ఈ కృష్ణుడికి ఆకలి ఎక్కువట!

ఏ ఆలయమైనా... ఉదయం అయిదు లేదా ఆరు గంటలకు తెరుస్తారు. కానీ తిరువరప్పు కృష్ణమందిరంలోని తలుపులు మాత్రం ఠంచనుగా అర్ధరాత్రి రెండుగంటలకు తెరుచుకుంటాయి. ఎందుకూ అంటే... ఇక్కడి కృష్ణుడికి ఆకలి ఎక్కువనీ...

Published : 14 Aug 2022 00:38 IST

ఈ కృష్ణుడికి ఆకలి ఎక్కువట!

ఏ ఆలయమైనా... ఉదయం అయిదు లేదా ఆరు గంటలకు తెరుస్తారు. కానీ తిరువరప్పు కృష్ణమందిరంలోని తలుపులు మాత్రం ఠంచనుగా అర్ధరాత్రి రెండుగంటలకు తెరుచుకుంటాయి. ఎందుకూ అంటే... ఇక్కడి కృష్ణుడికి ఆకలి ఎక్కువనీ... అందుకే ఆ సమయంలోనే స్వామికి నైవేద్యాన్ని సమర్పించాలనీ చెబుతారు ఆలయ పూజారులు. నిత్యపూజలూ, ఇతర వేడుకలతో కళకళలాడే ఈ ఆలయానికి మరికొన్ని ప్రత్యేకతలూ ఉన్నాయి.

చ్చని చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో కనిపిస్తుంది తిరువరప్పు కృష్ణ దేవాలయం. వెడల్పాటి పాత్రలో నిల్చుని దర్శనమిచ్చే ఈ స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయనీ, గ్రహదోషాలూ పోతాయనీ భక్తుల నమ్మకం. కేరళలోని కోట్టయం జిల్లా తిరువరప్పు అనే ఊళ్లో కనిపించే ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది.

స్థలపురాణం

పాండవులు వనవాసానికి వెళ్తున్నప్పుడు... తనని పూజించేందుకు వీలుగా కృష్ణుడు వాళ్లకో విగ్రహాన్ని ఇచ్చాడట. వనవాసం పూర్తయ్యే సమయానికి పాండవులు చేర్తాలా అనే ప్రాంతంలో ఉన్నారట. పాండవులు అక్కడి నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ఆ ఊరివాళ్లు కృష్ణుడి విగ్రహాన్ని తమకు ఇవ్వమని అడిగారట. పాండవులు విగ్రహాన్ని ఇవ్వడంతో వారంతా ఓ ఆలయాన్ని నిర్మించి అందులో స్వామిని ప్రతిష్ఠించి పూజించడం మొదలుపెట్టారట. అయితే... రోజులు గడిచేకొద్దీ ఊరివాళ్లకు రకరకాల సమస్యలు ఎదురవడంతో ఓ స్వామీజీని సంప్రదించారట. కృష్ణుడికి సరిగ్గా పూజలు చేయకపోవడం వల్లే అలా జరుగుతోందని వివరించిన ఆ స్వామీజీ సరైన రీతిలో చేయలేనప్పుడు విగ్రహాన్ని నీటిలో వదిలేయడమే మంచిదని సలహా ఇచ్చాడట. దాంతో ఊరివాళ్లు విగ్రహాన్ని తీసుకెళ్లి ఓ కొలనులో వదిలేశారట. కొన్నాళ్లకు విళ్వమంగళం స్వామి అనే సాధువు పడవలో ఆ కొలను మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు సరిగ్గా స్వామి విగ్రహాన్ని వదిలేసిన చోట పడవ ఆగిపోయిందట. సాధువు సలహాతో పడవలో ఉన్నవాళ్లు నీటిలోకి వెళ్లి వెతికితే విగ్రహం కనిపించింది. దాన్ని తీసుకున్న ఆ సాధువు ఒడ్డుకు వెళ్లాక ఆ పక్కనే కన్పించిన ఓ వెడల్పాటి పాత్రలో విగ్రహాన్ని ఉంచి స్నానం చేసేందుకు వెళ్లాడట. తిరిగొచ్చి చూస్తే ఆ పాత్ర మట్టిలో ఇరుక్కుపోవడంతో పాటూ విగ్రహం పాత్రకు అతుక్కుపోయిందట. విషయం తెలిసి ఊరివాళ్లంతా అక్కడ చేరారట. వాళ్లలోని ఓ భక్తుడు స్వామి విగ్రహం ఉన్న పాత్రా, స్థలమూ తనదేనని చెప్పి, ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణానికి ఇవ్వడంతో అక్కడే ఆలయాన్ని నిర్మించి అందులో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారన్నది స్థలపురాణం.


 

గ్రహణమైనా సరే...

ఈ ఆలయంలో కొలువైన కృష్ణుడికి ఆకలి ఎక్కువని అంటారు. కంసుడి సంహారం తరువాత స్వామి ఆకలితో ఉంటాడనీ... ఆ రూపమే ఇక్కడ కొలువయ్యిందనీ చెబుతారు. అందుకే అర్ధరాత్రే స్వామికి నైవేద్యం నివేదిస్తారు. ఆ సమయంలో ద్వారాలు తెరిచేందుకు ప్రధాన పూజారి తాళాలతోపాటు చిన్న గొడ్డలిని కూడా తెస్తాడు. తాళాలు తెరవడంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా... కృష్ణుడి నైవేద్యానికి ఆటంకం కలుగుతుంది కాబట్టి... ఇబ్బంది లేకుండా గొడ్డలితో తాళం పగలగొట్టేందుకే ఆ ఏర్పాటు. ఇక, గుడి తలుపులు తెరిచాక రకరకాల పూజలు కాకుండా... ముందుగా స్వామికి అభిషేకం మాత్రం చేసి ఆ వెంటనే ఉషా పాయసం పేరుతో ప్రత్యేక వంటకాన్ని నివేదిస్తారు. అదయ్యాకే స్వామి విగ్రహాన్ని తుడిచి ఇతర అలంకరణలూ, పూజలూ చేస్తారు. అలా రోజులో అయిదారుస్లారు ప్రసాదాలు నివేదిస్తూనే ఉంటారు. సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్వామి ఆకలికి తట్టుకోలేడనే ఉద్దేశంతో ఎలాంటి గ్రహణ నియమాలనూ పాటించరు.

విశేష పూజలూ...

ఇక్కడ స్వామికి ఏడాది పొడవునా చేసే పూజలో కలువపూలు తప్పనిసరిగా ఉంటాయి. ఏప్రిల్‌-మే నెలల్లో పదిరోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు చేస్తారు. పదో రోజున సూర్యకిరణాలు స్వామి విగ్రహంపైన పడటం విశేషం. అదేవిధంగా ఏనుగులకు నిర్వహించే పోటీలనూ,  సంగీత నాటక నృత్య ప్రదర్శనలనూ చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడకు వస్తారు.

ఎలా చేరుకోవచ్చు
ఈ ఆలయం కేరళలోని కోట్టయం జిల్లాలో ఉంటుంది. కేరళ వరకూ విమానం లేదా రైల్లో చేరుకుంటే... అక్కడి నుంచి కోట్టయం వెళ్లేందుకు రైళ్లూ, బస్సులూ ఉంటాయి. కోట్టయం నుంచి ఆలయం దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..