షాంపూలూ క్రీములూ మళ్లీ మళ్లీ నింపుకోవచ్చు..!

ఖాళీ అయిన షాంపూ బాటిల్, మాయిశ్చరైజర్‌ డబ్బాల్ని చెత్తలో పారేస్తున్నారా... అలా చేసేముందు ఒక్క క్షణం ఆలోచించండి... ‘అందులో ఎంత ప్లాస్టిక్కు ఉందీ... దానివల్ల పర్యావరణానికెంత నష్టం... తయారీకెంత ఖర్చయి ఉంటుందీ...’ అని.

Published : 24 Sep 2022 23:27 IST

షాంపూలూ క్రీములూ మళ్లీ మళ్లీ నింపుకోవచ్చు..!

ఖాళీ అయిన షాంపూ బాటిల్, మాయిశ్చరైజర్‌ డబ్బాల్ని చెత్తలో పారేస్తున్నారా... అలా చేసేముందు ఒక్క క్షణం ఆలోచించండి... ‘అందులో ఎంత ప్లాస్టిక్కు ఉందీ... దానివల్ల పర్యావరణానికెంత నష్టం... తయారీకెంత ఖర్చయి ఉంటుందీ...’ అని. అప్పుడు దాన్ని పారేయడానికి మనసు రాదు... అలాగని అవన్నీ దాచి పెట్టుకుంటే మాత్రం లాభమేంటీ... ఇల్లంతా చెత్తతో నిండిపోవడం తప్ప. అందుకే ఆయా కంపెనీలన్నీ ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాయి... అదే రీఫిల్లింగ్‌... వాడిన డబ్బాలో మళ్లీ నింపుకుని తెచ్చుకోవడం... తద్వారా అంతో ఇంతో సొమ్మూ పొదుపు చేయొచ్చు మరి..!

ప్యాకింగ్‌ విధానం రాకముందు... కొబ్బరినూనెనో వంటనూనెనో కొనాలంటే డబ్బానో సీసానో తీసుకెళ్లి పావులీటరో అర లీటరో పోయించుకుని తెచ్చుకోవడం ఒకప్పటి తరానికి తెలిసిందే. ఇప్పుడిప్పుడు జీరో వేస్ట్‌ అన్న ఆలోచనతో పప్పుల్నీ ఉప్పుల్నీ కూడా డబ్బాల్లో నింపుకుని తెచ్చుకునే దుకాణాలూ కొన్ని దేశాల్లో మళ్లీ మొదలవుతున్నాయి. వాటి సంగతెలా ఉన్నా, క్రీములూ లోషన్లూ షాంపూలూ సర్ఫ్‌లూ క్లీనింగ్‌ లోషన్లూ వంటి వాటిని- ఖాళీ డబ్బాలు తీసుకెళ్లి నింపుకునే పద్ధతి మాత్రం అంతటా రానుంది.

అవునండీ, కొన్ని బ్రాండ్‌లు తాము తయారుచేసే సౌందర్యోత్పత్తులూ డిటర్జెంట్‌ల కోసం రీఫిల్లింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గది ‘ద బాడీ షాప్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌’. సౌందర్య రక్షణకోసం ఎక్కువగా వీగన్‌ ఉత్పత్తుల్నే తయారుచేస్తోన్న ఈ విదేశీ బ్రాండ్‌, మనదేశంలోనూ రీఫిల్లింగ్‌ స్టేషన్లు ప్రారంభిస్తోంది. గతేడాది కాలంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 400 కియోస్క్‌లు ప్రారంభించి, 3.7 టన్నుల ప్లాస్టిక్కుని అంటే- సుమారు 1,70,000 బాటిళ్ల తయారీని అడ్డుకోగలిగింది. లాక్మే, ప్లమ్‌... వంటి లగ్జరీ బ్రాండ్‌లూ తమ అవుట్‌లెట్లలో- క్రీములూ లోషన్లతోపాటు కన్‌సీలర్, ఫౌండేషన్, లిప్‌స్టిక్, మస్కారా వంటి వాటిని కూడా వాడిన డబ్బాల్లోనే మళ్లీ నింపి ఇస్తున్నాయి.

ఇక, హిందుస్థాన్‌ యూనీ లీవర్‌ కంపెనీ అయితే మెట్రో నగరాల్లోని స్మార్ట్‌ దుకాణాల్లో సర్ఫ్‌ ఎక్సెల్, కంఫర్ట్, విమ్‌... వంటి వాటికి రీఫిల్లింగ్‌ వెసులుబాటు కల్పిస్తోంది. ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ కంపెనీ ఓలే ఫేస్‌క్రీమ్‌ని ప్యాక్‌ల రూపంలో విక్రయిస్తోంది... అంటే- బాటిల్‌తోపాటు ఓ రీఫిల్లింగ్‌ ప్యాక్‌నూ ఇస్తారు. కాబట్టి సీసాలో క్రీమ్‌ అయిపోగానే ప్యాక్‌లో ఉన్నదాన్ని నింపుకోవచ్చన్నమాట. మరికొన్ని కాస్మెటిక్‌ కంపెనీలు అన్ని రకాల ఉత్పత్తులకు సంబంధించిన రీఫిల్‌ ప్యాక్‌లనూ ఇంటికే పంపించే ఏర్పాట్లూ చేస్తున్నాయి. దీనివల్ల ప్రతీసారీ కొనే డబ్బా ధరలో 20 నుంచి 30 శాతం ఖర్చు తగ్గుతుందట. దీనివల్ల వినియోగదారుడితోపాటు కంపెనీలకీ లాభమే మరి. కాస్మెటిక్స్‌; లేదా డిటర్జెంట్స్‌ కోసం వాడే ఉత్పత్తుల్ని నింపే డబ్బాల కోసం నాణ్యమైన ప్లాస్టిక్కుని వాడాలి... అలాగే వాటిని రీసైకిల్‌ చేయాలన్నా బోలెడు ఖర్చు... అందుకే రీఫిల్లింగ్‌ విధానంతో ఇటు వినియోగదారుడికీ అటు ఉత్పత్తిదారుడికీ లాభమే.

ఎలా నింపుతారు?

షాంపూ లేదా బాడీ లోషన్‌ని నింపాలంటే కొన్ని కంపెనీలు భారీ దుకాణాల్లో వెండింగ్‌ మెషీన్‌ తరహాలో స్మార్ట్‌ ఫిల్‌ స్టేషన్లను ఏర్పాటుచేస్తున్నాయి. అక్కడికి వెళ్లి వెంట తెచ్చుకున్న పాత బాటిల్‌లో షాంపూని నింపుకోవచ్చు. లేదా అక్కడే అమ్మే స్మార్ట్‌ ఫిల్‌ బాటిల్‌లోనూ నింపుకుని వెళ్లొచ్చు. వెంట బాటిల్‌ తెచ్చుకుంటే సుమారు 30, అక్కడున్న స్మార్ట్‌ ఫిల్‌ బాటిల్‌లో నింపుకుంటే 15రూ. వరకూ ఖర్చు తగ్గుతుందట.

అయితే ఒకే బాటిల్‌లో పదేపదే నింపుకోవడం ఆరోగ్యానికి అంత క్షేమం కాదు. కాబట్టి మూడువిడతల వరకూ రీఫిల్‌ చేసుకునే ఏర్పాటు చేస్తున్నాయి ఆయా సంస్థలు. ఇందుకోసం బాటిల్‌మీద ఓ బార్‌కోడ్‌ ఉంటుంది. మూడుసార్లు అయ్యాక దాన్ని స్టోర్‌లోనే ఇచ్చి, కొత్తది తీసుకుంటే మళ్లీ నింపుకునేటప్పుడు ఒక రీఫిల్లింగ్‌ను ఉచితంగా ఇస్తున్నాయి కొన్ని సంస్థలు. నింపిన బాటిల్‌ మీద ఎక్స్‌పయిరీ డేట్, బ్యాచ్‌ నంబర్‌తో ఉన్న లేబుల్‌ను కూడా అతికిస్తారు. మొత్తమ్మీద వృథా ఖర్చుని తగ్గించి ప్లాస్టిక్కు నుంచి భూగోళాన్ని రక్షించేందుకు రీసైక్లింగ్‌కన్నా రీఫిల్లింగ్‌... ఎంతో మేలు అంటున్నారు పర్యావరణ ప్రియులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..