శని భగవానుడు కోరి కట్టించుకున్న క్షేత్రం!

ఆలయాల్లో కనిపించే దేవతా మూర్తుల విగ్రహాల్లో... కొన్ని స్వయంభువుగా ప్రకటితమైతే మరికొన్నింటిని భక్తులూ, స్వామీజీలూ ప్రతిష్ఠించడాన్ని చూస్తుంటాం.

Published : 23 Jun 2024 00:13 IST

ఆలయాల్లో కనిపించే దేవతా మూర్తుల విగ్రహాల్లో... కొన్ని స్వయంభువుగా ప్రకటితమైతే మరికొన్నింటిని భక్తులూ, స్వామీజీలూ ప్రతిష్ఠించడాన్ని చూస్తుంటాం. ఈ రెండూ కాకుండా భగవానుడే కోరి మరీ కట్టించుకునే ఆలయాలు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి శ్రీగిరి పీఠం. శనిభగవానుడు ఓ భక్తుడికి కలలో కనిపించి మరీ నిర్మించుకున్న ఈ ఆలయంలో స్వామి కొలువుదీరడం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. ఇక్కడ నిర్వహించే పూజలూ ప్రత్యేకంగా ఉంటాయి.

రాముడు, కృష్ణుడు, వినాయకుడు, హనుమంతుడు, శివుడు... ఇలా ఏ దేవతా మూర్తిని తీసుకున్నా దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు కనిపిస్తాయి. వాటితో పోలిస్తే శని భగవానుడికి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయనేది తెలిసిందే. అలా అరుదుగా ఉండే శని దేవాలయాల్లో ఒకటి శ్రీ గిరిపీఠం. ఇది శంషాబాద్‌లోని మదనపల్లి గ్రామంలో ఆకట్టుకునే నిర్మాణశైలితో కనిపిస్తుంది. శనిదోషాలు పోయేందుకు భక్తులు చేయించుకునే హోమాలూ, తైలాభిషేకాలతో నిత్యం కళకళలాడే ఈ ఆలయాన్ని- ఓ భక్తుడు శని భగవానుడి కోరిక మేరకు
నిర్మించడం విశేషం.

కలలో కనిపించి...

శ్రీగిరిపట్నం శంకరరాజు ముఖియా అనే భక్తుడు కట్టించిన ఆలయమే ఈ శనీశ్వర క్షేత్రం. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన శంకరరాజు దాదాపు ముప్ఫై ఏళ్ల క్రితమే షాద్‌నగర్‌లో ఏడు గుళ్లను నిర్మించారు. ఆ ఆలయాలు ప్రారంభమైన కొన్నాళ్లకు శంకరరాజుకు శని భగవానుడు కలలో కనిపించి తనకోసం ఆలయాన్ని నిర్మించమని కోరాడట. మొదట్లో ఆ విషయాన్ని అతను పట్టించుకోలేదు. కానీ కల తరచూ వస్తుండటంతో శంకరరాజు ఆలయం కట్టించాలనుకున్నారు. అదే విషయాన్ని సన్నిహితులతో చెబితే- శనిదేవాలయాన్ని కట్టొచ్చని కొందరూ, వద్దని మరికొందరూ చెప్పారట. చివరకు పండితుల్నీ, పీఠాధిపతుల్నీ సంప్రదించి పదహారేళ్ల క్రితం మదనపల్లిలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్వామి విగ్రహాన్ని మహాబలిపురంలో తయారు చేయించి ప్రతిష్ఠించారు.

ప్రదక్షిణ చేస్తే చాలు...

మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయానికి గంటల శనీశ్వర క్షేత్రమని పేరు. ఇక్కడ చండ ప్రచండలు ద్వారపాలకులుగా కనిపిస్తారు. గుడిలోపలికి ప్రవేశించాక దాదాపు పన్నెండున్నర అడుగుల శని భగవానుడి విగ్రహం దర్శనమిస్తుంది. మందిరంలోకి వచ్చే భక్తులు ఏడుసార్లు గంటను కొట్టి స్వామికి తమ కోరికను విన్నవించుకుంటారు. ఆ తరువాత శనిదోష నివారణకోసం తైలాభిషేకం, నువ్వుల దానాలు చేస్తారు. శని శాంతి పూజలతోపాటు శనివారం నాడు కొబ్బరికాయకు నల్ల వస్త్రాన్ని చుట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ నిర్వహించే హోమంలో వేస్తారు. ఇలా చేయడం వల్ల శనిదోషం తొలగిపోతుందని భక్తుల నమ్మకం. శనీశ్వరుడికి నిమ్మకాయ మాలల్నీ వేసి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శని భగవానుడు శాంతిస్తాడట. అలానే శనిదేవాలయాల్లో వాహన పూజలు చేయడం చాలా అరుదు. కానీ ఇక్కడ వాహన పూజలు చేయించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. శనికి చేసే పూజల అనంతరం ఇక్కడ కొలువైన పార్వతీ పరమేశ్వరుల్నీ, హనుమంతుడినీ, సుబ్రహ్మణ్యేశ్వరుడినీ, వినాయకుడినీ, రాహువు-కేతువుల్నీ దర్శించుకోవచ్చు. ఇక, ఇక్కడకు వచ్చే చాలామందికి శని విగ్రహాన్ని తాకవచ్చా అనే సందేహం కలుగుతుంది కానీ... జ్యేష్ఠాదేవి కూడా ఉండటం వల్ల ఎవరైనా స్వామి విగ్రహాన్ని తాకొచ్చని చెబుతారు అర్చకులు. రోజువారీ పూజలతోపాటు శనిత్రయోదశి, శనిజయంతి వంటి ప్రత్యేక పర్వదినాల్లో నిర్వహించే విశేషమైన పూజా కార్యక్రమాల్లో వేలాది భక్తులు పాల్గొంటారు. ప్రతి శనివారం భక్తులకు అన్నదానం చేస్తారు.

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం శంషాబాద్‌కు దగ్గర్లో మదనపల్లి అనే గ్రామంలో ఉంటుంది. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్‌ వరకూ బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి ఆటోలూ, ప్రైవేటు వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..