Updated : 15 Aug 2022 16:31 IST

ఈ ఇటుకలకి కాంక్రీటు అక్కర్లేదు!

నిర్మాణ రంగంలో కాంక్రీటులో వాడే సిమెంట్‌ కారణంగా ఎనిమిది శాతం కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాతావరణంలోకి విడుదల అవుతుంది. అందుకే ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ నిపుణులు పారిశ్రామిక వ్యర్థాల నుంచి సరికొత్త పాలిమర్‌ను రూపొందించారు. ఇటుకల్ని బంధించి ఉంచే కాంక్రీటు బదులుగా దీన్ని వాడుకోవడం ద్వారా సిమెంట్‌ తయారీని తగ్గించవచ్చు. వాడిపారేసిన చెక్క వస్తువుల్నీ పాత టైర్లనీ పొడిలా చేసి, డై సైక్లో పెంటాడైన్‌, సల్ఫర్‌లతోపాటు కెనోలా నూనెనీ కలిపి కొత్త రకం పాలిమర్‌ను తయారుచేశారు. దీన్ని వేడి చేసి చల్లార్చడం ద్వారా ఇటుకల్లా రూపొందించారు. వీటిని ఒకదానిమీద ఒకటి పేర్చి అమైన్‌ అనే ఉత్ప్రేరకాన్ని స్ప్రే చేస్తే చాలు, కాంక్రీటుతో పనిలేకుండానే అతుక్కుపోతాయి. పైగా ఈ పాలిమర్‌ ఇటుకలు తేలికగానూ సంప్రదాయ కాంక్రీటుకన్నా 16 రెట్లు దృఢంగానూ ఉండటంతోపాటు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్నీ తట్టుకుంటాయి అంటున్నారు.


ఎ-పుస్తకాలదే హవా!

ఇ-బుక్స్‌ రావడంతో కాగితంతో తయారైన పుస్తకాలు చదివేవాళ్ల సంఖ్య తగ్గిపోతుంది అనుకున్నారు. అయితే ఆగ్మెంటెడ్‌ రియాలిటీ కారణంగా మళ్లీ కాగితం పుస్తకాలకు డిమాండ్‌ పెరగనుంది అంటున్నారు సర్రే యూనివర్సిటీ పరిశోధకులు. ఎందుకంటే- ఇప్పటికే గ్లాసెస్‌ లేదా స్మార్ట్‌ గ్లాస్‌ సాయంతో పుస్తకంలోని అంశాలకు సంబంధించిన దృశ్యాలను చూడగలిగే ఆగ్మెంటెడ్‌ రియాలిటీ బుక్స్‌ మార్కెట్లోకి వచ్చాయి. అయితే ‘నెక్స్ట్‌జనరేషన్‌ ప్రాజెక్టు’లో భాగంగా థర్డ్‌ జనరేషన్‌ వెర్షన్‌ పేరుతో సరికొత్త ఆగ్మెంటెడ్‌ బుక్స్‌కి రూపకల్పన చేశారు నిపుణులు. వీటినే ఎ-బుక్స్‌గా పిలుస్తున్నారు. ఇందులో పేపర్‌నీ స్క్రీన్‌నీ పక్కపక్కనే ఉంచి చదువుకోవచ్చు. అదెలా అంటే- కేవలం పేజీలో ఉన్న బటన్‌ను వేలుతో నొక్కడం లేదా టచ్‌ చేయడం ద్వారా అందులోని సమాచారానికి సంబంధించిన దృశ్యాలన్నీ దానికి పక్కనే ఏర్పడిన స్క్రీన్‌మీద చక్కగా కనిపిస్తాయట. పవర్‌ ఎఫిషియెన్సీ, ప్రీ-ప్రింటెడ్‌ కండక్టివ్‌ పేపర్‌ అనే సాంకేతికత ఆధారంగా ఎ-పుస్తకాలను రూపొందించడం వల్ల వైర్లూ ఇతరత్రా స్మార్ట్‌ పరికరాల సాయం అవసరం కూడా లేదు అంటున్నారు సదరు నిపుణులు. దీనివల్ల పుస్తకంలో రాసి ఉన్న అంశాన్ని దృశ్యం ద్వారా మరింత త్వరగా అర్థం చేసుకోవచ్చన్నమాట. అందుకే భవిష్యత్తులో ట్రావెల్‌ అండ్‌ టూరిజం, విద్యారంగంలోని అనేక అంశాలకు సంబంధించినవన్నీ ఎ-బుక్స్‌ రూపంలోనే రానున్నాయని చెబుతున్నారు.  


ప్యాచ్‌తో పరీక్ష!

ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, గుండె ఎలా పనిచేస్తుంది, జీర్ణవ్యవస్థ సరిగానే ఉందా... అని తెలుసుకోవడానికి వైద్యులు ఏం చేస్తారు... ఎమ్మారై స్కాన్‌, ఎక్స్‌-రే, అల్ట్రా సౌండ్‌ స్కాన్‌... వంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఇక, వాటి అవసరం లేకుండా ఒంటిమీద చిన్న ప్యాచ్‌ అతికించేస్తే సరిపోతుంది... లోపలి భాగాలన్నీ ఎలా పనిచేస్తున్నాయనే విషయాన్ని అది పసిగట్టి చెప్పేస్తుంది అంటున్నారు మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు. చిన్నపాటి బ్యాండ్‌ ఎయిడ్‌ని తలపించే ఈ ప్యాచ్‌ని అవసరమైనచోట అతికించుకుంటే చాలు, 48 గంటలపాటు అది శరీరంలోని అవయవాలన్నింటినీ చక్కగా స్కాన్‌ చేసి సమాచారాన్ని ఫోన్‌లోని ఆప్‌కు పంపిస్తుంది. ఆయా స్టిక్కర్ల ద్వారా నడుస్తున్నప్పుడూ సైకిల్‌ తొక్కేటప్పుడూ కూర్చున్నప్పుడూ నిలబడినప్పుడూ గుండె, ఊపిరితిత్తులు, పొట్ట... తదితర భాగాలన్నీ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చట. అంటే- ఈ ప్యాచ్‌ శబ్దతరంగాల ద్వారా సేకరించిన సమాచారం, బొమ్మల రూపంలోకి మారి ఫోన్‌ ఆప్‌లో కనిపిస్తుందన్నమాట. దాంతో ఈ ప్యాచ్‌ల ద్వారా శరీరంలోని అవయవాలన్నింటినీ ఎవరికి వాళ్లు సెల్‌ఫోన్‌లో చూసుకోవచ్చనీ గర్భిణులయితే శిశువు పెరుగుదలనీ తెలుసుకోవచ్చనీ అంటున్నారు.


చనిపోయినా పనిచేస్తాయి

సాధారణంగా చనిపోయిన కొన్ని క్షణాల్లోనే అవయవాలన్నింటికీ రక్తప్రసరణ ఆగిపోవడంతో అవి పనిచేయడం మానేస్తాయి. అయితే శరీరంలోని అవయవాలూ కణజాలాల పనితీరు ఒక్కసారిగా ఆగిపోదనీ ఈ ప్రక్రియ క్రమేణా జరుగుతుందనీ గుర్తించారు యేల్‌ యూనివర్సిటీ నిపుణులు. దాంతో సరికొత్త టెక్నాలజీతో ఆయా కణాలను మరికొంతసేపు సజీవంగా ఉంచగలిగే ద్రవాన్ని రూపొందించారు. చనిపోయిన వెంటనే ఈ ద్రవాన్ని శరీరంలోకి ఇంజెక్టు చేస్తే అవయవాలన్నింటికీ రక్తప్రసరణ జరిగి అవి తిరిగి పనిచేస్తాయట. పందుల్లో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు. చనిపోయిన గంట వరకూ శరీరంలోని అవయవాలన్నింటినీ 
పనిచేసేలా చేయడం వల్ల- అవయవదానంలో భాగంగా ఎక్కువ మంది నుంచి అవయవాల్ని సేకరించి అవసరమైనవాళ్లకు అమర్చడానికి వీలవుతుంది. ఈ కొత్త ప్రయోగాన్ని ఆర్గాన్‌-ఎక్స్‌ పేరుతో పిలుస్తున్నారు. గతంలో బ్రెయిన్‌-ఎక్స్‌ అనే ప్రయోగం ద్వారా చనిపోయిన నాలుగు గంటలవరకూ మెదడు పనిచేసేలా చేయగలిగారు. ఇప్పుడు దాని పరిధిని పెంచి, అవయవాలన్నీ గంటవరకూ సజీవంగా ఉండేలా చేయగలిగారు. కాబట్టి మున్ముందు ఈ ప్రక్రియతో అవయవ గ్రహీతల సంఖ్య పెరుగుతుందనేది నిపుణుల అభిప్రాయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని