ఈ వెంకన్న చందన స్వరూపుడు!
ఆలయాల్లో దేవతా విగ్రహాలన్నీ దాదాపుగా కృష్ణశిలతో తయారుచేస్తే... ఇక్కడి వేంకటేశ్వరుడి విగ్రహం మాత్రం ఎర్ర చందనంతో ఉంటుంది.
ఈ వెంకన్న చందన స్వరూపుడు!
ఆలయాల్లో దేవతా విగ్రహాలన్నీ దాదాపుగా కృష్ణశిలతో తయారుచేస్తే... ఇక్కడి వేంకటేశ్వరుడి విగ్రహం మాత్రం ఎర్ర చందనంతో ఉంటుంది. ఆ స్వామిని దర్శించుకుని కొన్ని వారాల పాటు ప్రదక్షిణలు చేస్తే... కోరిన కోర్కెలు నెరవేరతాయని అంటారు. ఆ వెంకన్నను దర్శించుకోవాలంటే కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లికి వెళ్లాల్సిందే మరి!
గౌతమీ నదీ తీరాన... పచ్చని పంట పొలాల మధ్య కనిపిస్తుంది వాడపల్లి వేంకటేశ్వరస్వామి క్షేత్రం. నిత్యం గోవింద నామాలు ప్రతిధ్వనించే ఈ ఆలయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో ఉంటుంది. శ్రీదేవీ -భూదేవీ సమేతంగా దర్శనమిచ్చే ఈ స్వామిని తలచుకుని, ఏదైనా పని తలపెడితే అది తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం.
స్థలపురాణం
ఓసారి సనకసనందాది మహర్షులు మహావిష్ణువును దర్శించుకుని... కలియుగంలో ధర్మం ఒంటిపాదంతో నడుస్తోందనీ, ప్రజలు అధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారనీ చెబుతూ రక్షించమని వేడుకున్నారట. దాంతో విష్ణుమూర్తి ఒకప్పుడు నౌకాపురిగా పిలిచే ప్రస్తుత వాడపల్లిలో వెలుస్తానంటూ అభయమిచ్చాడట.
కొంత కాలానికి గోదావరి నదీ ప్రవాహంలో ఓ చందన పెట్టె కొట్టుకు రావడం ఈ ఊరివాళ్లకు కనిపించింది. ఎవరైనా ఆ పెట్టెను తీసేందుకు ప్రయత్నిస్తే అది అదృశ్యమయ్యేదట. చివరకు ఓ వృద్ధుడికి స్వామి కలలో కనిపించి...ఆ చందన పెట్టెకు సంబంధించిన ఆనవాళ్లను తెలియజేశాడట. మర్నాడు ఆ వృద్ధుడు ఊరివాళ్లతో కలిసి ఆ పెట్టె ఉన్న చోటుకు వెళ్లి దాన్ని తెరిస్తే... అందులో శంఖు, చక్రాలతో ఎర్ర చందనంతో చెక్కిన స్వామి దివ్య మంగళ మూర్తి కనిపించిందట. ఇది తెలిసి అక్కడికి వచ్చిన నారదుడు స్వామికి వేంకటేశ్వరుడు అని నామకరణం చేసి ఆ తరువాత ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. ‘వేం’ అంటే పాపాలను, ‘కట’ అంటే పోగొట్టేవాడని...అర్థం. అలాగే... శ్రీనివాసుడు తిరుపతి నుంచి బయలుదేరి మార్గ మధ్యంలో తన అంశను ద్వారకా తిరుమలతోపాటూ కోనసీమ, విశాఖ జిల్లా ఉపమాకలోని గరుడాద్రి మీదా ఏర్పాటుచేశాడనే కథ కూడా ఉంది. మరో కథ ప్రకారం ఒకప్పుడు పెనుబోతుల గజేంద్రుడనే క్షత్రియుడు ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి భీకరమైన తుపాను వచ్చి, అతడి ఓడలన్నీ సముద్రంలో కొట్టుకుపోయాయట. దాంతో అతడు తన ఓడలు సురక్షితంగా ఉంటే... స్వామికి ఆలయాన్ని కట్టిస్తానని మొక్కుకున్నాడట. తుపాను వెలిశాక అతడి ఓడలన్నీ ఒడ్డుకు చేరుకోవడంతో ఆ వ్యాపారి ఆలయాన్ని కట్టించాడనీ చెబుతారు.
తిరుమల తరహాలోనే పూజలు...
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి కోనసీమ తిరుమల అనే పేరూ ఉంది. ఈ ఆలయం పై కప్పు పైన చెక్కిన గోవింద నామాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరి ఇక్కడా పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, నిత్యం వేంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమం, కల్యాణం, అధ్యయనోత్సవాలు...
ఇలా ఏడాది మొత్తం విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ప్రధానంగా ధనుర్మాసంలో వచ్చే 27వ రోజున కూడారై అనే ఉత్సవం పేరుతో 108 గంగాళాలతో అక్కార్‌అడిశల్ అనే ప్రసాదాన్ని స్వామికి సమర్పించే వేడుక కన్నులపండువగా ఉంటుంది. అలాగే మార్చి-ఏప్రిల్ నెలలో నిర్వహించే కల్యాణోత్సవాలను చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ ఏడువారాల వ్రతం ప్రసిద్ధి. ఏడు వారాల పాటు 49 ప్రదక్షిణలు చేసి స్వామిని పూజిస్తే, ఏ కోరికైనా నెరవేరుతుందని నమ్మకం. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైన విశ్వేశ్వరస్వామి అన్నపూర్ణా సమేతంగా కొలువుదీరితే... రుక్మిణీ-సత్యభామా సమేతంగా వేణుగోపాల స్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు.
ఎలా చేరుకోవచ్చు
ఈ ఆలయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంవాడపల్లిలో ఉంటుంది. రాజమహేంద్రవరం వరకూ రైల్లో వస్తే.. అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు బస్సులూ, ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. రావులపాలెం నుంచి అయితే దాదాపు 10 కి.మీ. దూరం ఉంటుంది.
ఆత్మాల వెంకట రామారావు, న్యూస్‌టుడే, ఆత్రేయపురం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!