కలం. అందుకే ఎండిన ఈ పండ్లు సప్లిమెంట్లలా పనిచేస్తాయి అంటున్నారు వైద్యులు. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు నాడీ, రక్తప్రసరణ, జీర్ణ వ్యవస్థల పనితీరుని మెరుగుచేస్తాయని శాస్త్రీయ పరిశోధనలూ చెబుతున్నాయి.
రోగనిరోధకశక్తికి: ఇందులో ఉండే సహజ చక్కెరలైన పాలీశాకరైడ్లకి యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. తద్వారా శరీరంలో ఉత్పత్తయ్యే హానికర ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం ద్వారా రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అలాగే ఇందులోని లిగ్నిన్ పీచు సైతం యాంటీఆక్సిడెంట్‌లా పనిచేసి రోగనిరోధక కణాల ఉత్పత్తికి తోడ్పడుతుందని పరిశోధనల్లోనూ స్పష్టమైంది. దాంతో శరీరానికి వ్యాధులమీద తిరగబడేశక్తి పెరుగుతుంది. ఈ రెండు గుణాలవల్ల బదరీఫలం మధుమేహం, హృద్రోగాల బారినుంచీ రక్షిస్తుందని చెబుతున్నారు. ఇంకా జలుబూ, ఫ్లూ ఇన్ఫెక్షన్లనీ నిరోధిస్తుందీ పండు.
నిద్రకి: చైనాలో రేగుపండ్లే నిద్రమాత్రలు. ఇందులోని జుజుబొసైడ్-ఎ అనే రసాయనం మెదడుని ప్రభావితం చేసి నిద్రపోయేలా చేస్తుందట. ఎలుకల్లో చేసిన పరిశీలనలోనూ ఈ విషయం స్పష్టమైంది. పైగా దీన్నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ మతిమరుపూ ఆల్జీమర్స్ రాకుండానూ అడ్డుకుంటుందని తేలింది. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడితో బాధపడేవాళ్లకి రేగుపండ్లు మంచి మందు. ఈ పండ్లతో మరిగించిన టీ తాగినా మంచిదే మరి. డిప్రెషన్‌కి మందులు వాడేవాళ్లు మాత్రం ఈ పండ్లనూ వాటి ఉత్పత్తుల్నీ వైద్యుల సలహామీదే తీసుకోవాలి.
క్యాన్సర్లకి: రేగులోని విటమిన్-సికి యాంటీక్యాన్సర్ గుణాలు ఉన్నాయనీ చెబుతున్నాయి తాజా పరిశోధనలు. ఈ పండ్ల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ను చర్మ, రొమ్ము, అండాశయ, కాలేయ, గర్భాశయ, పేగు క్యాన్సర్ల నివారణలో వాడినప్పుడు- ఆయా కణాలను నాశనం చేశాయట.
జీర్ణసంబంధిత వ్యాధులకి: రేగు పండ్లలో అధికంగా ఉండే పీచు పొట్ట గోడల్ని సంరక్షిస్తుంది. తద్వారా హానికర బ్యాక్టీరియా నుంచీ అల్సర్ల నుంచీ కాపాడుతుంది. ఈ పండు మంచి ప్రొబయోటిక్గానూ పనిచేసి, పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. తద్వారా కడుపులో మంటని తగ్గిస్తుంది. వీటి రసం నోటిపుండ్లనీ గొంతుమంటనీ కూడా నివారిస్తుంది. అందుకే చైనాలో రేగుపండ్ల గుజ్జుతో చేసిన ట్యాబ్లెట్లను జీర్ణ సంబంధ వ్యాధులకి వాడుతుంటారు. ఈ పండ్లు ఆకలినీ తగ్గిస్తాయట. కాబట్టి కాసిని రేగుపండ్లను చప్పరించడం ద్వారా బరువునీ నియంత్రించుకోవచ్చు.
బీపీకి: ఈ పండ్లలోని పొటాషియం కారణంగా బీపీ తగ్గుతుంది. వీటిల్లో సమృద్ధిగా ఉండే ఐరన్, ఫాస్ఫరస్‌లు రక్త కణ వృద్ధికి తోడ్పడటం ద్వారా రక్తహీనతనీ తగ్గిస్తాయి. ఈ పండ్లలోని ఆల్కలాయిడ్లూ శాపోనిన్లూ రక్తశుద్ధికి తోడ్పడతాయి. అలాగే కాల్షియం ఎముకబలాన్నీ పెంచుతుంది.చూశారుగా... ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే రేగుపండు తాజాగానే కాదు, ఎండినా మేలే అంటున్నారు నిపుణులు కూడా.
బదరీ వృక్షం... బాదరాయణ బంధం!
వెనకటికో ఆసామి ఎడ్లబండిమీద దూర ప్రయాణం చేస్తూ దారిలో ఓ ఇల్లు కనిపించగానే దిగి ‘ఏమోయ్...’ అంటూ చొరవగా ఆ ఇంట్లోకి వెళ్లాడట. ఆయన్ని యజమాని స్వాగతించి మర్యాదలు చేసి ‘స్వామీ మీరు మాకేమవుతార’ని అడిగినప్పుడు- ‘అస్మాకం... బదరీచక్ర యుష్మాకం బదరీతరుః బాదరాయణ సంబంధో యూయం యూయం వయం వయం’ అని సెలవిచ్చాడా పెద్దమనిషి. ‘మీ ఇంట్లో బదరీ(రేగు)వృక్షం ఉంది. నా బండి చక్రాలూ కర్రలూ దానితో చేసినవే. కాబట్టి మనది బాదరాయణ సంబంధం’ అని దానర్థం. రేగు చెట్టుకింద కూర్చుని భారతం రాయడంవల్లే వ్యాసుణ్ణి కూడా బాదరాయణుడు అంటారు.
ఆ చుట్టరికాల సంగతెలా ఉన్నా... రేగుపండ్లే కాదు, చెట్టు మొత్తం మానవాళికి ఉపయోగపడేదే. కాండాన్ని చెక్కగా వాడితే; ఆకుల్నీ బెరడునీ పండ్లనీ అలొవెరాతో కలిపి సబ్బులూ మాయిశ్చరైజర్లూ చేస్తున్నారు. వీటివల్ల ముడతలు పోవడమే కాదు, ఇవి సన్‌స్క్రీన్‌గానూ పనిచేస్తాయి. పైగా వీటివల్ల అలర్జీలూ రావట.
* ఈ ముళ్లమొక్క బెరడుని మరిగించి తీసిన డికాక్షన్ డయేరియాకి మంచి మందుగానూ పనిచేస్తుంది.
* చాలామంది రేగుపండ్ల గుజ్జును మాత్రం చప్పరించి గింజలు ఊసేస్తారు కానీ ఆ గింజల్లోనూ మంచి గుణాలెన్నో. అందుకే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో గుజ్జుతోపాటు గింజల్నీ దంచి వడియాల్లా పడతారు. ఇవి మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. ఈ గింజల్ని పొడిచేసి నూనెలో కలిపి రాసుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఈ పొడిని మరిగించి కషాయంలా తాగినా మేలే... గొంతునొప్పీ, ఆస్తమా, కండరాల నొప్పులూ తగ్గుతాయి.
ప్రేమ ఫలం!
రేగుపండ్లు తింటే సంతాన సాఫల్యత పెరుగుతుందనీ అంటారు. అంతేనా... వీటి తియ్యని వాసన యువతీయువకుల్ని ప్రేమలో పడేలా చేస్తుందట. అందుకే కారాకోరమ్ పర్వత ప్రాంతాల్లో నివసించే తెగల్లోని యువకులు రేగుపూల కొమ్మల్ని తమ టోపీల్లో ధరిస్తారట. ఆ వాసనకు అమ్మాయిలు ఆకర్షితులవుతారన్నది వాళ్ల నమ్మకం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!