నాన్న ఎప్పుడూ కోప్పడలేదు!

నటి, గాయని, స్వరకర్త, చఫె్‌... ఇలా మల్టీటాస్కింగ్‌కి పెట్టింది పేరు శ్రుతిహాసన్‌. వ్యక్తిగతంగా ఎంత ఎదిగినా... తనని కమల్‌హాసన్‌ కూతురని పిలిస్తేనే ఇష్టమనే శ్రుతి... ‘ఎన్‌బీకే 107’, ‘సలార్‌’... సినిమాలతో మరోసారి తెలుగు అభిమానుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా

Updated : 03 Jul 2022 12:05 IST

నాన్న ఎప్పుడూ కోప్పడలేదు!

నటి, గాయని, స్వరకర్త, చఫె్‌... ఇలా మల్టీటాస్కింగ్‌కి పెట్టింది పేరు శ్రుతిహాసన్‌. వ్యక్తిగతంగా ఎంత ఎదిగినా... తనని కమల్‌హాసన్‌ కూతురని పిలిస్తేనే ఇష్టమనే శ్రుతి... ‘ఎన్‌బీకే 107’, ‘సలార్‌’... సినిమాలతో మరోసారి తెలుగు అభిమానుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా తన మనసులోని ముచ్చట్లను చెబుతోందిలా...

నాన్న స్టైల్‌ అదే

నేనెంత అల్లరి చేసినా నాన్న ఎప్పుడూ తిట్టడం, కొట్టడం వంటివి చేసేవారు కాదు కానీ... ‘నువ్విలా ఉంటావని అనుకోలేదు. కాస్త నిరాశకు లోనయ్యా’ అనేవారు.


ఆ రోజు ఇప్పటికీ గుర్తే   

చిన్నప్పుడు నన్ను స్కూలు నుంచి మా మేనేజర్‌ తీసుకొచ్చేవారు. ఓసారి మా మేనేజర్‌తో ఇంటికొచ్చాక తెలిసింది నాన్నకు పెద్ద యాక్సిడెంట్‌ అయ్యిందనీ, హాస్పిటల్‌లో ఉన్నారనీ. ఆ రోజున నాన్నను అలా చూసేసరికి చాలా ఏడుపొచ్చేసింది. ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే కళ్ల వెంట నీళ్లు వచ్చేస్తాయి.


ఇష్టపడే ఆహారం

సాంబారు అన్నంతోపాటు ఆలూ వేపుడు ఉంటే చాలు. ముఖ్యంగా మా అత్త చేసే వంటకాలంటే చాలా ఇష్టం. ఇక, అన్నం ఎదురుగా ఉందంటే అస్సలు ఆగలేను.


నచ్చే ప్రాంతం

నేను పుట్టింది చెన్నైలో అయినా... ముంబయి అంటే ఇష్టం. ఎందుకంటే నేనక్కడ ఎక్కువ సంవత్సరాలు ఉన్నా. అక్కడ స్నేహితులూ ఎక్కువే.


ఆ హోటల్‌ జ్ఞాపకం

మా చెన్నైలోని తాజ్‌ కోరమండల్‌ హోటల్‌ ఎంత నచ్చుతుందో మాటల్లో చెప్పలేను. అది మాకు రెండో ఇల్లులాంటిది. అందుకే చెన్నైలో ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటా.


వాటినుంచి బయటపడ్డా

ఒకప్పుడు ఒంటరిగా ఉండాలంటే భయం. ఆర్థికంగా నిలదొక్కుకోలేదనీ నిరాశ చెందేదాన్ని. నా మాటలు ఎదుటివారు ఎలా స్వీకరిస్తారోననీ కంగారుపడేదాన్ని. క్రమంగా వాటన్నింటి నుంచీ బయటపడ్ఢా ధైర్యంగానూ మారా.


పేరు మార్చి చెప్పేదాన్ని

చిన్నప్పుడు నన్ను అంతా మీ నాన్న కమల్‌హాసన్‌ కదూ అని అడిగేవారు. అందరికీ అవునని చెప్పడం నచ్చేది కాదు. అందుకే స్కూలుకు వెళ్లాక ఎవరైనా ‘మీ నాన్న కమల్‌హాసన్‌ అట కదా...’ అంటే... కాదనీ నా పేరు పూజా రామచంద్రన్‌ అనీ చెప్పేదాన్ని. కానీ కొన్నిరోజులకే నేను కమల్‌హాసన్‌ కూతుర్నని తెలిసిపోయేదిలెండి.


వంట చేస్తా

ఇంటికి దూరంగా ఉండటం వల్ల అనుకుంటా... వంటచేయడం నేర్చుకున్నా. తీరిక ఉన్నప్పుడల్లా వంటల్లో ప్రయోగాలు చేస్తుంటా. వంటల పుస్తకాలు కొనుక్కోవడం, కొత్తవంటకాల్ని రాసుకోవడం వంటివీ చేస్తుంటా.


చాలా జతలున్నాయి

నాకు ముందునుంచీ చెప్పులంటే చాలా ఇష్టం. అందుకే ఛాన్స్‌ దొరికినప్పుడల్లా రకరకాల డిజైన్లూ రంగుల్లో చెప్పుల్ని కొనేస్తుంటా. ఇప్పుడు నా దగ్గర వందకు పైగానే చెప్పుల జతలున్నాయి తెలుసా.


ఏ పనీ చేయను

పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడూ, నాకోసం నేను కొంత టైం పెట్టుకోవాలనుకున్నప్పుడూ అసలు ఏ పనీ చేయను. ఒకటి రెండు రోజులు ఖాళీగా గడిపేస్తా. ఆ తరవాత మళ్లీ మామూలే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..