పంచ నందుల క్షేత్రం... వీరభద్రాలయం!

పరమేశ్వరుడి అంశగా భావించే వీరభద్రుడు... భద్రకాళీ సమేతంగా కొలువైన క్షేత్రమే వీరభద్రాలయం. పంచనందులూ... ఇతర ఉపాలయాలతో కనిపించే ఈ గుడిని దర్శించుకుంటే సకల శుభాలూ కలుగుతాయని నమ్ముతారు భక్తులు.

Published : 10 Sep 2022 23:33 IST

పంచ నందుల క్షేత్రం... వీరభద్రాలయం!

పరమేశ్వరుడి అంశగా భావించే వీరభద్రుడు... భద్రకాళీ సమేతంగా కొలువైన క్షేత్రమే వీరభద్రాలయం. పంచనందులూ... ఇతర ఉపాలయాలతో కనిపించే ఈ గుడిని దర్శించుకుంటే సకల శుభాలూ కలుగుతాయని నమ్ముతారు భక్తులు. ఇక్కడ స్వామిపైన ఏడాదికి రెండుసార్లు అయిదు రోజులపాటు సూర్యకిరణాలు పడటం విశేషం.

చుట్టూ పచ్చని పూల చెట్లూ... ఆకట్టుకునే నిర్మాణశైలితో కనిపించే వీరభద్రాలయం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఉంటుంది. వీరభద్రుడు ఇక్కడ భద్రకాళీ సమేతంగా కొలువై.. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్నాడు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల వారికి ఇలవేల్పు అయిన వీరభద్రుడు... కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిశాడని పురాణాలు పేర్కొంటున్నాయి. చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారనీ... ఇతర రాజులూ ఆలయాన్ని అభివృద్ధి చేశారనీ అంటారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ పంచనందులూ, పంచలింగాలూ ఉండటం విశేషం.

స్థలపురాణం

పురాణాల ప్రకారం... దక్ష ప్రజాపతి తాను నిర్వహించే యజ్ఞానికి కుమార్తె సతీదేవినీ, శివుడినీ ఆహ్వానించడు. తండ్రి నుంచి పిలుపు రాకపోయినా... పుట్టింటిపైన ఉన్న మమకారంతో సతీదేవి ఆ యజ్ఞానికి హాజరవడంతో దక్షుడు అవమానిస్తాడు.  దాంతో సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. అది తెలిసి ఆగ్రహించిన శివుడు తన శిరస్సులోని జటాజూటం నుంచి ఒక జూటాన్ని పెరికి నేలపైకి విసిరేయగా అందులోంచి భీకర స్వరూపమైన వీరభద్రుడు ఉద్భవించి యజ్ఞశాలపైన విరుచుకుపడి యాగానికి వచ్చిన దేవతలందరినీ దండించడమే కాకుండా తన ఖడ్గంతో దక్షుడి శిరస్సును ఖండిస్తాడు. ఆ తరవాత శివుడు వీరభద్రుడిని దీవిస్తూనే అతడిని శాంతింపజేశాడట. దాంతో వీరభద్రుడు ఈ ప్రాంతంలో భద్రకాళీ సమేతంగా కొలువయ్యాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

పంచనందుల దర్శనం

ఏ శివాలయంలో చూసినా... స్వామికి ఎదురుగా ఒక నంది విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలో మాత్రం ధ్వజస్తంభం మొదలుకొని ఆలయం లోపలి వరకూ అయిదు నంది విగ్రహాలు కనిపిస్తాయి. ధ్వజస్తంభం తరవాత వీరభద్రుడి మూలవిరాట్టు ఎదురుగా పెద్ద నంది విగ్రహంతోపాటు జంటనందులు దర్శనమిస్తాయి. అంతేకాకుండా భద్రకాళీ అమ్మవారి మందిరంలో మరొకటి ఉంటుంది. ఆ విగ్రహాల చెవులు వెనక్కి ముడుచుకుని ఉంటాయి. అదేవిధంగా ఈ ఆలయంలో అయిదు శివలింగాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ మార్చి, సెప్టెంబరు నెలల్లో అయిదు రోజులపాటు ఉదయంవేళ స్వామి పాదాలపైన సూర్యకిరణాలు పడే దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవని అంటారు. ఈ ఆలయంలో వినాయకుడు, అఘోరలింగేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, ఆరడుగుల బసవేశ్వరుడు, కాలభైరవేశ్వరుడి ఉపాలయాలూ ఉంటాయి. ఇక్కడ ఏటా మాఘ బహుళ దశమి లేదా ఏకాదశి నుంచి పదకొండు రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు వస్తారు.

ఎలా చేరుకోవచ్చు
ఈ ఆలయం కడప నుంచి 53 కిలోమీటర్ల దూరంలోని రాయచోటిలో ఉంటుంది. కడప వరకూ రైలు లేదా బస్సుల్లో చేరుకుంటే.. అక్కడినుంచి ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేక బస్సులూ, ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి.  

- బోగెం శ్రీనివాసులు, ఈనాడు డిజిటల్‌, కడప
- ఫొటోలు: బైరాజు నరసింహరాజు, రాయచోటి, న్యూస్‌టుడే


ఇది విన్నారా...
శయన ముద్రలో హనుమంతుడు

ఆలయంలో అయినా.. హనుమంతుడు గదను ధరించి నిల్చునో లేదా ధ్యానముద్రలో కూర్చునో కనిపిస్తాడు. కానీ, భద్ర మారుతి మందిరంలో మాత్రం ఈ స్వామి వెండి మంచంపైన శయన ముద్రలో ఉండి... భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఔరంగాబాద్‌లోని ఖుల్దాబాద్‌లో ఎల్లోరా గుహలకు దగ్గర్లో ఉన్న ఈ ఆలయంలో స్వామి శయన రూపంలో దర్శనమివ్వడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు ఖుల్దాబాద్‌ను భద్రావతి అనే పేరుతో పిలిచేవారట. ఆ ప్రాంతాన్ని భద్రసేనుడు అనే రాజు పాలించేవాడు. రామభక్తుడైన ఆ రాజు ప్రతిరోజూ రామనామ సంకీర్తనం చేసేవాడట. ఓసారి హనుమంతుడు ఆ భజనపాటల్ని వినేందుకు వచ్చి... తన్మయత్వంలో మునిగిపోయి తనకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోయాడట. భజన అంతా పూర్తయ్యాక స్వామిని చూసిన ఆ రాజు.. అక్కడే ఉండిపొమ్మని వేడుకోవడంతో ఆంజనేయుడు ఇక్కడ శయన రూపంలోనే కొలువయ్యాడనీ... ఆ తరువాత భద్రసేనుడు ఆలయాన్ని నిర్మించాడనీ అంటారు. హనుమాన్‌ జయంతి సమయంలో ఈ ఆలయాన్ని లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..