రాముడి కల్యాణం...రెండుసార్లు చేస్తారిక్కడ!

కార్తిక మాసం అనగానే శివాభిషేకాలూ, పార్వతీ పరమేశ్వరుల కల్యాణాలూ చూస్తుంటాం. కానీ జీడికల్‌ వీరాచలం రామచంద్రస్వామి ఆలయంలో మాత్రం ఎక్కడా లేని విధంగా సీతారామ కల్యాణాన్ని చేస్తారు.

Published : 12 Nov 2022 23:56 IST

రాముడి కల్యాణం...రెండుసార్లు చేస్తారిక్కడ!

కార్తిక మాసం అనగానే శివాభిషేకాలూ, పార్వతీ పరమేశ్వరుల కల్యాణాలూ చూస్తుంటాం. కానీ జీడికల్‌ వీరాచలం రామచంద్రస్వామి ఆలయంలో మాత్రం ఎక్కడా లేని విధంగా సీతారామ కల్యాణాన్ని చేస్తారు. నెలరోజులపాటు కన్నులపండుగ్గా జాతరనూ నిర్వహిస్తారు. ఈ రాముడికి మీసాలు ఉండటం ప్రత్యేకం.

హ్లాదకరమైన వాతావరణంలో వీరాచలం అనే కొండపైన వెలసిన ఈ మీసాల రాముడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ వీరాచలం రామచంద్రస్వామి ఆలయం జనగాం జిల్లా లింగాల ఘనపురం మండలంలోని జీడికల్‌ అనే గ్రామంలో ఉంది.  

స్థలపురాణం  

త్రేతాయుగంలో వీరుడు అనే రుషి రాముడి కోసం తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమైనప్పుడు... తనలో స్థిర నివాసం ఏర్పరచుకోమని కోరడంతో రాముడు సరేనంటూ అనుగ్రహించాడట. కొంతకాలానికి తండ్రికి ఇచ్చిన మాటను మన్నించి రాముడు - సీతాదేవి, లక్ష్మణుడి సమేతంగా అడవులకు వెళ్లాడు. ఆ సమయంలో మారీచుడు బంగారులేడి రూపంలో రావడంతో సీతాదేవి తనకు ఆ జింకను తెచ్చిపెట్టమని పట్టుబట్టింది. అలా రాముడు జింకను వేటాడుతూ ఈ ప్రాంతానికి వచ్చాడని అంటారు. చివరకు జింకపైకి బాణాన్ని సంధించడం వల్ల అందులోంచి రాక్షసుడు బయటకు వచ్చాడనీ... ఆ రాక్షసుడి దాహం తీర్చేందుకు ఈ ప్రాంతంలో ఓ చోట చేత్తో తడమడం వల్ల నీరు వచ్చిందనీ చెబుతారు. ఆ తరువాతే స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడనీ పురాణగాథ.

పౌర్ణమి నుంచి జాతర...

ఈ ఆలయంలో స్వామి మీసాలతో ఉత్తరముఖాన దర్శనమిస్తాడు. గర్భగుడిలో స్వామి ముందు ఉన్న రామగుండంలోని నీరు ఎక్కడి నుంచి వస్తోందో ఇప్పటికీ అర్థంకాదని చెబుతారు ఆలయ నిర్వాహకులు. గుడి వెనుకభాగంలో ఉన్న పాల-జీడి గుండాల్లో స్నానం చేసి స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఇప్పటికీ రాక్షసుడి దాహం తీర్చేందుకు రాముడు తవ్విన ప్రాంతాన్ని పరిశుభ్రమైన వస్త్రంతో తుడిస్తే నీరు ఊరుతుందని అంటారు. ఈ గుట్టపైన వాల్మీకి గుహనూ హనుమంతుడి విగ్రహాలనూ దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో కార్తికంలోనూ స్వామికి కల్యాణాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా కార్తిక పౌర్ణమి నుంచి ఏకాదశి వరకూ పెద్ద ఎత్తున జరిగే జాతరలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు తరలిరావడం విశేషం.  

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జనగాం వరకూ రైలు, రోడ్డు మార్గాల్లో  చేరుకుంటే అక్కడినుంచి ఆలయానికి ఆటోల్లో వెళ్లొచ్చు.   

- బి.మహేశ్‌ కుమార్‌, ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


ఇది విన్నారా...

శీర్షాసనంలో దర్శనమిచ్చే శివుడు

రమేశ్వరుడు సాధారణంగా ఏ ఆలయంలో అయినా..లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. ఆ శివలింగానికే సందర్భానుసారంగా అలంకరణలు చేస్తుంటారు. అలాంటి వాటన్నింటికీ భిన్నం ఈ శక్తీశ్వర స్వామి ఆలయం. ఎందుకంటే... పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని యనమదుర్రు అనే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో పరమేశ్వరుడు శీర్షాసనంలో యోగముద్రలో దర్శనమిస్తాడు మరి. స్వామి పక్కనే పార్వతీదేవి పసిబాలుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆశీనురాలై ఉంటుంది. స్వామి ఈ రూపంలో కొలువుదీరడం వెనుక రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. యమధర్మరాజు స్వామికోసం తపస్సు చేసి.. ఉన్నపళంగా రమ్మని కోరాడట. ఆ సమయంలో స్వామి యోగముద్రలో శీర్షాసనంలో ఉన్నాడనీ.. అలాగే వచ్చి యముడిని అనుగ్రహించాడనీ ఓ కథనం. అలాగే శంబాసురుడు అనే రాక్షసుడు కేవలం యమధర్మరాజు చేతిలోనే మరణం పొందేలా వరం పొంది... ఆ తరువాత రుషుల్ని వేధించడం మొదలుపెట్టాడట. దాంతో రుషులు యమధర్మరాజును వేడుకోవడంతో యముడు ఆ అసురుడితో యుద్ధం చేయడం ఆరంభించినా క్రమంగా ఓడిపోయాడట. ఆ సమయంలో ఇంకా శక్తిని పొందేందుకు శివుడికోసం తపస్సు చేశాడు. అయితే... శివుడు యోగముద్రలో ఉండటంతో  పార్వతీదేవి వరాలు ఇచ్చిందనీ.. అలా ఆ అసురుడిని యముడు అంతమొందించాడనీ అంటారు. ఆయన కోరిక మేరకు శివుడు ఇక్కడ శీర్షాసనంలోనే వెలిశాడని కథనం. ఒకే పీఠంపైన శివుడు శక్తిసమేతంగా వెలిశాడు కాబట్టే ఈ ఆలయాన్ని శక్తీశ్వర క్షేత్రంగా పిలుస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..