ఏడాదికి రెండుసార్లు... గుహలోని స్వామిపైన... సూర్యకిరణాలు!
లోక కల్యాణార్థం రెండేళ్లకోసారి నిర్వహించే విశేషమైన హోమాలూ... నిరంతరం కనిపించే భక్తజన సందడి...
లోక కల్యాణార్థం రెండేళ్లకోసారి నిర్వహించే విశేషమైన హోమాలూ... నిరంతరం కనిపించే భక్తజన సందడి... ఏడాదికి రెండుసార్లు స్వామిపైన పడే సూర్యకిరణాలూ... వంటి ప్రత్యేకతలన్నీ గవి గంగాధరేశ్వరస్వామి ఆలయంలో కనిపిస్తాయి. దేశంలో ఉన్న డెబ్భై రెండు గుహాలయాల్లో ఈ క్షేత్రం ప్రసిద్ధమైనదనీ... ఇక్కడ గుహలో కొలువైన పరమేశ్వరుడిని పూజిస్తే కైలాసాన్ని దర్శించుకున్నట్లేననీ నమ్మకం. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన ఈ ఆలయానికి రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది.
గవి గంగాధరేశ్వర స్వామి ఆలయం... బెంగళూరులోని కెంపెగౌడ నగర్, గవిపురంలో కనిపిస్తుంది. ఇక్కడ స్వామి గుహలో కొలువయ్యాడు కాబట్టే ఈ ప్రాంతానికి గవిపురం, గుట్టహళ్లి అనే పేరు వచ్చింది. దక్షిణ కాశీగా పిలిచే ఈ ఆలయంలో ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించే సినిమాలు విజయం సాధిస్తాయనేది సినీవర్గాల్లో ఉన్న ఓ నమ్మకం.
స్థలపురాణం
ఒకప్పుడు గౌతమ, భరద్వాజ మహర్షులు తమ త్రికాల పూజల్ని ఈ గుహలోనే నిర్వహించాలనుకుని... ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణగాథ. ఆ సమయంలో గంగానది స్వయంగా కదిలివచ్చి స్వామిని అభిషేకించిందట. అందుకే ఇక్కడి శివుడికి గవి గంగాధరేశ్వరస్వామి అనే పేరు వచ్చిందని అంటారు. నేలమట్టానికి దిగువన ఉండే ఈ ఆలయాన్ని రాజవంశీయులు
అభివృద్ధి చేస్తే... విజయ నగర రాజులకు సామంతుడైన మాగడి కెంపెగౌడ పునరుద్ధరించినట్లుగా చెబుతారు.
సప్తమాతృకలూ ఒకేచోట
దేశంలో సుమారు డెబ్భై రెండు గుహాలయాలు ఉంటే... వాటిల్లో ఈ ఆలయానికి విశేషమైన గుర్తింపు ఉంది. ఇక్కడి గుహలో సర్వాలంకారభూషితుడై దక్షిణాభిముఖంగా కొలువుదీరిన స్వామిని దర్శించుకునే భక్తులు ఆ తరువాత ఇతర దేవతా మూర్తులనీ పూజిస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అమ్మవారు స్వామికి వామభాగంలో ఉంటే... ఇక్కడ మాత్రం కుడివైపున ఉండి ప్రసన్నపార్వతిగా పూజలందుకుంటోంది. అలాగే ఇక్కడ వనదుర్గనూ చూడొచ్చు. ఆ తరువాత అగ్నిదేవుడు, దక్షిణామూర్తి, శక్తిగణపతి, సుబ్రహ్మణేశ్వరస్వామి, కాలభైరవుడు, భూదేవి-శ్రీదేవి, కృష్ణుడు, భరద్వాజ, గౌతమ మహర్షులూ... తదితర విగ్రహాలను దర్శించుకోవచ్చు. అలాగే సప్తమాతృకలైన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి విగ్రహాలూ ఈ గుహలో వరుసగా కనిపిస్తాయి. కంటిచూపు సమస్యలున్నవారు పదహారు వారాలపాటు ఇక్కడున్న అగ్నిదేవుడిని పూజిస్తే మంచిదని చెబుతారు. అలాగే ఇక్కడ కొలువైన శక్తి గణపతిపైన ఆశీనురాలైన ఆదిపరాశక్తినీ దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలోని ఓ గుహలో స్వామి ఉంటే... మరో రెండు గుహలు ఒకటి కాశీకి, ఇంకోటి శివగంగకు వెళ్లే సొరంగమార్గాలనీ, ఈ గుహలద్వారానే మహర్షులు కాశీకి వెళ్లేవారనీ చెబుతారు. గర్భగుడి ప్రాంగణంలో ఉన్న చిన్న నీటి గుంటలో ఏ కాలంలోనైనా గంగాజలం ఊరుతూ ఓ సన్నకాలవగుండా ప్రవహిస్తూ కనిపిస్తుంది. స్వామికి ఎదురుగా సూర్యచంద్రుల విగ్రహాలనూ దర్శించుకోవచ్చు భక్తులు.
స్వామికి సూర్యాభిషేకం
ఇక్కడ ప్రతిరోజూ చేసే పూజలూ, మహాశివరాత్రినాడూ, కార్తికంలోనూ నిర్వహించే పూజాదికాలూ, అభిషేకాలూ ఒకెత్తయితే... ఏడాదికి రెండుసార్లు స్వామిపైన సూర్యకిరణాలు పడే విశేషం మరొకెత్తు. మకర సంక్రాంతి రోజున సాయంకాలం, ఆ తరువాత కార్తికంలో పడే సూర్యకిరణాలను సూర్యకర సేవగా పిలుస్తారు. అలాగే మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఇవన్నీ కాకుండా... రెండేళ్లకోసారి నలభైఎనిమిది రోజులపాటు లోక కల్యాణార్థం ప్రత్యేకంగా దుర్గ, చండి, నవగ్రహ హోమాలనూ, రుద్రాభిషేకాలనూ నిర్వహిస్తారు ఆలయ నిర్వాహకులు.
ఎలా చేరుకోవచ్చు
బెంగళూరులో ఉండే ఈ ఆలయానికి చేరుకునేందుకు విమానం, రైలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆలయం దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్లో రావాలనుకునేవారు బెంగళూరు రైల్వేస్టేషన్‌లో దిగితే... అక్కడినుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు బస్సులూ, ఆటోలూ ఉంటాయి.
పి.జగదీశ్వరి, న్యూస్‌టుడే, బెంగళూరు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Train accident: గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
-
Crime News
Cyber Crime: రూ.5 జీఎస్టీ కట్టాలని చెప్పి.. రూ.లక్ష కాజేశాడు!
-
World News
Imran Khan: రూ.1500 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇమ్రాన్‌ఖాన్
-
Crime News
Hyderabad: పెట్రోల్ బంకు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
-
India News
Amit Shah: మణిపుర్ కల్లోలం.. అమిత్ షా వార్నింగ్ ఎఫెక్ట్ కనిపిస్తోందా..?
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు