రోటరీతో... ఉచితంగా విదేశీయానం!
పర్యటన అన్ని రకాల మేలని అంటుంటారు. ఆ పర్యటన విదేశాలకే అయితే... అక్కడే ఏడాదిపాటు ఉండే అవకాశం కల్పిస్తే...
రోటరీతో... ఉచితంగా విదేశీయానం!
పర్యటన అన్ని రకాల మేలని అంటుంటారు. ఆ పర్యటన విదేశాలకే అయితే... అక్కడే ఏడాదిపాటు ఉండే అవకాశం కల్పిస్తే... అక్కడ మనకయ్యే ఖర్చులన్నీ ఇంకెవరైనా భరించి ప్యాకెట్ మనీకీ డబ్బులిస్తామంటే? ...వావ్, ఎంత బాగుంటుందో కదా! తమ ‘ఎక్స్ఛేంజ్ ప్రాజెక్టుల’తో ఇవన్నీ చేస్తామంటోంది రోటరీ క్లబ్. వివిధ రకాల సేవలకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన ఈ సంస్థ... ఇందులోనూ తనకి తానే సాటి అనిపించుకుంటోంది. ఎలాగో చూడండి...
విద్యార్థుల్ని విదేశాలకి పంపించి, అక్కడివాళ్ళని ఇక్కడికి రప్పించే యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు... మనదేశంలో చాలావరకూ పెద్ద విద్యాసంస్థలకే పరిమితమవుతున్నాయి. అలాకాకుండా, అసలు ఏ విద్యాసంస్థలతోనూ పనిలేకుండా ఆసక్తి ఉన్నవాళ్ళందరూ విదేశాలకు వెళ్ళేలా చూడటమే... ఈ రోటరీ క్లబ్ ప్రాజెక్టుల ప్రత్యేకత! విద్యార్థులే కాకుండా వివిధ వృత్తుల నిపుణులు కూడా విదేశాలకి వెళ్ళి తమ రంగానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలని నేర్చుకునేలా ఉంటున్నాయి ఈ ప్రాజెక్టులు.
విద్యార్థుల కోసం...
‘అమ్మానాన్నల తోడులేకుండా మార్కెట్‌కి కూడా వెళ్ళని నేను తొలిసారి ఒంటరిగా వేరే దేశానికి - అదీ బ్రెజిల్‌కు వెళ్ళాను. ఏడాదిపాటు మూడు కుటుంబాల ఆతిథ్యం పొందాను. వాళ్ళ అధికార భాష పోర్చుగీసు నేర్చుకోవడమే కాదు... అక్కడి సంస్కృతినీ చాలా దగ్గరగా చూడగలిగాను. ఏడాదిపాటు ఓ కాలేజీలో చదువుకున్నాను. ముఖ్యంగా మనదేశంలోని దీపావళిని నాకు ఆతిథ్యమిచ్చిన కుటుంబానికి పరిచయం చేయడం, ఆ రోజు మన ఇండియన్ స్వీట్స్ చేసి వాళ్ళకి పెట్టడం... మరచిపోలేని అనుభూతి!’ అంటుంది నబీహా అమ్రిన్. 2019-20 మధ్య రోటరీ క్లబ్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రాజెక్టులో భాగంగా విదేశీ పర్యటనకి వెళ్ళిన అమ్మాయి తను. ఈ యూత్ ఎక్స్ఛేంజి ప్రాజెక్టుకు 15 నుంచి 18 ఏళ్ళలోపున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల్ని ఏ దేశానికి పంపించాలీ అన్నది... అక్కడి రోటరీ సభ్యుల వీలూ ఆసక్తుల్ని బట్టి నిర్ణయిస్తారు. వాళ్ళ భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఒకరు ఏ దేశానికైనా వెళితే అక్కడి నుంచి ఇక్కడికి మరో విద్యార్థిని రప్పిస్తారు. ఈ ప్రాజెక్టు కింద మూడు నెలల నుంచి ఏడాదిపాటు విదేశాల్లో ఉండొచ్చు. ఆ దేశంలో ఏదైనా ‘షార్ట్ టెర్మ్’ కోర్సు చేయాలన్నా వాళ్ళు సాయం చేస్తారు. విద్యార్థులకి ఏ చిన్న సమస్య వచ్చినా తెలుసుకోవడానికి ప్రత్యేక కౌన్సిలర్‌నీ నియమిస్తారు.
ఎవరైనా వెళ్ళొచ్చా: ఔను! ఈ ప్రాజెక్టు కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రోటరీ క్లబ్ తమ సభ్యుల పిల్లలకే ప్రాధాన్యం ఇచ్చినా... బయటివాళ్ళకీ ‘నో’ చెప్పదు. విద్యార్థుల నడతా, వాళ్ళ మార్కులూ, క్రీడలూ, సేవా కార్యక్రమాలూ తదితరాల్లో ఉన్న ఆసక్తిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇందుకోసం స్థానిక రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్న రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3150 పరిధిలోకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వస్తాయి. ఈ సంస్థ తన పరిధిలో ఇద్దరు విద్యార్థుల్ని ఎంపిక చేసి ఏటా యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం కోసం పంపిస్తోంది.
ప్రొఫెషనల్స్ కూడా...
వైద్యం, ఇంజినీరింగ్, ఆడిటింగ్ వంటి వృత్తి నిపుణులు సైతం విదేశాల్లో తమ రంగం గురించి అధ్యయనం చేయడానికీ రోటరీ ‘న్యూ జనరేషన్ సర్వీస్ ఎక్స్ఛేంజ్’ అన్న ప్రాజెక్టుని నిర్వహిస్తోంది. 18 నుంచి 30 ఏళ్ళలోపువాళ్ళు దీనికి అర్హులు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వెళ్ళే దేశాన్ని బట్టి పాకెట్ మనీని నిర్ణయిస్తారు. మరి 30 ఏళ్ళు దాటినవాళ్ళకి ఏ కార్యక్రమాలూ లేవా అంటే... వాళ్ళకీ ‘గ్రూప్ స్టడీస్’ పేరుతో ఓ ప్రాజెక్టు ఉంది. పేరుకు తగ్గట్టు దీనికి బృందంగానే వెళ్లాలి. ఆ బృందాన్ని మీరే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ... పర్యటన కాలం ఎక్కువలో ఎక్కువగా మూడు నెలలే ఉంటుంది.
సభ్యులై ఉండాలా?: ఈ రెండు ప్రాజెక్టులకీ ఒకప్పుడు రోటరీ సభ్యులు కానివాళ్ళనే ఎంచుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకీ అవకాశం కల్పిస్తున్నారు. న్యూ జనరేషన్ సర్వీస్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమానికి... రోటరీ క్లబ్‌వాళ్ళ యువబృందమైన ‘రోటరాక్ట్’ సభ్యులకి ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐదు వేల రూపాయల వార్షిక ఫీజుతో కూడిన సభ్యత్వం ఇది. సభ్యులుగా ఉంటూ వివిధ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నవాళ్ళకి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. గ్రూప్ స్టడీస్‌కి మాత్రం రోటరీ సభ్యత్వం తప్పనిసరి కాదు.
మరి ఖర్చు?: ఈ ప్రాజెక్టులన్నింటికీ రానుపోను ఫ్లైట్ ఖర్చులు మాత్రం ఎవరికివారే భరించాల్సి ఉంటుంది. వెళ్ళేవాళ్ళందరూ ఆయాదేశాల్లోని రోటరీ సభ్యుల కుటుంబాలతోనే కలిసి ఉండాలనే నియమం ఉంది. కాబట్టి, ఆహారం- బస- వసతులకి సమస్య ఉండదు. పర్యటించే దేశాన్ని బట్టి వంద డాలర్లదాకా పాకెట్ మనీ కూడా ఇస్తారు. విద్యార్థి అయినా, వృత్తినిపుణులైనా మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికీ, విదేశాల్లోని సంస్కృతిని అతి దగ్గరగా తెలుసుకోవడానికీ... ఆ క్రమంలో మనల్ని మనం విశ్వమానవులుగా మార్చుకోవడానికి ఇదో చక్కటి అవకాశం. ఓసారి ప్రయత్నించి చూడండి..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
TTD: గరుడ వాహనంపై మలయప్పస్వామి.. భక్త జనసంద్రంగా తిరుమల
-
Manchu Lakshmi: నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్
-
Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి