శనిదోషం పోగొట్టే శివాలయం

ఈ ఆలయంలోని శనికి ఎలాంటి శక్తులూ లేకపోయినా... ఇక్కడున్న పుష్కరిణిలో స్నానం చేస్తే శని ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు.

Updated : 11 Feb 2024 14:26 IST

ఈ ఆలయంలోని శనికి ఎలాంటి శక్తులూ లేకపోయినా... ఇక్కడున్న పుష్కరిణిలో స్నానం చేస్తే శని ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు. నల మహారాజు దర్శించుకున్న ఈ తిరునల్లార్‌ శనీశ్వర ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది.

తిరునల్లార్‌ శనీశ్వర ఆలయం లేదా దర్భారణ్యేశ్వరస్వామి క్షేత్రంగా పిలిచే ఈ శనిదేవాలయం... పుదుచ్చేరికి చెందిన కారైకాల్‌లో ఉంటుంది. ఈ ఆలయాన్ని చోళులూ ఆ తరువాత ఎందరో రాజులూ అభివృద్ధి చేసినట్లుగా చెబుతారు. ఏడాది మొత్తం విశేష పూజలతో.. భక్తుల తాకిడితో కళకళలాడే ఈ ఆలయంలోని పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని పూజిస్తే శని ప్రభావం తగ్గి.. సకల శుభాలూ కలుగుతాయని అంటారు. ఇక్కడ శివుడు దర్భారణ్యేశ్వర స్వామిగా, పార్వతీదేవి ప్రాణేశ్వరిగా పూజలు అందుకుంటుంటే... మొదట శనిని దర్శించుకున్నాకే శివపార్వతుల్ని చూడాలని చెబుతారు. ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే...

స్థలపురాణం

ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు ఇక్కడున్న శివాలయంలో రోజూ పాలు పోయమంటూ ఓ గొల్లవాడిని ఆజ్ఞాపించాడట. శివభక్తుడైన ఆ గొల్లవాడు రాజు చెప్పినట్లుగానే చేసేవాడట. కొన్ని రోజులకు ఆలయ అధికారి... ఆ పాలను ఆలయంలో కాకుండా తన ఇంట్లో పోయమనీ... ఈ విషయాన్ని రాజుకు చెప్పకూడదనీ హెచ్చరించాడట. అప్పటినుంచీ గొల్లవాడు ఆ అధికారి ఇంట్లో పాలు పోయడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఆలయ పూజారి రాజు దృష్టికి తీసుకెళ్లడంతో గొల్లవాడిని పిలిపించి కారణం అడిగాడు. గొల్లవాడు భయపడి ఎంతకీ విషయం చెప్పకపోవడంతో రాజు ఆగ్రహించి... అతడికి మరణదండన విధించమంటూ ఆజ్ఞాపించాడు. దాంతో ఆ భక్తుడు శివుడిని వేడుకోగా.. స్వామి అనుగ్రహించాడని కథనం. ఆ  క్రమంలోనే స్వామి బలిపీఠం కాస్త దూరం జరిగిందనీ, ఇప్పటికీ అలాగే ఉంటుందనీ అంటారు. అలా శివుడు ఇక్కడ పార్వతీ సమేతంగా దర్భారణ్యేశ్వరస్వామిగా పూజలు అందుకుంటున్నాడని అంటారు. ఇక... విదర్భ చక్రవర్తి భీముని కుమార్తె అయిన దమయంతిని ఎందరో దేవతలు/రాజులు వివాహమాడాలనుకున్నారట. అయితే... ఆమెను నలమహారాజు పెళ్లి చేసుకోవడంతో దేవతలు ఆ జంటను ఇబ్బందిపెట్టాలనుకుని ఆ పనిని శనికి అప్పగించారట. శని ఆగ్రహం కారణంగా నలుడు రాజ్యాన్ని కోల్పోవడంతోపాటు ఆ జంట రకరకాల సమస్యల్ని ఎదుర్కొందట. చివరకు నలుడు ఈ ప్రాంతానికి వచ్చి... ఇక్కడున్న కొలనులో స్నానమాచరించి... స్వామిని పూజించడంతో పరమేశ్వరుడు అనుగ్రహించి ఆ తరువాత శనిలోని శక్తులన్నీ తొలగించాడట. అలా నలుడికి శని ప్రభావం తగ్గి అతడి రాజ్యం తిరిగి సొంతమైందని అంటారు. అందుకే ఈ పుష్కరిణికి నలతీర్థమనే పేరు వచ్చిందని చెబుతారు.

దోషాలు పోతాయి...

దేశవ్యాప్తంగా రకరకాల శనిదేవాలయాలున్నా... ఇక్కడ మాత్రమే శని శక్తులన్నీ శివుడు తొలగించాడు కాబట్టి.. శని ప్రభావం భక్తులపైన పడదని చెబుతారు. శనిదోషాలున్న వారంతా ఇక్కడి నలతీర్థంలో స్నానమాచరించి శనిని పూజిస్తే... సకల శుభాలూ కలుగుతాయి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా శివుడు పూజలు అందుకుంటున్నా కూడా... మొదట శనినే దర్శించుకోవాలి. శని ఇక్కడ పరమేశ్వరుడికి ద్వారపాలకుడని చెబుతారు. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, పూజాది కార్యక్రమాలు అయ్యాక అన్నాన్ని కాకులకు సమర్పించడం ఈ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి. మహాశివరాత్రి, కార్తికమాసం, సంక్రాంతి సమయాల్లో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల పేరుతో ఉత్సవాలనూ జరిపిస్తారు.

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం కారైకాల్‌లో ఉంటుంది. విమానంలో రావాలనుకునేవారు తిరుచ్చి విమానాశ్రయంలో దిగితే అక్కడినుంచి ఆలయానికి చేరుకునేందుకు బస్సులూ, ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..