Updated : 22 May 2022 06:33 IST

సైన్స్‌ సంగతులు

వృద్ధాప్యంలో ఉదారత!

వయసులో ఉన్నప్పుడు ఎలాగున్నా వృద్ధాప్యంలో కొంతమంది ఎంతో ఉదారంగా తమ ఆస్తిపాస్తుల్ని దానం చేస్తుంటారు. దీనికి కారణం మెదడులోని రసాయనాలేనట. ఆ వయసులో ఆక్సీటోసిన్‌ అనే హార్మోన్‌ వాళ్లలో ఎక్కువగా విడుదలవుతుందనీ దాని ఫలితంగానే వాళ్లలో దాతృత్వం పెరుగుతుందనీ క్లేర్‌మాంట్‌ గ్రాడ్యుయేట్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. వయసు మీద పడేకొద్దీ వ్యక్తిలోని ప్రవర్తనకు సంబంధించిన మార్పునకు కారణం కూడా ఈ రసాయనమే అని తేల్చి చెబుతున్నారు. ఇందుకోసం వీళ్లు తరచూ విరాళాలు ఇచ్చే గుణం ఉన్న 18 -99 సంవత్సరాల వయసు మధ్యలోని వందమంది వ్యక్తుల్ని ఎంపికచేసి మరీ పరిశీలించారట. అందులో ఆక్సీటోసిన్‌ రసాయనం ఎక్కువగా విడుదలయ్యేవాళ్లలో జీవితం పట్ల సంతృప్తి కనిపించిందనీ అందుకే వాళ్లు తమకున్న దాంట్లో దానాలు ఎక్కువగా చేస్తున్నారనీ అంటున్నారు. అయితే ఈ ఆక్సీటోసిన్‌ హార్మోన్‌ వయసులో ఉన్న వాళ్లలోకన్నా వృద్ధుల్లో ఎక్కువగా ఉందట. దీనివల్లే వయసులో ఉన్నవాళ్లతో పోలిస్తే వృద్ధుల్లో దానగుణం ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు, కొందరు తమకున్నదాంట్లో సంతృప్తికరంగా ఆనందంగా జీవించడానికీ మరికొందరు అలా ఉండలేకపోవడానికీ కారణం కూడా ఈ హార్మోనే కారణం కావచ్చు అంటున్నారు.


ఇన్సులిన్‌ నేసల్‌ స్ప్రే!

మధుమేహులు ఇన్సులిన్‌ను ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవడం తెలిసిందే. అయితే హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కి చెందిన పరిశోధకులు చక్కెర బాధితులకు ఇన్సులిన్‌ను నేసల్‌ స్ప్రే రూపంలో ఇచ్చి చూశారట. దీనివల్ల వాళ్లలో వయసుతోపాటు తలెత్తే ఆలోచనాశక్తి క్షీణతా మతిమరపూ తగ్గినట్లు గుర్తించారు. గత రెండు దశాబ్దాలుగా చేస్తున్న పరిశీలనల్లో- ఇన్సులిన్‌ నిరోధం కారణంగానే మెదడు పనితీరూ తగ్గుతున్నట్లు స్పష్టమైంది. దీని ఆధారంగా వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యానికి ఇన్సులిన్‌ అవసరం చాలా ఉందనీ, అందుకే ఆ హార్మోన్‌ను నేరుగా మెదడుకి చేరుకునేలా ముక్కు ద్వారా పంపిస్తే ఫలితం ఉంటుందనీ ఆలోచించి, కొందరికి ఇన్సులిన్‌ను సాధారణ పద్ధతుల్లోనూ మరికొందరికి నేసల్‌ స్ప్రే రూపంలోనూ ఇవ్వగా- స్ప్రే చేసినవాళ్లలో మతిమరపు వచ్చే లక్షణాలు తక్కువైనట్లు గుర్తించారు. అయితే ఈ విధానంవల్ల అప్పటికే ఆల్జీమర్స్‌ వచ్చినవాళ్లకన్నా సాధారణ మతిమరపు వచ్చే ప్రమాదం ఉన్నవాళ్లలో మాత్రం ఫలితం కనిపించిందట.


కార్చిచ్చులతో క్యాన్సర్లు!

వేసవిలో అడవులు అంటుకుని మంటలు రేగడం చూస్తుంటాం. అయితే తరచూ మంటలు చెలరేగే ప్రాంతాలకు సమీపంలో నివసించేవాళ్లకి క్యాన్సర్లు వచ్చే ప్రమాదమూ ఉందని అంటున్నారు కెనడాలోని మెక్‌గిల్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ పొగను పీల్చడం వల్ల ఆస్తమా, హృద్రోగాలు... వంటి సమస్యలు వస్తాయనేది గతంలోనే తెలిసింది. గర్భిణీలకీ ఇది ప్రమాదకరమే. కానీ దీర్ఘకాలంలో దీని ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని ఇంతవరకూ పెద్దగా గమనించలేదు. అందుకే ఇరవై లక్షలమందిని ఇరవయ్యేళ్లపాటు నిశితంగా పరిశీలించగా- అడవులు అంటుకునే ప్రదేశాలకు సమీపంలో- అంటే, యాభైకిలోమీటర్లలోపు నివసించేవాళ్లను- ఇతర ప్రదేశాల్లో జీవించేవాళ్లతో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్లూ మెదడులో కంతులూ ఎక్కువగా నమోదైనట్లు తేలింది. దీన్నిబట్టి కట్టెలు కాల్చే పొయ్యిల నుంచి వచ్చే పొగ కూడా క్యాన్సర్లకు కారణమే అంటున్నారు. మొత్తమ్మీద తరచూ కార్చిచ్చులు చెలరేగే ప్రదేశాల్లో జనావాసాలు ఏర్పాటుచేయకపోవడమే మంచిదన్నమాట.


బాధలకీ నిద్రే పరిష్కారం!

నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలని పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ బెర్‌్్నకు చెందిన పరిశోధకులు మానసిక సమస్యలకీ నిద్రే పరిష్కారం అంటున్నారు. ముఖ్యంగా కలల నిద్ర(ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ స్లీప్‌)మరీ మంచిదట. దీనివల్ల దుఃఖాన్ని కలిగించే భావనలన్నీ తొలగిపోతాయని ప్రయోగపూర్వకంగా చెబుతున్నారు. తీవ్రమైన భావోద్వేగాలతో కూడిన ఈ నిద్రాస్థితి ప్రత్యేకమైనది అన్నది తెలుసుకోగలిగారు కానీ అలా ఎందుకు జరుగుతుందనేది నేటివరకూ బోధపడలేదు. అందుకే దశాబ్దాలుగా పరిశీలిస్తూనే ఉన్నారు. మెలకువ స్థితిలో ఎదుర్కొన్న సంఘటనలకు సంబంధించిన భావనలు రెమ్‌స్లీప్‌లో మళ్లీ గుర్తుకొస్తుంటాయి. ఆ సమయంలో నాడీకణాల పనితీరుని గమనించినప్పుడు-  భయం, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌, ట్రామా... వంటి భావనలు బలహీనమై, ఆనందాన్ని కలిగించే భావోద్వేగాలే బలోపేతం అవుతున్నట్లు గుర్తించారు. అంటే- కలల నిద్రతో భయానక సంఘటనలూ దుఃఖాన్ని కలిగించే జ్ఞాపకాలూ క్రమంగా తొలగిపోతాయనీ తద్వారా మానసిక సమస్యలు తగ్గుతాయనీ భావిస్తున్నారు. నిద్రపోతే బాధ తగ్గుతుందని పెద్దవాళ్లు చెప్పడం వెనక ఉన్నదీ ఇదే కావచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని