భయ్యా కోసం బర్ఫీ చేద్దాం!

పెసరపప్పు: కప్పు, చక్కెర: కప్పు, కోవా: ముప్పావుకప్పు, పాలు: పావుకప్పు, నెయ్యి: ముప్పావుకప్పు, నీళ్లు: ముప్పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా.

Updated : 12 Aug 2022 16:06 IST

భయ్యా కోసం బర్ఫీ చేద్దాం!

బర్ఫీలను ఇష్టపడనివాళ్లెవరు చెప్పండి... అందుకే సోదరుడి చేతికి రాఖీ కట్టాక వీటిల్లో నచ్చిన బర్ఫీతో నోటిని తీపి చేస్తే సరి... వీటి తయారీ కూడా సులువే సుమా...


పెసరపప్పుతో...

కావలసినవి: పెసరపప్పు: కప్పు, చక్కెర: కప్పు, కోవా: ముప్పావుకప్పు, పాలు: పావుకప్పు, నెయ్యి: ముప్పావుకప్పు, నీళ్లు: ముప్పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా.
తయారీ విధానం: పెసరపప్పును రెండుమూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీటిని పూర్తిగా వంపేసి మిక్సీలో వేసుకుని పాలుపోస్తూ మెత్తని పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో చక్కెర, నీళ్లు తీసుకుని స్టౌమీద పెట్టి కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగి, తీగపాకం వస్తున్నప్పుడు దింపేయాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక పెసరపప్పు మిశ్రమాన్ని వేసి స్టౌని సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి. అరగంట అయ్యాక కోవా, చక్కెర పాకం, యాలకులపొడి వేసి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గరకు అవుతున్నప్పుడు దింపేసి నెయ్యి రాసిన ప్లేటులో వేసుకుని ముక్కల్లా కోసుకోవాలి.


పనీర్‌తో...

కావలసినవి: పనీర్‌: కప్పు, కండెన్స్‌డ్‌మిల్క్‌: ముప్పావుకప్పు, పాలపొడి: అరకప్పు, యాలకులపొడి: అరచెంచా, డ్రైఫ్రూట్స్‌ పలుకులు: రెండు చెంచాలు.
తయారీ విధానం: ముందుగా పనీర్‌, కండెన్స్‌డ్‌మిల్క్‌ను మిక్సీలో వేసుకుని క్రీంలా వచ్చేవరకూ గిలకొట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి ఆ మిశ్రమం, పాలపొడి, యాలకుల పొడి వేసి కలుపుతూ ఉంటే... కాసేపటికి దగ్గరకు అవుతుంది. అప్పుడు దింపేసి నెయ్యి రాసిన ప్లేటులో పరిచి, డ్రైఫ్రూట్స్‌ పలుకుల్ని అలంకరించి... అయిదు నిమిషాలయ్యాక ముక్కల్లా కోయాలి.


బేసన్‌-సూజీతో...

కావలసినవి: సెనగపిండి: ఒకటిన్నర కప్పులు, నెయ్యి: ముప్పావు కప్పు, బొంబాయిరవ్వ: అరకప్పు, యాలకులపొడి: అరచెంచా, చక్కెరపొడి: ఒకటింబావు కప్పు, పిస్తా పలుకులు: కొన్ని.
తయారీ విధానం: ఓ గిన్నెలో సెనగపిండి, బొంబాయిరవ్వ వేసుకుని రెండింటినీ కలుపుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి అర కప్పు నెయ్యి వేయాలి. అది వేడెక్కాక సెనగపిండి- రవ్వ వేసి స్టౌని సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు టేబుల్‌స్పూను నెయ్యి వేసి కలపాలి. అయిదు నిమిషాలయ్యాక యాలకులపొడి, చక్కెరపొడి వేసి బాగా కలుపుతూ ఉంటే... దగ్గరకు అవ్వడం మొదలవుతుంది. అప్పుడు మిగిలిన నెయ్యివేసి ఓసారి కలిపి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యిరాసిన ప్లేటులో వేసి... పైన పిస్తా పలుకుల్ని అలంకరించి కనీసం రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత ముక్కల్లా కోస్తే సరి.


సెలబ్రిటీ స్పెషల్‌

అన్నయ్యకు ఓట్స్‌ కుకీస్‌ షూటింగ్‌లలో భాగంగా నేనెక్కడ ఉన్నా... రక్షాబంధన్‌ సమయానికి అన్నయ్య దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తా. ఆ రోజున తనకు కట్టే రాఖీని ఇష్టంగా ఎంచుకోవడమే కాదు... స్వీటు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటా.
మా అన్నయ్య రౌనక్‌ఖన్నా ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే నేను బయటి నుంచి స్వీటు కొనడం కన్నా ఇంట్లోనే తయారుచేయాలనుకుంటా. నాకు బేకింగ్‌ అంటే ఇష్టం కాబట్టి నెయ్యి, చక్కెర లేకుండా రుచితోపాటూ పోషకాలూ అందేలా కుకీలూ, కప్‌కేకుల్లాంటివి చేసేందుకు ప్రయత్నిస్తా. ఓట్స్‌ కుకీస్‌ అలాంటివాటిల్లో ఒకటి. వీటి తయారీ కోసం సరిపడా తేనె, ఒక గుడ్డు, కప్పు ఓట్స్‌, అరకప్పు గోధుమపిండి, చెంచా బేకింగ్‌ పౌడర్‌, అరచెంచా దాల్చినచెక్కపొడి, చిటికెడు ఉప్పు, అరకప్పు చాక్లెట్‌చిప్స్‌ తీసుకోవాలి. అన్నింటినీ ఓ గిన్నెలో వేసుకుని బాగా కలిపి కుకీల ఆకారంలో తయారు చేసుకోవాలి. వీటిని పది నుంచి పన్నెండు నిమిషాలు అవెన్‌లో బేక్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇవి రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యకరం కూడా.

- రాశీఖన్నా, నటి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..