Updated : 18 Sep 2022 04:23 IST

ఇక్కడ గర్భగుడికి పైకప్పు ఉండదు!

ఆ ఆలయంలో గర్భగుడికి పై కప్పు ఉండదు. స్వామి విగ్రహం కూడా పడమర వైపు తిరిగి ఉంటుంది. గర్భగుడిలో కొలువైన స్వామి విగ్రహం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేయొచ్చు. ఈ ప్రత్యేకతలన్నీ మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో కనిపిస్తాయి. 

పడమటి ఆంజనేయుడు... శ్రద్ధగా పూజించేవారికి శనిదోషాలను పోగొట్టే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు అరవైఅయిదు కి.మీ. దూరంలో కృష్ణానదీ తీరంలోని మక్తల్‌ ప్రాంతంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని జాంబవంతుడే స్వయంగా ప్రతిష్ఠించాడని అంటారు. సాధారణంగా హనుమంతుడి ఆలయాల్లో స్వామి విగ్రహాలు తూర్పు, ఉత్తరం, దక్షిణంవైపు తిరిగి భక్తులకు దర్శనమిస్తుంటాయి. కానీ ఇక్కడ స్వామి పశ్చిమ దిక్కును చూస్తూ, ఓ పక్కకు ఒరిగి భక్తులకు దర్శనమివ్వడం విశేషం. అంతేకాదు, ఈ ప్రాంగణంలోని గర్భగుడికి పైకప్పు ఉండదు. 

స్థలపురాణం 

ఈ ఆలయ నిర్మాణం, స్వామి విగ్రహానికి సంబంధించి కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. త్రేతాయుగంలో జాంబవంతుడు ఇక్కడ స్వామి విగ్రహాన్ని స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అదే విధంగా సీతాదేవి జాడ వెదుకుతూ వచ్చిన హనుమంతుడు ఈ ప్రాంతంలో సేదతీరాడనీ అలా ఇక్కడ స్వామి విగ్రహం వెలసిందనీ అంటారు. ఇక... స్వామి విగ్రహం ఓ పక్కకు ఒరిగి ఉండటానికీ ఓ కథ ఉంది. ఒకప్పుడు స్వామిని పూజించే అర్చకుడు పొట్టిగా ఉండేవాడట. దాంతో రోజూ స్వామికి సరిగ్గా పూజ చేయలేక ఇబ్బంది పడేవాడట. ఆ అసంతృప్తితో అర్చకుడు ఓ రోజు విగ్రహం తన చేతికి అందితే కానీ పూజ చేయకూడదని నిర్ణయించుకుని అదే విషయాన్ని స్వామికి విన్నవించుకున్నాడట. కాసేపటికి స్వామి విగ్రహం పూజారికి అందేలా కాస్త పక్కకు ఒరిగిందట. అప్పటినుంచీ విగ్రహం ఒకవైపు వాలినట్లుగా ఉండిపోయిందని అంటారు. గర్భగుడిలో పైకప్పు లేకపోవడానికీ ఓ కథ ఉంది. ఇక్కడ గర్భగుడిలోని పైకప్పును ఉదయం నుంచీ సాయంత్రంలోగా నిర్మించాలనేది నియమమనీ... రెండుసార్లు అలా ప్రయత్నించినా పైకప్పు కూలిపోయిందనీ.. దాంతో దాన్ని అలాగే వదిలేశారనీ చెబుతారు స్థానికులు. గర్భగుడిలో సైతం భక్తులు ప్రదక్షిణలు చేసే అవకాశం ఉన్న ఆలయం కూడా ఇదేకావడం విశేషం. 

శనిదోషాన్ని పోగొట్టే స్వామి 

ఈ స్వామిని 41 రోజులపాటు భక్తితో పూజిస్తే... కోరికలు తీరుస్తాడనీ, శనిదోషాలనూ నివారిస్తాడనీ అంటారు. ఆంజనేయుడికి సింధూర లేపనం అంటే ఇష్టమనీ.. మనసులో ఏదయినా అనుకుని సింధూరాన్ని స్వామికి అర్పిస్తే సంతానం, యశస్సు, విద్య.. ఇలా ఏది అనుకున్నా ప్రసాదిస్తాడనీ చెబుతారు. మార్గశిర మాసంలో త్రయోదశి నుంచి బహుళ విదియ వరకూ స్వామి వారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. మార్గశిర పౌర్ణమి రోజున రథోత్సవం, ఉట్టికొట్టే కార్యక్రమాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులూ వస్తారు. అదేవిధంగా ఉగాది, శ్రీరామనవమి, హనుమజ్జయంతి, అక్షయ తృతీయ రోజుల్లోనూ వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

ఎలా చేరుకోవచ్చు 

ఈ ఆలయం హైదరాబాద్‌కు 163 కిలోమీటర్ల దూరంలో... కర్నూల్‌కు 117 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల నుంచీ ఆలయానికి చేరుకునేందుకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. లేదంటే మహబూబ్‌నగర్‌ వరకూ రైల్లో వస్తే.. అక్కడి నుంచి ఆలయం 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

- దాసరి సుభాష్‌, ఈనాడు పాత్రికేయ పాఠశాల


ఇది విన్నారా...
పార్వతి ఒడిలో సేదతీరే స్వామి

ఏ ఆలయంలో చూసినా పరమేశ్వరుడు లింగాకారంలోనే భక్తులకు దర్శనమిస్తాడు. లేదంటే... ధ్యానముద్రలో కనిపిస్తాడు. కానీ చిత్తూరు జిల్లా - తమిళనాడు సరిహద్దు, సరుత్తుపల్లిలోని పళ్లికొండేశ్వర ఆలయంలో స్వామి పార్వతీదేవి ఒడిలో సేదతీరుతూ భక్తులకు దర్శనమిస్తాడు. అమృతం కోసం సముద్ర మథనం జరిగిన సమయంలో.. వచ్చిన హాలాహలాన్ని స్వీకరించిన పరమేశ్వరుడు ఆ విషం తన శరీరమంతా వ్యాపించకుండా గొంతులోనే నొక్కిపెట్టేయడం తెలిసిందే. తరువాత అక్కడి నుంచి పార్వతీదేవితో కలిసి కైలాసానికి ప్రయాణించిన స్వామి... ఇక్కడకు వచ్చేసరికి అలసిపోయాడట. దాంతో పార్వతీదేవి ఒడిలో కాసేపు సేదతీరాడట. ఆ సమయంలో ఆదిదంపతుల చుట్టూ దేవతలూ, రుషులూ కొలువుదీరి.. శివుడు కళ్లు తెరిచే సమయం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారట. కాసేపటికి స్వామి కళ్లు తెరిచారనీ.. ఆ విగ్రహాలే ఇక్కడ వెలిశాయనీ అంటారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts