పొట్లకాయతో వెరైటీగా...

కూరగాయల్లో పొట్లకాయ తెచ్చుకున్నప్పుడు గబగబా పెరుగుపచ్చడి చేసేయకుండా... ఫ్రై, పొడికూర వంటివి వండి చూడండి. పొట్లకాయా... అంటూ దీర్ఘాలు తీసే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు.

Published : 08 May 2022 01:33 IST

పొట్లకాయతో వెరైటీగా...

కూరగాయల్లో పొట్లకాయ తెచ్చుకున్నప్పుడు గబగబా పెరుగుపచ్చడి చేసేయకుండా... ఫ్రై, పొడికూర వంటివి వండి చూడండి. పొట్లకాయా... అంటూ దీర్ఘాలు తీసే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు.

క్రిస్పీ ఫ్రై

కావలసినవి: పొట్లకాయ ముక్కలు: రెండు కప్పులు, సెనగపిండి: మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి: టేబుల్‌స్పూను, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, జీలకర్ర: చెంచా, ఉప్పు: తగినంత, కారం: ఒకటిన్నర చెంచా, మిరియాలపొడి: పావుచెంచా, గరంమసాలా: అరచెంచా, పసుపు: అరచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో పొట్లకాయ ముక్కల్ని వేసుకుని కారం, అల్లంవెల్లుల్లిముద్ద, గరంమసాలా, మిరియాలపొడి, పసుపు, జీలకర్ర, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. అయిదు నిమిషాలయ్యాక పొట్లకాయ ముక్కలపైన సెనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి వేసి కలిపి తరువాత చాలా కొద్దిగా నీళ్లు చల్లుకుని మరోసారి కలపాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేడిచేసి ఈ ముక్కల్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


నువ్వులకూర

కావలసినవి: పొట్లకాయ ముక్కలు: కప్పు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు రెబ్బలు: నాలుగు, సెనగపప్పు: టేబుల్‌స్పూను, మినప్పప్పు: చెంచా, జీలకర్ర: అరచెంచా, ఆవాలు: అరచెంచా, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: టేబుల్‌స్పూను, నువ్వులు: టేబుల్‌స్పూను, పల్లీలు: రెండు చెంచాలు, బియ్యం: చెంచా, ఎండుమిర్చి: అయిదు.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నువ్వులు, పల్లీలు, బియ్యం, ఎండుమిర్చిని నూనె లేకుండా వేయించుకుని తీసుకోవాలి. వీటి వేడి పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసుకుని పొడిలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వేయించుకుని కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేయాలి. అవి కూడా వేగాక పొట్లకాయ ముక్కలు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు వేసి మధ్యమధ్య కలుపుతూ ఉంటే... పొట్లకాయ ముక్కలు మెత్తగా అవుతాయి. అప్పుడు చేసిపెట్టుకున్న నువ్వులపొడి వేసుకుని బాగా కలిపి కూర పొడిపొడిగా అయ్యాక దింపేయాలి.


కూటు

కావలసినవి: పొట్లకాయ ముక్కలు: అరకప్పు, పెసరపప్పు: పావుకప్పు, పసుపు: పావుచెంచా, సాంబార్‌పొడి: అరచెంచా, నూనె: మూడు చెంచాలు, ఆవాలు: చెంచా, మినప్పప్పు: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉప్పు: తగినంత.
మసాలాకోసం: మినప్పప్పు: చెంచా, దనియాలు: ఒకటిన్నర చెంచా, ఎండుమిర్చి: రెండు, మిరియాలు: పావుచెంచా, తాజా కొబ్బరితురుము: పావుకప్పు.

తయారీ విధానం: స్టౌ మీద కడాయి పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడెక్కాక మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలను వేయించుకుని తీసుకోవాలి. తరువాత వాటిని మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో పెసరపప్పు, పొట్లకాయ ముక్కలు... అవి మునిగేలా నీళ్లు పోసి స్టౌమీద పెట్టి రెండు కూతలు వచ్చాక కట్టేయాలి. స్టౌమీద మళ్లీ కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించి ఉడికించిన పెసరపప్పు, పొట్లకాయముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు సాంబార్‌పొడి, చేసిపెట్టుకున్న మసాలా వేసి బాగా కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.


చపాతీకి కష్టపడక్కర్లేదు

చపాతీ, పరోటా... వంటివి చేయాలంటే కాస్త పనే. ముందుగా ఆ పిండిని బాగా కలుపుకుని తరువాత ఒత్తుకుని పెనంమీద వేసి కాల్చుకోవాలి. ఇంట్లో నలుగురైదు గురు ఉండి... మనిషికి రెండుమూడు చొప్పున చేయాలన్నా అర గంట నుంచి ముప్పావుగంట పడుతుంది. దానికి ప్రత్యామ్నా యంగా ఈ లిక్విడ్‌ డౌ చపాతీలు ప్రయత్నించొచ్చు. దీన్నెలా చేయొచ్చంటే... కప్పు గోధుమపిండిలో రెండుకప్పుల నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి గరిటెజారుగా కలపాలి. తరువాత ఈ పిండిని వడకట్టు కుని ఓ గిన్నెలో వేసుకోవాలి. అయిదు నిమిషాలయ్యాక ఈ పిండిని గరిటెతో తీసుకుని పెనంమీద దోశలా వేసుకోవాలి. దీన్ని చపాతీ మాదిరి నూనె వేస్తూ కాల్చుకుని తీసుకుంటే సరి. ఒత్తే పని లేకుం డానే చపాతీలు తయారైపోతాయి. ఇంకా వెరైటీ కోరుకునేవారు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర వంటివి కూడా వేసుకోవచ్చు. ఇదేవిధంగా జొన్నరొట్టెను కూడా ప్రయత్నించవచ్చు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..