కాపాడాల్సినవే... కాటేస్తున్నాయి..!

కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా తయారైంది ఇప్పుడు మన పరిస్థితి. ఓపక్క ఎప్పటికప్పుడు కొత్త కొత్త వైరస్‌లు వ్యాపిస్తోంటే మరోపక్క పాతవాటికేమో మందులు పనిచేయకుండా పోతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా మాత్రలు

Updated : 13 Mar 2022 02:04 IST

కాపాడాల్సినవే... కాటేస్తున్నాయి..!

కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా తయారైంది ఇప్పుడు మన పరిస్థితి. ఓపక్క ఎప్పటికప్పుడు కొత్త కొత్త వైరస్‌లు వ్యాపిస్తోంటే మరోపక్క పాతవాటికేమో మందులు పనిచేయకుండా పోతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా మాత్రలు మింగేయడం వల్ల బ్యాక్టీరియా వాటికి అలవాటు పడిపోయి ఏ మందులకూ లొంగని ‘సూపర్‌బగ్స్‌’ని సృష్టిస్తున్నాయి. యాంటిబయోటిక్‌ మందులు పనిచేయని కారణంగా ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా అరవై లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని లాన్సెట్‌ తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వైద్యరంగం ఏకంగా వందేళ్లు వెనక్కి వెళ్తుందనీ ఊహకందని పరిణామాలకు దారితీస్తుందనీ హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

‘రెండు రోజులనుంచీ జలుబూ గొంతునొప్పీ...’ అని ఎవరైనా అనగానే ‘త్రోట్‌ ఇన్‌ఫెక్షనేమో, యాంటిబయోటిక్స్‌ పడితే కానీ తగ్గదు’ చప్పున సలహా ఇస్తారు సన్నిహితులు. కళ్లు, చెవులు, గొంతు, ఊపిరితిత్తులు, కడుపు, మూత్రనాళం... దేనికి ఇన్‌ఫెక్షన్‌ సోకినా ఆఖరికి మామూలు చలిజ్వరం అయినా సరే వెంటనే వాడే మందులు- యాంటిబయోటిక్స్‌. శరీరానికి గాయమైనా పుండ్లు పడినా శస్త్రచికిత్స జరిగినా... అవే దిక్కు.

అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ పెన్సిలిన్‌ని తయారుచేసేవరకూ చేయి తెగినా, గట్టి ఎదురుదెబ్బ తగిలి బొటనవేలు పచ్చడైనా... ఆ గాయం సెప్టిక్‌ అయితే మరణానికి దారితీసే పరిస్థితులే ప్రపంచమంతటా ఉండేవి. 1940వ దశకంలో పెన్సిలిన్‌ వాడుకలోకి వచ్చాక వైద్యరంగానికి గొప్ప వరం లభించినట్లయింది. రకరకాల యాంటిబయోటిక్స్‌ తయారీ ఊపందుకుంది. సూక్ష్మక్రిముల కారణంగా వచ్చే అనేకానేక ఇన్‌ఫెక్షన్లను నయం చేస్తూ బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తూ యాంటిబయోటిక్స్‌ వైద్యచికిత్సలను ఎంతో ముందుకు తీసుకెళ్లాయి. అయితే మందుల షాపుల్లోనో ఆస్పత్రుల్లోనో ఉండాల్సిన ఈ అపురూపమైన ఔషధాలు- ఇప్పుడు మనం తినే తిండిలో తాగే నీళ్లల్లో కూడా ఉంటున్నాయి. అందుకే ఆ వరం ఇప్పుడు శాపంగా మారుతోంది. విచక్షణ కోల్పోయిన మనిషి చేజేతులా చేసుకున్న పాపమే అది.

యాంటిబయోటిక్స్‌ని మొదట అవసరానికి వాడాం. తర్వాత అతిగా వాడాం... ఇప్పుడు అనవసరంగా కూడా వాడుతున్నాం. దాంతో మన చుట్టూ ఉన్న పర్యావరణం అంతా వాటితో నిండిపోయింది. తినగ తినగ వేము తీయన అన్నాడు వేమన. బ్యాక్టీరియాకి మందులు కూడా అలాగే అలవాటైపోవడంతో ఆ మందుల అసలు లక్ష్యం నెరవేరడం లేదు. దాంతో మందులు పనిచేయని ‘యాంటిమైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌’ అనే పరిస్థితి వల్లా, ఆ మందుల్నే నమ్ముకుని చికిత్స కొనసాగించడంతో ఇన్‌ఫెక్షన్లు నియంత్రణలోకి రాకపోవడం వల్లా 2019లో ప్రపంచవ్యాప్తంగా అరవై లక్షలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారనీ వచ్చే దశాబ్దానికల్లా ఈ సంఖ్య కోట్లకు చేరే ప్రమాదముందనీ లాన్సెట్‌ అధ్యయనం చెబుతోంది. అదే ప్రాణాంతక రోగాలుగా భావించే హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, మలేరియాల వల్ల సంభవించిన మరణాలు 15 లక్షలు మాత్రమేనట. తీవ్రంగా మారిన ఈ పరిస్థితిని అత్యవసరంగా అదుపులోకి తేవడమన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న సవాలు. యాంటిబయోటిక్స్‌ని సరిగ్గా వాడే విషయంలో ప్రజల్లో చైతన్యం తేవడం తక్షణ అవసరం.

సరిగ్గా వాడటం అంటే..?

ఔషధం ఏదైనా దాన్ని వాడడానికి ఒక పద్ధతి ఉంటుంది. అందుకే డాక్టర్లు ఏ మందు రాసినా అది రోజుకు ఎన్నిసార్లు, ఎన్ని రోజులు తీసుకోవాలో చెబుతారు. వాడినా తగ్గకపోతే మళ్లీ రమ్మంటారు. డాక్టరు చెప్పినట్లుగా మందులు వాడితే ఇన్‌ఫెక్షన్‌కి కారణమైన సూక్ష్మజీవులు 80నుంచి 90 శాతం వరకూ చనిపోతాయి. శరీరంలోని వ్యాధినిరోధక శక్తి మిగిలినవాటి పని పడుతుంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా నయమవుతుంది. కానీ అందరూ అలా చేయరు. రెండు రోజులు మందులు వేసుకోగానే గుణం కనబడుతుంది. కాస్త బాధ తగ్గేసరికి ఉత్సాహంగా పనుల్లో పడిపోతారు. ఐదు రోజులు వేసుకోమని డాక్టరు చెప్పిన ట్యాబ్లెట్లని మూడు రోజులు వేసుకుని తగ్గిపోయింది కదా అని మానేస్తారు. అనవసరంగా మందులు వేసుకోవడం మాని మంచి పని చేశామనుకుంటారు. కానీ అసలు జరిగేదేంటంటే- కోర్సు పూర్తిగా వాడనందువల్ల సగం బ్యాక్టీరియా మిగిలిపోతాయి. మందుల్ని రుచి చూసి కూడా బతికిపోయిన ఆ బ్యాక్టీరియాని ఇక ఆ తర్వాత మందులు ఏమీ చేయలేవు. అలా మందుల్ని తట్టుకునే లక్షణం వాటి నుంచి వాటి పిల్లలకు సంక్రమిస్తుంది. మనం సమస్య తగ్గలేదని కొన్నాళ్ల తర్వాత మళ్లీ డాక్టరు దగ్గరికి వెళ్తే మనం మందులు పూర్తిగా వాడని సంగతి తెలియని డాక్టరు ఈసారి మందులు మార్చి ఇంకాస్త పవర్‌ఫుల్‌వి ఇస్తారు. ఇలా మందులు మార్చినపుడల్లా లోపలున్న బ్యాక్టీరియా మరింత శక్తిమంతంగా తయారవుతాయి. ఇలాంటి బ్యాక్టీరియాని ‘సూపర్‌ బగ్స్‌’ అంటున్నారు. కొన్ని సూక్ష్మజీవులు కొన్నిరకాల మందుల్ని తట్టుకోగలిగితే మరికొన్ని... చాలా రకాల మందుల్ని తట్టుకోగలుగుతున్నాయి. యాంటిబయోటిక్స్‌ని వాడాల్సినన్ని రోజులు వాడకపోవడమే కాదు, అతిగా వాడడమూ ఈ సూపర్‌ బగ్‌ బ్యాక్టీరియాని పెంచేస్తోంది.

ఎక్కువ వాడితే నష్టమేంటి?

ఆ నష్టం ఏమిటో తెలియాలంటే- ముందు యాంటిబయోటిక్స్‌ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థలో రకరకాల సూక్ష్మజీవులు సమతౌల్యంతో ఉండి ఆహారాన్ని జీర్ణంచేస్తాయి. యాంటిబయోటిక్‌ మందులు ఆ సమతుల్యతను చెడగొడతాయి. అవి మనం చంపాలనుకున్న సూక్ష్మక్రిములతో పాటు జీర్ణాశయంలోని కొన్ని మంచి సూక్ష్మజీవుల్ని కూడా చంపేస్తాయి. దాంతో మనకు సమస్యలు మొదలవుతాయి. అందుకే చాలామందికి యాంటిబయోటిక్‌ మందులు మింగగానే విరేచనాలు అవుతాయి. ఇలాంటి మందులు ఎక్కువ కాలం తీసుకుంటే మంచి బ్యాక్టీరియాని ఎక్కువగా పోగొట్టుకోవాల్సి వస్తుంది. మరోపక్క వాటికి అలవాటుపడిపోయిన సూపర్‌బగ్స్‌ కూడా పెరుగుతాయి.

ఇంగ్లాండ్‌లో సెప్సిస్‌ అనే జబ్బువల్ల ఏడాదికి దాదాపు యాభైవేల మంది చనిపోతున్నారు. హానికరమైన సూక్ష్మక్రిములు రక్తంలోనూ ఇతర కణజాలంలోనూ చేరడంతో వ్యాధినిరోధకశక్తి నశిస్తుంది. దాంతో అవయవాల పనితీరు దెబ్బతింటుంది. నిజానికి ఆ జబ్బుకి ఇచ్చే యాంటిబయోటిక్స్‌ పనిచేస్తే కోలుకోవడం తేలికే. దురదృష్టవశాత్తూ ఈ మందుల్ని తట్టుకునే బ్యాక్టీరియా ఎక్కువైపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. 2015 తర్వాతే యాంటిబయోటిక్స్‌ పనిచేయని బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్లు 35 శాతం పెరిగాయట. ప్రతి చిన్న సమస్యకీ మందులు మింగేయడం వల్ల కూడా అవి పనిచేయని పరిస్థితి వస్తోందంటున్నారు నిపుణులు.

మందులు తీసుకోకపోతే ఎలా?

ఇన్‌ఫెక్షన్‌ సోకిన వెంటనే యాంటిబయోటిక్స్‌ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా సందర్భాల్లో ఇంటి దగ్గరే తగినంత విశ్రాంతి తీసుకుని సరైన ఆహారమూ ద్రవపదార్థాలూ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌ని తరిమికొడుతుంది. వ్యాధినిరోధక శక్తి లేనప్పుడూ, చాలినంత విశ్రాంతి తీసుకోనప్పుడూ ఇన్‌ఫెక్షన్‌ రెండో దశకి వెళ్తుంది. అప్పుడు యాంటిబయోటిక్స్‌ తీసుకోవాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటంటే కాస్త జలుబు చేసినా త్వరగా తగ్గిపోవాలని గబగబా మందులు మింగేస్తున్నాం. చాలాసార్లు డాక్టరు దగ్గరికి కూడా వెళ్లకుండా మందుల దుకాణంలో కొని వేసేసుకుంటున్నాం. యాంటిబయోటిక్స్‌లో చాలా రకాలు ఉంటాయి. వ్యాధి లక్షణాలను బట్టి మందుల కాంబినేషన్లు ఉంటాయి. అవేవీ తెలుసుకోకుండా గుండుసూదిని సుత్తితో కొట్టినట్లు చిన్న సమస్యకు పెద్ద మందులు వాడుతున్నాం. అలా అనవసరంగా మనం తీసుకోవడమే కాదు, ఆఖరికి మొక్కలకీ జంతువులకీ పక్షులకీ కూడా యాంటిబయోటిక్స్‌ ఇస్తున్నాం.

వాటికి ఎందుకు?

మనిషి స్వార్థమూ దురాశా ఆ పనిచేయిస్తున్నాయి. పాలకోసం, మాంసం కోసం ఫారాల్లో ఒకేచోట ఎక్కువ సంఖ్యలో పెంచే జంతువులకీ పక్షులకీ చేపలకీ రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అవి రాకుండా ముందు జాగ్రత్తగా ఈ మందుల్ని ఇస్తున్నారు. వాటి పాలూ మాంసం ద్వారా ఆ మందులు మన కడుపులోకి చేరుతున్నాయి. ఆ తర్వాత వాటి విసర్జితాలను పంటపొలాలకు ఎరువుగా వాడటం వల్ల ఆ పొలాల్లో పండించే ధాన్యమూ పండ్లూ కూరగాయల ద్వారా మన శరీరంలోకి వస్తాయి.   అంటే- మనం ట్యాబ్లెట్లు వేసుకోకపోయినా మన ప్రమేయం లేకుండానే యాంటిబయోటిక్స్‌ మన శరీరంలోకి చేరుకుంటున్నాయి. మాంసమూ పాలూ కూరగాయలూ పండ్లూ కోడిగుడ్లూ తేనే... అసలు వాటి ఆనవాళ్లు లేని ఆహార పదార్థాలే ఉండటం లేదు. అందుకే ఏనాడూ యాంటిబయోటిక్స్‌ వేసుకోనివారిలో కూడా మందులు పనిచేయని సమస్య వస్తోందంటున్నారు హృద్రోగ నిపుణులు దేవీప్రసాద్‌ శెట్టి.

మనం ఓ కోడికో ఓ పాడిపశువుకో మాత్రమే ఇంజెక్షన్‌ ఇస్తున్నామని అనుకుంటున్నాం కానీ అవి వాటినుంచి చాలా రకాలుగా, చాలా వేగంగా వ్యాపిస్తాయనడానికి ఒక చిన్న ఉదాహరణ:

ఆ మధ్య ఇంగ్లాండ్‌లోని ఒక యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నార్వేలోని ఒక మారుమూల దీవినుంచి సేకరించిన మట్టి శాంపిల్స్‌ని పరీక్షించారు. 2013లో సేకరించిన మట్టి అది. ఆర్కిటిక్‌ వలయానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి చెందిన ఆ మట్టిలో 131 రకాల యాంటిబయోటిక్స్‌ని తట్టుకునే జన్యువులతో పాటు ఎన్‌డీఎం1 అనే కొత్త జన్యువులూ ఉన్న బ్యాక్టీరియా కన్పించాయి. ఎన్‌డీఎం1 అనే జన్యువుని దిల్లీలోని భూగర్భ జలాల్లో ఉన్న బ్యాక్టీరియాలో 2010లో కనుగొన్నారు. మూడేళ్లలోనే అది ధ్రువ ప్రాంతందాకా వెళ్లిపోయిందంటే ఈ సూక్ష్మజీవులు ఎంత వేగంగా విస్తరిస్తాయో అర్థం చేసుకోవచ్చు.

ఇలా మన చుట్టూ ఉండే వాతావరణమంతా యాంటిబయోటిక్స్‌తో నిండి ఉండడం వల్ల ఆటోమేటిగ్గా సూక్ష్మజీవులు వాటికి అలవాటుపడిపోతున్నాయి. దాంతో చికిత్సలో భాగంగా డాక్టర్లు ఇచ్చే మందులు బాధితుల మీద ప్రభావం చూపడం లేదు.

అప్పుడెలా మరి?

మందులు పనిచేయకపోతే- ఇన్‌ఫెక్షన్లు తగ్గవు. సిజేరియన్‌ లాంటి మామూలు ఆపరేషన్లు కూడా సవాలుగా మారతాయి. క్షయ, కుష్టు లాంటి వ్యాధుల్ని నయం చేయడం అసాధ్యమైపోతుంది.

అంటువ్యాధుల్లో అధిక మరణాలకు కారణం క్షయ. మనదేశం అందులో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే చాలామందికి మందులు పనిచేయని పరిస్థితి ఉందట. అదే కాకుండా అవయవమార్పిడి, క్యాన్సర్‌ చికిత్సలకూ ఆటంకం ఏర్పడుతుంది. గత నాలుగు దశాబ్దాలుగా కొత్త యాంటిబయోటిక్స్‌ తయారు కాకపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచుతోంది.

ప్రత్యామ్నాయం లేదా?

కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యాంటిబయోటిక్స్‌ వాడే అవసరం అంతగా రాదంటున్నారు నిపుణులు. అవేంటంటే-

* పెరుగు, ఇడ్లీ, పన్నీర్‌ లాంటి ప్రొబయోటిక్స్‌ ఉండే ఆహారపదార్థాలను తగు మోతాదులో తీసుకునేవారికి యాంటిబయోటిక్స్‌ తీసుకునే అవసరం 30 శాతం తగ్గుతుంది.

* తేనె, వెల్లుల్లి, పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, పసుపు లాంటివి ప్రకృతి సిద్ధమైన యాంటిబయోటిక్స్‌. వాటిని తరచుగా ఉపయోగిస్తే మందులు వాడాల్సిన అవసరం అంతగా రాదు.

* యాంటిబయోటిక్‌ ట్యాబ్లెట్‌ వేసుకున్నాక మూడు గంటలవరకూ పళ్ల రసాలూ పాలూ కాఫీ ఆల్కహాలూ లాంటివి తీసుకోకూడదు. వాటివల్ల మందు ప్రభావం తగ్గిపోతుంది.

* పీచు ఎక్కువగా ఉండే ధాన్యాలూ బీన్సూ పండ్లలాంటివి ఎక్కువగా తీసుకుంటే జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. ట్యాబ్లెట్‌ వేసుకున్న వెంటనే కాకుండా కొంత సమయం తర్వాత ఇలాంటివి తీసుకోవాలి.

* సిగరెట్‌ పొగ కూడా సూపర్‌బగ్స్‌ని పెంచుతుంది.

* ఆర్నెల్లూ అంతకన్నా ఎక్కువ కాలం తల్లిపాలు తాగిన పిల్లల్లో సూపర్‌బగ్స్‌ తయారయ్యే అవకాశం చాలా తక్కువ. కాబట్టి తల్లిపాలు పట్టే విషయంలో నిర్లక్ష్యం కూడదు.

* ఇంటినీ సామగ్రినీ శుభ్రంగా ఉంచుకోడానికి మనం వాడే రసాయనాలు కూడా కొన్నాళ్లు వాడేసరికి సూక్ష్మక్రిములకు అలవాటైపోతున్నాయి. వాటి బదులు ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను వాడాలి.

మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతో ప్రభుత్వాలన్నీ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. కొత్త చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడమూ అందుబాటులో ఉన్న మందుల వాడకాన్ని నియంత్రించడమూ అనవసరంగా వాడటాన్ని అరికట్టడమూ... ఇలా మూడు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సూపర్‌బగ్‌ బ్యాక్టీరియాని చంపే వైరస్‌లను కనిపెట్టేందుకూ పరిశోధనలు జరుగుతున్నాయి.

2017లోనే జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన మన ప్రభుత్వం 2019లో పాడి, కోళ్ల పరిశ్రమల్లో ‘కోలిస్టిన్‌’ వాడకాన్ని నిషేధించింది. డాక్టర్‌ రాసిచ్చిన చీటీ లేకుండా యాంటిబయోటిక్స్‌ అమ్మకూడదని మందుల దుకాణాలను ఆదేశించింది. కొన్నిరకాల యాంటిబయోటిక్స్‌కైతే మందుల చీటీ నకలును కూడా షాపులో భద్రపరచాల్సి ఉంటుంది. అటు దుకాణదారులూ ఇటు ప్రజలూ సహకరిస్తేనే ఈ నియమాలు కచ్చితంగా అమలవుతాయి.

*   *   *

కత్తిపీటతో పెన్సిల్‌ చెక్కుకోం. బ్లేడుతో కూరగాయలు కోసుకోం. వస్తువుల్నే అంత పద్ధతిగా దేనికి పనికొచ్చేదాన్ని దానికి మాత్రమే వాడే మనం... మనకి ప్రాణం పొయ్యగల, తేడా వస్తే ప్రాణం తియ్యగల- మందుల్ని డాక్టరు చెప్పినట్లు జాగ్రత్తగా వాడుకోవద్దూ..!


ఈ సూచీ చెబుతుంది!

కొత్త కొత్త మందులు తయారుచేయడమే కాదు, వాడుతున్న మందులు ఎలా పనిచేస్తున్నాయీ, రోగకారక క్రిముల మీద మందుల ప్రభావం ఏమైనా తగ్గుతోందా అన్న విషయాలనూ పరిశోధకులు అధ్యయనం చేస్తూనే ఉంటారు. వాషింగ్టన్‌లోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పాలసీ, జార్జియాలోని ఎమొరీ యూనివర్శిటీకి చెందిన రోలిన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సంస్థలకు చెందిన నిపుణులు యాంటిబయోటిక్‌ చికిత్స ఫలితాలు ఎలా ఉంటున్నాయన్నదానిపై వివిధ దేశాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. 2019లో వాళ్లు వెలువరించిన డ్రగ్‌ రెసిస్టెన్స్‌ ఇండెక్స్‌(సూక్ష్మక్రిములు మందుల్ని తట్టుకుని నిలిచే పరిస్థితుల సూచీ) నివేదిక ప్రకారం సంపన్న దేశాల్లో పర్వాలేదు కానీ పేద దేశాల్లో డీఆర్‌ఐ చాలా ఎక్కువగా ఉంది. ఏటా కొన్నిలక్షల మరణాలకు అదే కారణం. వాళ్లు పరిశీలించిన నలభై దేశాల్లో మన దేశం చివరి వరసలో ఉంది. అందుకే ఇది వేచి చూసే సమయం కాదనీ తక్షణం చర్యలు తీసుకోకపోతే మన తర్వాత తరం నుంచే తీవ్రంగా నష్టపోవాల్సివస్తుందనీ ప్రాణ నష్టమూ ఆర్థికనష్టమూ దేశాలను దివాలాతీయిస్తాయనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.


సమస్య మనలోనే...

మస్య ఎక్కడో కాదు... మనతోనే మనమధ్యే ఉందనడానికి సాక్ష్యాలు ఈ అధ్యయనాలు.

* ఆరోగ్యంగా ఉన్న ప్రతి ముగ్గురిలోనూ ఇద్దరికి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ యాంటిబయోటిక్‌ మందులు పనిచేయడం లేదని ఐసీఎంఆర్‌ చేసిన అధ్యయనంలో తేలింది.

* అపోలో క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, సీఎంసీ వెల్లూరు సంస్థలు చెన్నైలోని హోటళ్లలో సేకరించిన ఆహారపదార్థాల శాంపిళ్లను పరీక్షించగా ఏ మందులూ పనిచేయనప్పుడు చివరగా ఇచ్చే కొలిస్టిన్‌ అనే యాంటిబయోటిక్‌ని కూడా తట్టుకుని నిలిచే బ్యాక్టీరియా యాభైశాతం శాంపిళ్లలో కనిపించింది.

* అప్పుడే పుట్టిన పసిపిల్లల్లో ప్రతి వెయ్యిమందిలోనూ 16 మందిలో సూపర్‌బగ్స్‌ ఉంటున్నాయనీ ఆ పిల్లల్లో ఐదారుగురు తొలి నెలలోనే ప్రాణాలు విడుస్తున్నారనీ దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యుల అధ్యయనంలో తేలింది. గర్భంతో ఉన్నప్పుడు తీసుకున్న మందుల ప్రభావం బిడ్డపై పడుతోందని గుర్తించారు శాస్త్రవేత్తలు.  

* యార్క్‌ యూనివర్శిటీ పరిశోధకులు మన గంగా యమునలతో సహా 72 దేశాల్లోని నదుల నుంచీ 711 శాంపిల్స్‌ సేకరించి పరీక్షించగా 65 శాతం శాంపిల్స్‌లో యాంటిబయోటిక్స్‌ ఉన్నాయి. ఉండటం అలా ఇలా కాదు... ఉండాల్సిన దానికన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువగా. మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు వాడే ఒక మందు 307 శాంపిల్స్‌లో కనిపించిందట.

* 2018లో దేశవ్యాప్తంగా అరవై వేలకు పైగా శాంపిల్స్‌ని పరీక్షించి ఐసీఎంఆర్‌ ఇచ్చిన నివేదిక ఫలితాలు నిర్ఘాంతపరిచేవిగా ఉన్నాయి. దేశంలోని ఒక్కో ప్రాంతంలోనూ ఒక్కో గ్రూపు బ్యాక్టీరియా రాజ్యమేలుతున్నాయి. ఏకంగా 80, 90 శాతం మందులకు అవి నిరోధకశక్తిని సంపాదించేసుకున్నాయట.

* ఒక అధ్యయనం ప్రకారం 2007 నుంచి మన దేశంలో యాంటిబయోటిక్స్‌ అమ్మకాలు ఏయేటికాయేడు పెరుగుతూ వచ్చాయి. వాటిల్లోనూ బయట విడిగా అమ్మడానికి అనుమతి లేని ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) మందులు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో ఇవి వందల రకాలు అందుబాటులో ఉండగా పదుల సంఖ్యలో మందులకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది.

* లాన్సెట్‌ తాజా అధ్యయనం ప్రకారం మందులు పనిచేయని పరిస్థితి ఎక్కువగా- న్యూమోనియా లాంటి శ్వాస సంబంధ సమస్యల్లోనూ, సెప్సిస్‌ లాంటి బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్లలోనూ, అపెండిసైటిస్‌లాంటి సమస్యల్లోనూ ఎక్కువగా ఎదురవుతోందట.

* పుణెలోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ కెమికల్‌ లేబొరేటరీ ఆధ్వర్యంలోనూ ఒక అధ్యయనం జరిగింది. దాని ప్రకారం- 47 శాతం జనాలకు డాక్టరు సలహా లేకుండా మందులు కొని వాడటం మంచిది కాదని తెలియదట. నలుగురిలో ఒకరికి డాక్టరు చెప్పిన మోతాదు మార్చి వేసుకోవడం వల్ల మందులు పనిచేయవని తెలియదట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..