Published : 03 Dec 2022 23:49 IST

భక్తుడి కోసం... వెలసిన సుబ్రహ్మణ్యేశ్వరుడు!

కొండ ప్రాంతంలో కొలువుదీరి... కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఓ భక్తుడికి ఇచ్చిన వరం కోసమే స్వామి ఇక్కడ వల్లీదేవసేన సమేతంగా వెలసి దర్శనమిస్తున్నాడనీ చెబుతారు. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందనీ అంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే సుఖసంతోషాలు సొంతమవుతాయని నమ్ముతారు భక్తులు.

ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఆనందగిరి కొండపైన కార్తికేయుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని ఊట్లవారిపల్లెలో ఉండే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ భక్తుడి కోరిక ఉందనీ.. దాన్ని మరోభక్తుడు నెరవేర్చాడనీ అంటారు.

స్థలపురాణం

ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాళ్యంకొండ అని పిలిచేవారనీ... క్రమంగా అదే ఆనందగిరిగా మారిందనీ చెబుతారు. ఈ ప్రాంతంలో నివసించే సిద్ధాచారి అనే భక్తుడికి సంతానం లేకపోవడంతో ఆ దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించారు. కొన్నాళ్లకు ఇక్కడకు వచ్చి శివుడిని పూజించాక వాళ్లకో అబ్బాయి కలగడంతో పాలవరాయుడు అనే పేరు పెట్టుకున్నారు. అయితే... అతడు పదకొండేళ్లకే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. అప్పటి నుంచీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామినే ధ్యానిస్తూ ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాడు. పాలవరాయుడు చివరిదశలో ఉన్నప్పుడు అతడికి స్వామి కలలో కనిపించి ఏదయినా వరం కోరుకోమని అడిగినప్పుడు... పాకాలలో వల్లీ దేవసేన సమేతంగా కొలువుదీరమని అభ్యర్థించాడట. దానికి అనుగ్రహించిన స్వామి ఓ భక్తుడే తన ఆలయాన్ని నిర్మిస్తాడని చెప్పి... పాలవరాయుడికి ముక్తిని ప్రసాదించాడట. ఇది జరిగిన కొన్నాళ్లకు తీవ్ర కడుపునొప్పితో బాధపడే మునుస్వామి ఆచారి అనే స్వర్ణకారుడికి స్వామి కలలో కనిపించాడట. పాకాల కొండపైన తన ఉనికిని తెలియజేస్తూ... అక్కడున్న తీర్థాన్ని స్వీకరించమనీ దానివల్ల అతడి కడుపునొప్పి నయం అవుతుందనీ ఆ తరువాత తనకు అక్కడే ఆలయాన్ని నిర్మించమనీ చెప్పాడట. స్వామి సూచించినట్లుగానే పాకాలకు వచ్చి స్వామిని దర్శించుకుని తీర్థం తీసుకున్నాక... అతడి కడుపునొప్పి తగ్గిపోయిందట. దాంతో మునుస్వామి ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడు. ఇది తెలిసి... స్థానికులూ అతడికి సాయం చేయడంతో ఆలయ నిర్మాణం పూర్తయిందని కథనం. క్రమంగా భక్తులూ, మరికొందరు దాతలూ ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో ఈ క్షేత్రం గురించి అందిరికీ తెలిసిందని చెబుతారు.  

ఇతర ఉపాలయాలూ...

ఒకప్పుడు... ఈ ఆలయానికి వెళ్లేందుకు పెద్ద కొండ అడ్డుగా ఉండటం వల్ల రాకపోకలకు ఒకే మార్గాన్ని వాడాల్సి వచ్చేదట. అది కష్టంగా అనిపించి భక్తులు స్వామిని వేడుకోవడంతో ఓ రోజు పిడుగు పడి కొండ రెండుగా చీలి మార్గం ఏర్పడిందని చెబుతారు స్థానికులు. అప్పటి నుంచీ వివిధ ప్రాంతాల భక్తుల రాక పెరిగిందట. ఇక్కడ... వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యస్వామితో పాటు.. షణ్ముఖుడు, శివపార్వతులు, వినాయకుడు, నవగ్రహాలు, నాగాలమ్మ... తదితర విగ్రహాలనూ దర్శించుకోవచ్చు. ఎక్కడా లేని విధంగా పార్వతీపరమేశ్వరుల విగ్రహాల సమీపంలో అంగారక విగ్రహం కూడా ఉంటుంది. నిత్యపూజలూ, ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలూ జరిగే ఈ ఆలయాన్ని కర్ణాటకతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులూ సందర్శించుకోవడం విశేషం. తమ కోర్కెలు నెరవేరినప్పుడల్లా భక్తులు కావిళ్లతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయనీ... ఆలయ ప్రాంగణంలో వివాహం చేసుకునే జంటలకు సంతానప్రాప్తి కలుగుతుందనీ భక్తుల నమ్మకం.  

ఎలా చేరుకోవచ్చు  

ఈ ఆలయం తిరుపతికి 43 కి.మీ. దూరంలో ఉంది. రైల్లో రావాలనుకునే భక్తులకు పాకాలలోనే రైల్వేస్టేషన్‌ ఉంది. అక్కడ నుంచి ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది. ఒకవేళ తిరుపతిలో దిగితే... ఆలయానికి చేరుకునేందుకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక చిత్తూరు నుంచి పాకాలకు 33 కి.మీ. దూరం ఉంటుంది. 

కొచ్చెర్ల మాల్యాద్రి, ఈనాడు, చిత్తూరు డెస్క్‌.  

చిత్రాలు: టి.నీలకంఠ నాయుడు, న్యూస్‌టుడే, పాకాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..