రెడీమేడ్‌ ముగ్గులివి!

మునివేళ్లతో తీరుగా ముగ్గు వేయడం రాకపోయినా... పండుగ పూట వాకిట్లో వేయడానికి ఓ ముచ్చటైన డిజైన్‌ తట్టకపోయినా... అందాల రంగోలిని తీర్చిదిద్దే సమయం లేకపోయినా... ఈ సంక్రాంతికి క్షణాల్లో ముగ్గు పెట్టేయొచ్చు... అందుకోసమే వచ్చేశాయి ఈ రెడీమేడ్‌ ముగ్గులూ, రంగోలీ స్టెన్సిళ్లూ!

Published : 07 Jan 2023 23:58 IST

రెడీమేడ్‌ ముగ్గులివి!

మునివేళ్లతో తీరుగా ముగ్గు వేయడం రాకపోయినా... పండుగ పూట వాకిట్లో వేయడానికి ఓ ముచ్చటైన డిజైన్‌ తట్టకపోయినా... అందాల రంగోలిని తీర్చిదిద్దే సమయం లేకపోయినా... ఈ సంక్రాంతికి క్షణాల్లో ముగ్గు పెట్టేయొచ్చు... అందుకోసమే వచ్చేశాయి ఈ రెడీమేడ్‌ ముగ్గులూ, రంగోలీ స్టెన్సిళ్లూ!


అచ్చం వాటిలానే...

ఈ రెడీమేడ్‌ కాలంలో ఎన్నెన్నో వస్తువులు సిద్ధంగా దొరుకుతుంటే- ఇంటి అలంకరణలో ప్రత్యేక స్థానం ఉన్న రంగోలిలో మాత్రం ఆ వెసులుబాటు ఎందుకు ఉండకూడదు. సరిగ్గా అదే ఆలోచనతోనే నిమిషాల్లో వాకిట్లో వాలిపోయే రకరకాల ముగ్గులు వచ్చేశాయి. అందులో భాగంగానే ఈమధ్య రెడీమేడ్‌ ముగ్గుల స్టిక్కర్లూ దొరుకుతున్నాయి. ‘రంగోలి స్టిక్కర్లలాంటివి చాలానే ఉన్నాయి కదా. వీటికీ వాటికీ తేడా ఏమిటబ్బా’ అన్న సందేహం వచ్చిందా... ఇవి మామూలు స్టిక్కర్లలా ఉండవండీ. దూరం నుంచే కాదు, దగ్గరి నుంచి చూసినా ఇవి నిజమైన ముగ్గుల్లానే కనిపిస్తాయి. ఎందుకంటే వీటిల్లో... ప్లాస్టిక్‌ షీట్‌పైన రంగులు కాకుండా, రంగోలి డిజైన్‌ వేసి, దానిమీద రంగుల ముగ్గులపొడిని అతికిస్తారు. అందుకే ఇంటి గడప ముందు ఉంచిన ఈ స్టిక్కర్‌ ముగ్గు అచ్చంగా మనం వేసినట్టే ఉంటుంది. పైగా వీటిల్లోనే పండుగ థీమ్‌ బొమ్మలూ... పువ్వుల బార్డర్లూ దొరుకుతున్నాయి.


సొంత డిజైన్‌ వేసేద్దాం!

అమ్మమ్మల నుంచి అమ్మాయిల వరకూ అన్ని ట్రెండ్స్‌ మారినట్టే ముగ్గు వేసే తీరులోనూ ఎంతో మార్పు వచ్చింది. అందుకే ఈమధ్య చాలామంది  పువ్వులూ, లతలూ, దేవుళ్లతో రంగవల్లులు వేస్తున్నారు. అందరికీ అలా వేయాలని ఉన్నా సరిగా రాకపోవచ్చు. ఆ లోటును తీర్చడానికే మార్కెట్లోకి రకరకాల రంగోలీ అచ్చులు వచ్చేశాయి. ‘ఉడెన్‌ రంగోలి, ప్లాస్టిక్‌ నెట్‌ స్టెన్సిల్స్‌’ పేరుతో అందుబాటులో ఉన్న ఇవి వివిధ సైజుల్లో సెట్లలా దొరుకుతాయి. వీటి మీద ఉన్న ఖాళీల్లోంచి ముగ్గూ, రంగులూ వేసుకుని స్టెన్సిల్‌ని నెమ్మదిగా తీశామంటే, నేలమీద ఆ డిజైన్‌ ముగ్గు ఎంతో చక్కగా వచ్చేస్తుంది. కాస్త సృజనాత్మకంగా ఆలోచిస్తే ఈ అచ్చుల్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ సరికొత్త రంగోలీ డిజైన్‌ను సెట్‌ చేసుకోవచ్చు. అంటే మన అవసరాన్ని బట్టి స్టెన్సిల్‌ని అచ్చంగా వాడుకోవచ్చూ, లేదంటే దాంతోనే పెద్ద పెద్ద రంగోలి డిజైన్లనూ సొంతంగా సృష్టించుకోవచ్చూ.


రంగులు నింపితే చాలు

‘ఎప్పుడూ చుక్కల ముగ్గులూ, గీతల రంగోలీలేనా, ఈసారి కొత్త ముగ్గు ఏదైనా ప్రయత్నించి చూద్దాం అదీ నిమిషాల్లో అయిపోవాలి’ అని కోరుకునే వాళ్లు ఈ ‘డెకోడెస్క్‌ ఐలాండ్‌ రంగోలి’తో పండుగ రోజు అందంగా ముగ్గు పెట్టేయొచ్చు. పెద్దసైజు పళ్లెంలా ఉండే వీటిల్లో రంగోలి డిజైన్‌ ఆధారంగా ముగ్గుపొడి వేసేంత ఖాళీలు ఉంటాయి. మనకు నచ్చిన రంగుల్ని ఎంచుకుని ఆ ఖాళీల్లో నింపామంటే- చక్కటి ముగ్గు వచ్చేస్తుందంతే. కావాలంటే దీంట్లో పూరేకుల్నో, రంగుల బియ్యాన్నో నింపుకోవచ్చు. సమయం ఉన్నప్పుడు నిదానంగా ముందే రంగుల్ని నింపి అవసరమైనప్పుడు దీన్ని వాకిట్లో పెట్టుకోవచ్చు. అంతేకాదు, కాసేపు దేవుడి ముందు ఉంచిన ఈ రంగోలిని మరికాసేపటికి మనకు నచ్చిన చోటుకూ పట్టుకెళ్లొచ్చు.


వాకిలిని మెరిపించాలంటే...

దీపావళి పండుగకు ఎలాంటి ముగ్గు వేసినా చుట్టూ దీపాలు పెట్టామంటే... వాటి వెలుగులతోనే రంగోలికి కొత్త కళ వచ్చేస్తుంది. మరి అలా ఏ సందర్భంలోనైనా, అసలు దీపాలు వెలిగించకుండానే ముగ్గును మెరిపించాలంటే ఏంచేయాలో తెలుసా... రెడీమేడ్‌ ముగ్గుల్లోనే రకరకాల లోహాలతో దొరుకుతున్నవాటిని ఎంచుకుంటే చాలు. మీనాకారీ డిజైన్లలో, కుందన్లూ, ముత్యాలూ, రంగులూ అద్దుకున్న ఎన్నెన్నో రంగోలీలు మార్కెట్లో ఉన్నాయి. రకరకాల డిజైన్లలో అందుబాటులో ఉన్న ఈ రెడీమేడ్‌ ముగ్గులు- డిజైన్‌ను బట్టి విడివిడి ముక్కలుగా వస్తాయి. వాటన్నింటినీ జతచేస్తూ నేలమీద పెట్టుకున్నామంటే నిమిషాల్లో ముగ్గు సిద్ధమయిపోతుంది. పండుగ రోజు వీటిని పరుచుకుని పని అయిపోయాక తీసి దాచిపెట్టుకోవచ్చు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..