అలంకారప్రియుడు ఈ మహాకాలుడు!

శ్మశానమే నివాసంగా చేసుకున్న ఆ పరమశివుడికి భస్మాన్నే హారతిగా ఇచ్చే అరుదైన సంప్రదాయం ఉన్న ఆలయమే ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌. రాజ్యాన్ని రక్షించేందుకు మహాకాలుడి అవతారమెత్తిన పరమశివుడు, భక్తుల కోరిక మేరకు అక్కడే కొలువైన అపురూపమైన దేవాలయం.

Updated : 06 Nov 2022 05:11 IST

అలంకారప్రియుడు ఈ మహాకాలుడు!

శ్మశానమే నివాసంగా చేసుకున్న ఆ పరమశివుడికి భస్మాన్నే హారతిగా ఇచ్చే అరుదైన సంప్రదాయం ఉన్న ఆలయమే ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌. రాజ్యాన్ని రక్షించేందుకు మహాకాలుడి అవతారమెత్తిన పరమశివుడు, భక్తుల కోరిక మేరకు అక్కడే కొలువైన అపురూపమైన దేవాలయం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగానూ దక్షిణాముఖంగా వెలసిన ఏకైక జ్యోతిర్లింగంగానూ పేరొందిన ఈ మహాకాలుడి ఆలయం... మరెన్నో విశేషాల సమాహారం..!
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాలేశ్వరుడి ఆలయాన్ని ‘శ్రీ మహాకాల్‌ లోక్‌’ పేరుతో మహోజ్వలంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే 316 కోట్ల రూపాయలతో తొలి దశ పనులు పూర్తి చేసుకున్న ఈ ఆలయ సముదాయంలోని గోడలమీద శివుడి ఆనంద తాండవాన్ని 108 చిత్రాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. పురాణ కథలను వివరించే 93 విగ్రహాలనూ ఏర్పాటుచేశారు. వీటిమీద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే దాని గురించిన పూర్తి వివరాలు ఫోన్‌లో కనిపిస్తాయట. ప్రస్తుతం 2.87 హెక్టార్లలో నిర్మిస్తోన్న ఆలయ సముదాయాన్ని భవిష్యత్తులో 47 హెక్టార్లకు విస్తరింపజేసి మరింత అద్భుతంగా నిర్మించనున్నారట. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎత్తైన శివుడి విగ్రహం, తామరలతో నిండిన కొలనూ భక్తుల్ని ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరింపజేస్తాయి.

ఇవన్నీ కొత్త ప్రాజెక్టులో భాగమైతే..ప్రధాన ఆలయంలోని మహాకాలుడి అలంకారాల్ని చూసి తీరాల్సిందే. మరెక్కడా లేని రీతిలో ఆయా పండుగలూ వేడుకల్ని బట్టి మూలవిరాట్టుని ఎన్నో రకాలుగా అలంకరిస్తారు. ఒక్క రోజులోనే నాలుగైదు అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. పూలూ పండ్లూ డ్రైఫ్రూట్స్‌తో అలంకరించడం ఒకెత్తయితే, రంగులూ గీతలతోనే మహాకాలుడిని అర్ధనారీశ్వరుడు, దుర్గాదేవి, హనుమ, నారసింహడు, రాధాకృష్ణులూ... ఇలా భిన్న రూపాల్లో లింగానికే సింగారం చేయడం ఈ ఆలయ ప్రత్యేకత. శివకేశవ భేదం లేదు అన్నదానికి ఈ అలంకారాలే నిదర్శనం.

ఆలయ విశిష్టత!
మోక్షాన్ని ప్రసాదించే సప్తపురాలలో ఒకటైన ఉజ్జయినీ నగరం శిప్రా నదీతీరంలో ఉంది. సూర్యసిద్ధాంతం ప్రకారం- జీరో మెరిడియన్‌ రేఖాంశాన్ని కర్కటరేఖ ఖండిస్తున్న ప్రదేశంలో ఉన్న ఉజ్జయినికి భౌగోళికంగానూ ఖగోళశాస్త్రపరంగానూ ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే ఈ నగరంలోని మహాకాలుడిని ‘కాల దైవం’గా కొలుస్తారు. రుద్రసాగర్‌ సరస్సు ఒడ్డున స్వయంభూగా వెలిసిన మహాకాలుడి ఆలయం ఐదు అంతస్తులుగా నిర్మితమై చూడముచ్చటైన గోపురాలతో శోభాయమానంగా కనిపిస్తుంది. మొదటి అంతస్తు భూమిలోపల ఉండగా; రెండో అంతస్తులో మహాకాలేశ్వరుడు, మూడో అంతస్తులో ఓంకారేశ్వరుడు, నాలుగోదాంట్లో నాగ చంద్రేశ్వరుడు కొలువై ఉంటారు. పరమశివుడు ఒకేచోట మూడు రూపాల్లో దర్శనమిచ్చే అరుదైన క్షేత్రమిది. అయితే నాగపంచమి రోజు మాత్రమే నాగచంద్రేశ్వరుడి దర్శనానికి అనుమతిస్తారు.
అనంతమైన శివతత్వానికి నిదర్శనమైన ఆ మహాలింగం నుంచి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలే ద్వాదశ జ్యోతిర్లింగాలైనాయి. వీటన్నింటిలోకీ ప్రత్యేకమైనదే మహాకాలేశ్వర్‌ లింగం. మిగిలిన క్షేత్రాల్లో మాదిరిగా కాకుండా ఇక్కడి మహాకాలుడి లింగం మంత్రశక్తితో ఏర్పడిందట. ఇక్కడ దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని మళ్లీ ఇతర దేవతలకు నివేదించవచ్చు. ఏటా వర్షాకాలం ప్రారంభంలో పర్జన్యానుష్టానం చేయడం ఈ ఆలయ ప్రత్యేకత. అది పూర్తవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్మి, వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఈ తంతు కొనసాగడం అందరినీ చకితుల్ని చేస్తుంది. మహాకాలేశ్వరుడు వెలిసిన ప్రదేశంలో నేలలోపల శంఖు యంత్రం ఉందట. అందుకే ఇక్కడి మహేశ్వరుడి దర్శనంతో విజయం వరిస్తుందనీ రోగాలు దరిచేరవనీ విశ్వసిస్తారు భక్తులు. వేల సంవత్సరాల నుంచీ ఆలయ గర్భగుడిలో రెండు అఖండ జ్యోతులు వెలుగుతుండటం చెప్పుకోదగ్గ విశేషం. పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, సాక్షి గోపాలుడు, శనీశ్వరుడితోపాటు మరెన్నో శివలింగాలనీ ఈ ఆలయ ప్రాంగణంలో దర్శించుకోవచ్చు.

భస్మ మందిరం!
మహాకాలేశ్వర్‌ ఆలయంలో అన్నింటికన్నా ప్రత్యేకమైనది అక్కడి భస్మ మందిరం. అక్కడ ఆవుపేడతోనే పిడకల్ని చేసి, కాల్చి విభూతిని తయారుచేస్తారు. ఆ విభూతితోనే స్వామివారికి హారతి ఇస్తారు. ఈ అభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలుచని బట్టలో విభూతిని పోసి మూట కట్టి దాన్ని తెల్లని వస్త్రం కప్పిన శివలింగంపైన పెట్టి మరో మూటతో దాన్ని తట్టేవారట. అయితే అలా చేయడం వల్ల శివలింగం కుంచించుకుపోతుందన్న కారణంతో విభూతి మూటను చుట్టూ తిప్పుతూ హారతి ఇస్తున్నారు. ఆ సమయంలో శివలింగంతోపాటు అంతరాలయం భస్మంతో నిండిపోతుంది. ఆ సమయంలో శంఖువులు, భేరీలు, మృదంగాలను మోగించే తీరు భక్తుల్ని ఓ అలౌకికమైన స్థితికి తీసుకెళుతుంది. గర్భగుడి ‘హర హర మహదేవ... శంభోశంకర...’, ‘ఓం నమశ్శివాయ...’ అన్న శక్తిమంతమైన నామస్మరణతో మార్మోగిపోతుంది. ఈ హారతిని చూడటం అంటే కైలాసంలోని మహాశివుడిని చూసినట్లే అంటారు భక్తులు. బ్రహ్మ సైతం ఇక్కడ భస్మ పూజ చేశాడనీ ఆ కారణంగానే ఈ క్షేత్రానికి మహాశ్మశానం అనే పేరు వచ్చిందనీ చెబుతారు. ఇక్కడి స్వామి దర్శనం అకాల మృత్యువు నుంచి రక్షిస్తుందనీ విశ్వసిస్తారు.
మరో రకమైన భస్మహారతికోసం- ఆ రాత్రి శ్మశానంలో ప్రథమంగా కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు తీసుకురాగా, పదిమంది నాగసాధువులు లింగానికి చుట్టూ కూర్చుని భస్మాభిషేకం చేస్తారట. అయితే ఇటీవల ఈ పద్ధతికి స్వస్తి పలికి పిడకల భస్మంతోనే హారతి ఇస్తున్నారు. భస్మహారతిని ఏ రకంగా ఇచ్చినప్పటికీ ఆ సమయంలో గర్భగుడిలోకి ఎవ్వరినీ అనుమతించరు. బయట ఉన్న నంది మండపంలోనూ బారికేడ్ల వెనకా నిలబడి ఈ హారతిని దర్శిస్తారు భక్తులు. స్త్రీలు ఈ హారతిని చూడకూడదు కాబట్టి కళ్లు మూసుకోమని చెబుతారు. నిత్యం తెల్లవారుజామున 4 గంటలకు నిర్వహించే ఈ భస్మహారతికోసం ఎంతోమంది ఒంటిగంటకే అక్కడకు వచ్చి నిరీక్షిస్తుంటారు. అది చూస్తే జన్మ ధన్యమనీ మరుజన్మ ఉండదనీ భక్తుల విశ్వాసం. ఈ హారతి కోసం ముందుగానే బుక్‌ చేసుకోవాలి. హారతి అనంతరం లింగాన్ని అభిషేకించి అలంకరిస్తారు.

స్థల పురాణం!
ఉజ్జయినీ నగరాన్ని ఒకప్పుడు అవంతిక అని పిలిచేవారు. భోజరాజు, కాళిదాసు నడయాడిన నేల ఇది. పురాణాల ప్రకారం- ఈ ప్రాంతాన్ని పాలించిన చంద్రసేనుడు మహా శివభక్తుడు. ఒకరోజు ఆయన శివుణ్ని ప్రార్థించడం అటుగా వెళుతున్న రైతు కుమారుడైన శ్రీకరుడు చూసి, రాజుగారిలానే తానూ ప్రార్థించాలని దేవాలయంలోకి వెళితే, అక్కడ ఉన్న రాజభటులు ఆ పిల్లవాడిని బయటకు లాక్కొచ్చి, శిప్రా నదీ తీరంలో వదిలేస్తారు. అక్కడ శత్రురాజులైన రిపుదమన, సింగాదిత్యులు ఉజ్జయినిపై దండెత్తాలని ఆలోచన చేస్తున్నారన్న విషయం విన్న శ్రీకరుడు తన రాజ్యాన్ని రక్షించమని ప్రార్థన చేస్తుంటాడు. ఆ వార్త విన్న పూజారి రిద్ధి కూడా అక్కడకు వెళ్లి శివుణ్ని ఆరాధించాడనీ అంతట ఆ బోళాశంకరుడు మహాకాలుని అవతారంలో శత్రువులందరినీ నాశనం చేసి, భక్తుల కోరిక మేరకు అక్కడే కొలువయ్యాడనేది ఓ పురాణ కథనం. పూర్వం ఈ ప్రాంతంలో వేదప్రియుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు నలుగురు కుమారులు. వీళ్లు పరమ శివభక్తులు. ఈయన తన కుమారులతో నిత్యనైమిత్తిక వైదిక కర్మలననుష్టిస్తూ లింగార్చన చేసేవాడట. అయితే అక్కడ రత్నమాల పర్వతంమీద ఉన్న దూషణుడు అనే రాక్షసరాజు అక్కడెవరూ పూజలు చేయకుండా అకృత్యాలకు పాల్పడేవాడట. అయినా వాళ్లు బెదరకుండా ‘హర ఓం హర హర’ అంటూ శివపారాయణ చేయగా- శివుడు మహాకాల రూపమెత్తి హుంకరించగా దూషణుడితోపాటు అతడి సైన్యం కూడా భస్మమయిందట. ఆ తరవాత భక్తుల కోరిక మేరకు శివుడు అక్కడే కొలువయ్యాడనీ ఆ రకంగానే భస్మహారతి మొదలై, భస్మప్రియుడిగా పూజలు అందుకుంటున్నాడనేది మరో పురాణ కథనం. అయితే క్రీ.పూ. ఆరో శతాబ్దంనాటికే ఉజ్జయినిలో మహాకాలుడి ఆలయం ఉన్నదనీ, కాళిదాసు మేఘదూతంలోనూ దీని ప్రస్తావన ఉందనీ; ప్రస్తుత ఆలయాన్ని 18వ శతాబ్దంలో శ్రీమంత్‌ రానోజీరావు షిండే మహరాజ్‌ కాలంలో కట్టించారనీ తెలుస్తోంది. లయకారకుడూ పంచభూతాత్మకుడూ దుర్జనభయంకరుడూ అయిన ఆ పరమేశ్వరుడు ఉజ్జయినిలో మహాకాలుడి రూపంలో వేల సంవత్సరాలనుంచీ పూజలు అందుకుంటున్నాడట. అందుకే మహిమాన్వితమైన ఉజ్జయినీ ‘మహాకాల’ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునేందుకు కార్తికమాసంలో భక్తులు బారులు తీరుతారు...

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..