ఈ వేణుగోపాలుడు కోటీశ్వరుడు!

విశాలమైన ప్రాంగణంలో... అబ్బురపరిచే నిర్మాణశైలితో అలరారే క్షేత్రమే వేణుగోపాలస్వామి ఆలయం. బొబ్బిలిరాజ వంశీకులు నిర్మించిన ఈ ఆలయంలో కొలువైన వేణుగోపాలుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు.

Updated : 04 Jun 2023 12:14 IST

విశాలమైన ప్రాంగణంలో... అబ్బురపరిచే నిర్మాణశైలితో అలరారే క్షేత్రమే వేణుగోపాలస్వామి ఆలయం. బొబ్బిలిరాజ వంశీకులు నిర్మించిన ఈ ఆలయంలో కొలువైన వేణుగోపాలుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. ప్రత్యేక ఉత్సవాలూ, భక్తుల రాకపోకలతో కళకళలాడే ఈ క్షేత్రంలోని స్వామిపేరుమీద విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతారు.

ఎత్తైన రాజగోపురం... రాజుల కాలంనాటి నిర్మాణశైలి... ప్రశాంతమైన వాతావరణంలో కనిపించే వేణుగోపాలస్వామి ఆలయం విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలో ఉంటుంది. ఈ ఆలయాన్ని బొబ్బిలి రాజులు సుమారు 300 సంవత్సరాల క్రితం తమ కోటకు దగ్గరగా నిర్మించినట్లుగా చెబుతారు. భక్తుల కోర్కెలు తీర్చే ఈ స్వామి విగ్రహం... ఆలయ నిర్మాణం వెనుకా ఆసక్తికరమైన కథ ఉంది.

స్థలపురాణం

బొబ్బిలి వంశస్థుల ఇలవేల్పు వేణుగోపాలస్వామి. ఆ స్వామిని రోజూ పూజించుకునేందుకు వీలుగా బొబ్బిలి రాజులు సుమారు మూడువందల సంవత్సరాల క్రితం తమ కోటకు దగ్గర్లోనే ఆలయాన్ని నిర్మించి... వేణుగోపాలస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించేవారట. ఇక, బొబ్బిలిరాజులకు కోడిపందాలంటే చెప్పలేనంత ఇష్టమట. ఎప్పుడు కోడిపందాలు నిర్వహించినా బొబ్బిలిప్రాంతంలోని కోళ్లే గెలిచేవట. అలా ఓసారి జరిగిన కోడిపందెంలో పొరుగుప్రాంతం రాజులు ఓడిపోవడంతో ఇరుప్రాంతాల మధ్య వాదన మొదలై... అది చివరకు యుద్ధానికి దారితీసిందట. దాన్ని అవకాశంగా తీసుకున్న ఫ్రెంచ్‌దేశస్థులు బొబ్బిలిరాజులు తాము అడిగిన కప్పం కట్టలేదన్న నెపంతో ఈ యుద్ధంలో పాల్గొని వేణుగోపాలస్వామి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారట. ఆ తరువాత ఆలయంలోని దేవతా విగ్రహాలను తమ దేశానికి తరలించుకుని పోయేందుకు సిద్ధమైనా.. చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకుని వాటిని బందరులోని ఓ గ్రామంలో విడిచి వెళ్లిపోయారట. దాంతో ఆ ఊరివాళ్లు విగ్రహాలను ఓ చోట ప్రతిష్ఠించి పూజించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు బొబ్బిలి వంశానికి చెందిన రాజా చిన రంగారావు మళ్లీ తమ రాజ్యాన్ని సొంతం చేసుకుని... బొబ్బిలి ప్రాంతాన్ని విస్తరించి ఆలయాన్ని పునర్నిర్మించాడట. ఆ తరువాత బందరులో స్వామి విగ్రహాలు ఉన్నాయని తెలిసి వాటిని తెచ్చి ఆలయంలో పునః ప్రతిష్ఠించాడని కథనం. సంవత్సరాలు గడిచేకొద్దీ ఆలయానికి అవసరమైన మరమ్మతులు కూడా చేశారు. ప్రస్తుతం బొబ్బిలి రాజవంశీయులైన బేబీ నాయన ఆలయ వ్యవహారాలు చూస్తున్నారు.

పూలతో ప్రత్యేక సేవ

ఈ ఆలయంలో రుక్మిణి-సత్యభామ సమేతంగా కొలువైన వేణుగోపాలస్వామిని కోట్లకు అధిపతిగా పేర్కొంటారు. ఈ స్వామి పేరుమీద సుమారు పది కిలోల బంగారం- వెండి ఆభరణాలు ఉన్నాయని అంటారు. అలాగే విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో వందల ఎకరాల భూములు స్వామిపేరుమీదనే ఉన్నాయి. ఇక్కడ, ప్రతిరోజూ జరిపే పూజా కార్యక్రమాలు కాకుండా చైత్రమాసంలో తొమ్మిదిరోజులపాటు ప్రత్యేక వసంతోత్సవాలను నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉన్న నీటి కొలను వద్దకు దేవతామూర్తుల్ని తీసుకురావడాన్ని ఓ వేడుకగా చేస్తారు. అదేవిధంగా మాఘ శుద్ధ ఏకాదశి నుంచి తొమ్మిది రోజులపాటు స్వామికి కల్యాణోత్సవాలను జరిపిస్తారు. కార్తిక మాసంలో స్వామికి పూలంగి సేవను నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుండి తెచ్చిన సుమారు వెయ్యిరకాల పూలతో దేవతామూర్తులనూ, ఆలయాన్నీ అలంకరించే ఈ వేడుకను చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఒడిశా, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఇవి కాకుండా కృష్ణాష్టమి నాడు ప్రత్యేకంగా నిర్వహించే పూజాకార్యక్రమాలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ధనుర్మాసంలో నెల మొత్తం సాగే ప్రముఖుల ఆధ్యాత్మిక ప్రసంగాలను వినేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో వేణుగోపాలస్వామితోపాటు రాజ్యలక్ష్మి, ఆండాళ్‌, ఆంజనేయస్వామి, సీతారాములు, రామానుజాచార్యులు, రాధాకృష్ణుల విగ్రహాలనూ దర్శించుకోవచ్చు.

ఎలా చేరుకోవచ్చు

బొబ్బిలిలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి చేరుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైళ్లూ, బస్సులూ అందుబాటులో ఉన్నాయి. బొబ్బిలి వరకూ రైలు లేదా బస్సుల్లో చేరుకుంటే.. అక్కడినుంచి ఆలయానికి వెళ్లేందుకు ఆటోలు ఉంటాయి.

జి.పోలినాయుడు, న్యూస్‌టుడే, బొబ్బిలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు