ప్రతి పనికీ మర మనిషి!

పనిమనిషి రాలేదని బెంగపడక్కర్లేదు... ఇంట్లో పెద్దవాళ్లను చూసుకోవడానికి ఎవరూలేరన్న ఒత్తిడి వద్దు... పిల్లలకు కొత్తవిషయాలు ఎలా నేర్పించాలో అన్న కంగారు అవసరం లేదు...

Published : 07 Jul 2024 01:35 IST

పనిమనిషి రాలేదని బెంగపడక్కర్లేదు... ఇంట్లో పెద్దవాళ్లను చూసుకోవడానికి ఎవరూలేరన్న ఒత్తిడి వద్దు... పిల్లలకు కొత్తవిషయాలు ఎలా నేర్పించాలో అన్న కంగారు అవసరం లేదు... ఎందుకంటే- ఇలా ఇంటిని చక్కబెడుతూనే అన్ని పనుల్లో చేదోడువాదోడుగా ఉండే రోబోలు ఎన్నో వచ్చేశాయి. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర్నుంచి ఇంటికి కాపలాఉండే వరకూ అలసట లేకుండా గంటలకొద్దీ పనిచేసే ఈ రోబోలదే  రాజ్యం.

 నేనే... బుజ్జి కుక్కను!

సోఫాలో పక్కన కూర్చున్న బుజ్జి కుక్కపిల్లపైన నెమ్మదిగా నిమిరితే చాలు, అది మెలికలు తిరిగిపోతూ దాని ప్రేమను చూపిస్తుంది. ‘పప్పీ...’ అంటూ ముద్దుగా పిలవగానే తోక ఊపుతూ పరుగున వచ్చేసి చుట్టూ తిరిగేస్తుంది. ‘అదేంటీ, పెంచుకున్న ఏ కుక్క పిల్లైనా అలాగే చేస్తుంది కదా’ అంటారేమో. అవును కానీ ఇది నిజమైన కుక్క కాదు మరి. అచ్చం కుక్కలాగే ఉన్న ‘టామ్‌బోట్‌’. ఈ డాగ్‌ రోబోని పెట్‌ లవర్ల కోసం తయారుచేశారు. చూడ్డానికి నిజమైన కుక్కరూపాన్ని పోలి ఉండటమే కాదు... భావోద్వేగాలనీ అదే మాదిరి చూపిస్తుంది.  కుక్కలంటే ఎంతో ఇష్టం ఉన్నా వాటిని పెంచుకోవడానికి కుదరని వాళ్లు- ఈ రియలిస్టిక్‌ డాగ్‌ రోబోను కొనుక్కోవచ్చు. సపర్యలేవీ చేయకుండానే, ఒక్క ఛార్జింగ్‌ మాత్రమే పెట్టి నిజమైన కుక్కతో ఉన్న అనుభూతిని ఆస్వాదించొచ్చు.


శుభ్రం చేసేస్తా!

‘ఎవరక్కడ...’ అనగానే ‘చిత్తం’ అంటూ క్షణాల్లో పనులు చేసిపెట్టే సేవకులు అప్పట్లో రాజులకు మాత్రమే ఉంటే... ‘హే రోబో...’ అని పిలవగానే ‘మీకేం కావాలి’ అంటూ మన పనులన్నీ చేయడానికి వచ్చేశాయి రకరకాల రోబోలు. వాటిల్లో ఇంటిని శుభ్రం చేయడానికి అందుబాటులో ఉన్నవే ‘రోబో వాక్యూమ్‌ సెల్ఫ్‌ ఎమ్టీ, గీకో రోబో విండో క్లీనర్‌’ రోబోలు. ‘ఇల్లు శుభ్రం చెయ్యీ, కిటికీలు తుడువూ’ అని చెప్పగానే... క్షణాల్లో ఆ రోబోలు ఇల్లంతా తిరిగేస్తూ, ఊడ్చడమూ, తడిబట్టేయడమూ, కిటికీ అద్దాలు తుడవడమూ లాంటివన్నీ చేసేస్తాయి. చెత్తాచెదారాన్ని తీసి ఒక దగ్గర ఉంచుతాయి కూడా. ఫోన్లో ఆప్‌ ద్వారా సెట్‌ చేస్తే రోజూ ఆ టైమ్‌ ప్రకారం వాటంతటవే పని చేస్తాయి. మనం ఇంట్లోలేకున్నా వాటిని ఆపరేట్‌ చేయొచ్చు. యంత్రాల్లా, మర మనుషుల్లా రకరకాలుగా ఉండే వీటిల్లో- ఇంటి అవసరాల్ని బట్టి మనకు కావలసినదాన్ని
ఎంచుకోవచ్చు, పనుల భారాన్ని తగ్గించుకోవచ్చు!


కమ్మని వంట చేస్తా!

వంటపనిని తేలిక చేయడానికి ఎన్నెన్నో కిచెన్‌ గ్యాడ్జెట్లూ, యంత్రాలూ ఉన్నాయి కానీ అసలు వంట చేయడానికే ఓ మర మనిషి ఉంటే సరిపోతుంది కదా అనుకున్నారేమో శాస్త్రవేత్తలు- కుకింగ్‌ రోబో, షెఫ్‌ రోబో పేర్లతో వీటిని దింపేశారు. స్పెయిన్‌లో ‘బీ ఏ రోబో5’ పేరుతో వంట చేసే మర మనిషిని తయారుచేశారు. ఇది నోరూరించే వంటలను చక్కగా వండేస్తుంది. ఇంకా వందల వంటకాలతో ప్రోగ్రామ్‌ చేసిన ‘స్మార్ట్‌ కుకింగ్‌ రోబో’, ‘షెఫ్‌ రోబో కిచెన్‌ ఫుడ్‌ ప్రాసెసర్‌’లో అయితే బటన్‌ నొక్కి వంటకాన్ని ఎంచుకొని అవసరమైన పదార్థాల్ని అందులో వేస్తే చాలు. కమ్మని వంటకాల్ని క్షణాల్లో తయారుచేసి అందిస్తుంది. స్టీమింగ్‌, మిక్సింగ్‌, బ్లెండింగ్‌, స్లో కుకింగ్‌, గ్రైండింగ్‌... ఇలా ఇంచుమించు 15 రకాల ఫంక్షన్లతో పనిచేస్తూ వంటగదిలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా నూడుల్స్‌, పాస్తాలాంటి బోలెడన్ని వెరైటీలు చేసే షెఫ్‌ రోబోల్లాంటివీ చాలా రకాలే దొరుకుతున్నాయి.


పెద్దవాళ్లకు తోడుంటా!

ఇంట్లో ఒంటరిగా ఉన్న పెద్దవాళ్లకు తోడుగా ఉంటుంది, కబుర్లు చెబుతూ సంగీతాన్నీ వినిపిస్తుంది. సమయానికి మందులు వేసుకోమంటూ దగ్గరుండి బాగోగులు చూస్తుంది, కోరుకున్న వాటిని తెచ్చిపెడుతుంది. ఇలా ఇంట్లో వ్యక్తిలానే అన్ని పనులు చేసి పెట్టడానికి వచ్చిందే ‘ఎల్డర్‌ కేర్‌ రోబో’. అత్యాధునిక సాంకేతికతనూ, కృత్రిమ మేధనూ ఉపయోగించి వీటిల్లో రకరకాల మర మనుషుల్ని తయారుచేశారు. తాకే తెరతో దాదాపు 15 భాషల్లో మనం మాట్లాడే మాటల్ని అర్థం చేసుకుని పని చేసే ‘పెప్పర్‌ రోబో’ ఒకటి. జపాన్‌లో తయారైన ఈ సెమీ హ్యూమనాయిడ్‌ రోబోను విదేశాల్లో ఎక్కువగా వాడుతున్నారు. మనుషుల హావభావాల్ని అర్థం చేసుకునే ఇది- పెద్దవాళ్ల ఒంటరితనాన్ని పోగొట్టి ఓ మంచి నేస్తంగా ఉంటుంది. ‘ఎలిక్యూ రోబో’ ఆ పనులతోపాటు ఫోన్‌ కాల్స్‌, ఈమెయిల్స్‌కు స్పందిస్తూ తినడం దగ్గర్నుంచి వాకింగ్‌కి వెళ్లడం వరకూ అన్ని విషయాల్నీ గుర్తు చేస్తుంది. మనిషి రూపంతో చిట్టి చేతుల్లో ట్రే పట్టుకుని ఉండే ‘కేర్‌ ఓ బోట్‌’ పెద్దవాళ్లకు అసిస్టెంట్‌లా ఏ పనైనా చేసిపెడుతుంది. ఉన్నచోటకి ఆహారాన్నీ, మందుల్నీ తెచ్చి ఇవ్వడంతోపాటు వంట చేయడంలోనూ, ఇల్లు శుభ్రం చేసేప్పుడూ సాయపడుతుంది. ఇవే కాదు, అత్యవసర పరిస్థితుల్లో స్పందిస్తూ కంటికి రెప్పలా చూసుకునే రోబోలూ చాలానే ఉన్నాయి!


పెట్‌నీ చూసుకుంటా!

పిల్లినో, కుక్కనో పెంచుకునే వాళ్లు సమయానికి తిండిపెట్టాలంటూ వాటికి తోడుగా ఇంట్లో ఒకరినైనా ఉంచుతారు. రోజూ కాసేపు ఆడిస్తూ బయటా తిప్పేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ పెంపుడు జీవుల్నీ సొంత పిల్లల్లానే చూసుకుంటారు. అది గమనించే- ఏఐతో పనిచేస్తూ మనకెన్నో సౌకర్యాల్ని అందిస్తున్న రోబోల్లో- పెట్స్‌ ఆలనాపాలనా చూడ్డానికి ‘స్మార్ట్‌ కంపేనియన్‌ రోబో ఫర్‌ పెట్స్‌’ వచ్చింది. కెమెరాలతో ఉండే ఇది- మనం ఆప్‌లో ఉంచిన వివరాల ఆధారంగా సమయానికి కుక్కలకీ, పిల్లులకీ ఆహారం అందించడమూ, సరదాగా వాటితో ఆడుకోవడమూ చేస్తుంటుంది. ఈ రోబోకి వీడియోకాల్‌ చేసి ఇంట్లో పెట్స్‌ ఏం చేస్తున్నాయో చూడొచ్చు కూడా.


చిన్నారుల దోస్త్‌ని!

పిల్లలతో కాసేపు సరదాగా గడపడానికీ, బుజ్జాయిలు అడిగిన వాటన్నింటికీ ఓపిగ్గా బదులివ్వడానికీ, చక్కటి కథలు చెబుతూ వాళ్లను బజ్జోపెట్టడానికీ సమయమే దొరకట్లేదని చెబుతారు చాలావరకూ తల్లిదండ్రులు. ఇదిగో అలాంటివారికి పరిష్కారం చూపించడానికే వచ్చేశాయి ఈ కిడ్స్‌ రోబోలు. వీటిల్లో ‘మైకో రోబో’ పిల్లలకు జోక్స్‌ చెప్పి నవ్విస్తుంది, పొడుపుకథలతో ప్రశ్నిస్తుంది. ఇంకా అడిగిన వాటన్నింటికీ సమాధానాలిస్తూ కథలు కూడా చెబుతుంది. అంతేకాదు, ఆటపాటలతో ఆడిస్తూనే యోగాలాంటివీ నేర్పించేస్తుంది. వాయిస్‌ కంట్రోల్‌తో పనిచేసే ‘కెకిడ్‌ రోబో’ పాటలు పాడటమూ, డాన్సులు చేయడంతోపాటు పిల్లల మాటల్నీ రికార్డు చేసి తిరిగి వినిపిస్తుంది. అటు చదువులో పిల్లల సందేహాల్ని తీర్చుతూ, ఇటు కబుర్లు చెప్పే ఈ రోబోఫ్రెండ్‌- ఈతరం చిన్నారులకు మంచి బహుమతి మరి!


కాపలా కాస్తా!

‘అరెరే ఆఫీసుకొచ్చే హడావుడిలో స్టవ్‌ కట్టేశానో లేదో’, ‘ఇంట్లో పిల్లలే ఉన్నారు ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే తెలిసేదెలా’... బయటకొచ్చాక ఇలా ఒక్కటేంటీ, ఇంటికి సంబంధించి బోలెడన్ని సందేహాలొస్తాయి. ఎక్కడికి వెళ్లినా ఆ చింత లేకుండా ఉంచేందుకే సరికొత్త ఆప్షన్లతో ‘హౌస్‌ హోల్డ్‌ రోబోలు’ వచ్చాయి. వీటిల్లో ‘అమెజాన్‌ ఆస్ట్రో’... వైఫై, ఆప్‌ల ద్వారా పనిచేస్తూ ఇంటిని మానిటరింగ్‌ చేస్తుంది. సెక్యూరిటీ సిస్టమ్‌తో తయారైన ఈ రోబో- ఇంటికి ఎవరైనా అపరిచితులు వస్తే... గట్టిగా శబ్దం చేస్తూ ఆ సమాచారాన్ని యజమానికి పంపుతుంది. మనుషుల్నీ, గొంతునీ(వాయిస్‌) గుర్తుపట్టే ఇది- ఏమాత్రం అనుమానంగా అనిపించినా వీడియో రికార్డు చేసి దాన్నీ మెసేజ్‌ చేస్తుంది. మనం చెప్పినట్టు ఇంటి మొత్తాన్ని పర్యవేక్షించడమే కాదు, ఫ్యాన్లూ, లైట్లూ, టీవీల స్విచ్‌ ఆఫ్‌ చేశామో లేదో గుర్తు చేస్తుంది. ఇంకా ఆప్‌లతోనే పనిచేసే స్మార్ట్‌ హోమ్‌ సిస్టమ్‌ మొత్తాన్నీ అదే ఆపరేట్‌ చేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు