Published : 24 Sep 2022 23:44 IST

కరుణించవమ్మా... కనకదుర్గమ్మా!

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ...‘ అన్న కవివాక్కుకి నిక్కమైన నిదర్శనంగా భాసిల్లుతుంది ఇంద్రకీలాద్రిపైన వెలసిన కనకదుర్గమ్మ. దుర్గమ్మంటే దుర్గుణాల మహిషాసురుని మదమణచిన మహంకాళియే కాదు... తల్లిగా కొలిస్తే కోరిన శుభాలనొసగే కరుణామయి కూడా. విద్య, వివేకం, సంపద... ఇలా జీవితంలో నెగ్గుకురావడానికి కావాల్సిన అష్టైశ్వర్యాలనూ ప్రేమతో ప్రసాదించే అమ్మవారు కోట్లాది ప్రజలకి ఇలవేల్పు. గరళకంఠుడైన మల్లేశ్వరునిలో సగభాగమై బెజవాడలో వెలసిన దుర్గమ్మ నవరాత్రులకి కొలువుదీరే కోలాహలం చూసి తరించాల్సిందే...

చల్లని చూపులతో... చిరుమందహాసంతో కనిపిస్తూ... ప్రేమ, కరుణ, వాత్సల్యం కురిపిస్తూ... ఇంద్రకీలాద్రిపైన స్థిరనివాసం ఏర్పరచుకున్న దుర్గాదేవిని శరణు కోరితే సకల శుభాలూ కలుగుతాయి. అందుకే ముక్కోటి దేవతలు సైతం అమ్మ కరుణా కటాక్షాలు తమపైన ఉండాలని దేవిని పూజిస్తారు. జగాన్ని పాలించే ఆ జగజ్జనని ఇంద్రకీలాద్రిపైన కొలువుతీరడం, శరన్నవరాత్రుల సంప్రదాయం పుట్టుకల వెనుక కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

మహిషాసురమర్దినిగా వెలిసి...

దేవీ భాగవతం ప్రకారం... కృతయుగంలో కీలుడు అనే యక్షుడు అమ్మవారిని తన హృదయంలో నిలుపుకోవాలనుకున్నాడు. కీలుడి కోరిక నెరవేరే మార్గాన్ని చెప్పి మంత్రాన్ని ఉపదేశించాడు నారద మహర్షి. కీలుడు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయడంతో జగన్మాత ప్రత్యక్షమై కృష్ణానది ఒడ్డున పర్వత రూపంలో కొలువుదీరమనీ.. రాక్షస సంహారం అనంతరం ఆ శిఖరంపైన తాను స్థిరనివాసం ఏర్పరుచుకుంటాననీ చెప్పిందట. కొన్నాళ్లకు మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడంతో బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడా అసురుడు తనకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించమని అడగడంతో అది ప్రకృతి విరుద్ధమనీ అసంభవమనీ చెప్పి బ్రహ్మ నిరాకరించాడట. దాంతో స్త్రీ అబల కాబట్టి... ఆమె వల్ల తనకు ఏ ప్రమాదం రాదని భావించిన మహిషాసురుడు పురుషుడి చేతిలో మరణం లేకుండా వరం ఇవ్వమని కోరడంతో బ్రహ్మ అనుగ్రహించాడు. ఆ గర్వంతో మహిషాసురుడు దేవతలను యుద్ధంలో ఓడించి వాళ్లను ఇంద్రలోకం నుంచి తరిమేశాడు. ఆ అసురుడి ఆగడాలకు అంతులేకుండా పోవడంతో ఇంద్రాది దేవతలంతా కలిసి త్రిమూర్తుల దగ్గర మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు కోపోద్రిక్తులు కావడంతో... ఆ క్రోధం నుంచి తేజోవంతమైన స్త్రీరూపం ఏర్పడిందట. త్రిమూర్తులూ, ఇంద్రాది దేవతలంతా కలిసి.. ఆమెకు ఒక్కో ఆయుధాన్ని ప్రసాదించడంతో ఆ దేవి మహిషాసురుడిపైన యుద్ధానికి వెళ్లింది. తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధంచేసి పదో రోజున ఆ లోక కంటకుడిని వధించిన ఆమె... మహిషాసురమర్దిని అయ్యిందనీ, ఆ తరువాతే ఇంద్రకీలాద్రిపైన వెలసిందనీ పురాణగాథ. అప్పటినుంచే దేవీ శరన్నవరాత్రులు మొదలయ్యాయనీ, పదో రోజున విజయదశమి చేసుకునే సంప్రదాయం వచ్చిందనీ ప్రతీతి. అలా వెలసిన అమ్మవారిని ఇంద్రాది దేవతలు దర్శించుకోవడం వల్లే ఈ ప్రాంతం ఇంద్రకీలాద్రిగా మారిందట. మహిషాసురమర్దినిగా వెలసిన దేవి అప్పటికీ శాంతించక ఈ అరణ్య ప్రాంతంలో ఉన్న జీవాలనూ మనుషులనూ బలి కోరేదట. ఆ ఉగ్రరూపాన్ని శాంతింపజేసేందుకు దేవతలూ రుషులూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ ప్రాంతానికి వచ్చి... దేవి గురించి తెలుసుకుని ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతింపజేశాడనీ... అలా, దేవి పసుపు వర్ణంలో మెరిసిపోతూ మందహాసినియై తన బిడ్డలను కాపాడుతోందనీ అంటారు. నాటి నుంచి సామాన్య భక్తులు కూడా అమ్మను సేవించడం మొదలుపెట్టారట. శక్తిస్వరూపిణి అయిన అమ్మ... దుర్గముడనే అసురుడినీ సంహరించడం వల్లే ఆమెకు దుర్గ అనే పేరు వచ్చిందని అంటారు. అదేవిధంగా ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన మాధవవర్మ అనే రాజు నిజాయతీకీ, ధర్మనిరతికీ మెచ్చి అమ్మ కనకవర్షం కురిపించడంతో దేవి కనకదుర్గగా మారిందని పురాణగాథ. నిజానికి అమ్మవారి ఆలయం... ఇంద్రకీలాద్రిపైన కన్నా ముందు.. మొగల్రాజపురంలో ఉన్న ధనంకొండపైన ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడున్న మూడు గుహల్లో ఒకదాంట్లో దుర్గమ్మను ప్రతిష్ఠించి ఆ తరువాత ఆలయాన్ని నిర్మించారని కథ.

అక్కడి పోలీసులకు ఆడపడుచు!

ఊరేగింపు సందర్భంగా ఓసారి అమ్మవారు మనిషి రూపంలో ప్రస్తుతమున్న వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ దగ్గర కూర్చుందనీ అప్పటినుంచి ఆ పోలీస్‌ స్టేషన్‌ అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తోందనీ చెప్తారు. అందుకే... శరన్నవరాత్రులు ఆ పోలీసుల ప్రమేయంతోనే ప్రారంభమై వాళ్లతోనే ముగుస్తాయి. దసరా ఉత్సవాల ప్రారంభానికి ముందు రోజు పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలోని వేప చెట్టు దగ్గరున్న అమ్మవారికి ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. ఆ తరువాత పోలీస్‌ అధికారులు ఊరేగింపుగా వచ్చి తల్లికి పట్టువస్త్రాలను సమర్పించడంతో శరన్నవరాత్రులు మొదలవుతాయి. ఆ మర్నాడు అంటే.. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు దేవికి సుప్రభాత సేవ, అభిషేకాలూ, గణపతి పూజ, కలశస్థాపన వంటివన్నీ నిర్వహించాక... స్వర్ణకవచాలంకృత దుర్గ రూపంలో అలంకరిస్తారు. ఇలా దశమి వరకూ జగన్మాతను రోజుకో రూపంలో అలంకరించడం, భక్తులు చేసే కుంకుమార్చనలు, సాయంత్రాలు నిర్వహించే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, వేదపఠనం... వంటి వాటన్నింటితో శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా సాగి తెప్పోత్సవంతో ముగుస్తాయి. తొమ్మిదిరోజులపాటు వివిధ అలంకారాలతో అలసిన అమ్మవారు సేదతీరేందుకే విజయదశమినాడు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం గంగాసమేత దుర్గామల్లేశ్వర స్వామిని మేళతాళాలతో ఇంద్రకీలాద్రి నుంచి ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకొచ్చి కృష్ణానదిలో ఏర్పాటు చేసిన హంస వాహనంలో ఆశీనుల్ని చేస్తారు. దుర్గాఘాట్‌ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా తెప్పోత్సవాన్ని నిర్వహించి తిరిగి ఘాట్‌కు తీసుకొస్తారు. ఆ సమయంలో బాణసంచా పేలుళ్లు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అనంతరం ఆ ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి మళ్లీ వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగిస్తారు. వన్‌టౌన్‌ పోలీసు అధికారి సతీసమేతంగా శమీపూజను నిర్వహించి విగ్రహాలకు పట్టువస్త్రాలను సమర్పించి ఆ ఉత్సవ మూర్తులను ఇంద్రకీలాద్రిపైకి చేర్చడంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి.

- లక్ష్మణరావు చిరుమామిళ్ళ, ఈనాడు, అమరావతి

- ఫొటోలు: లంకా బాలకృష్ణ, న్యూస్‌టుడే, అమరావతి


రోజుకో అలంకారం

ఈ శరన్నవరాత్రుల్లో రోజుకో రూపంలో దర్శనమిచ్చే ఆదిపరాశక్తిని పూజిస్తే... అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం.

మొదటిరోజు- స్వర్ణ కవచాలంకృత దుర్గ: కోటి సూర్యప్రభలతో, పసిడి వర్ణంతో ప్రకాశించే ఈ దేవి కోరిన కోరికల్ని నెరవేరుస్తుందని అంటారు.

రెండోరోజు- బాలా త్రిపుర సుందరి: త్రిమూర్తుల నుంచి ఉద్భవించిన రూపమే త్రిపుర. శ్రీచక్రంలో ఉండే తొమ్మిది అమ్నయాల్లో మొదటి అమ్నయం త్రిపుర సుందరీ దేవిదే. అక్షమాలను చేతబూని కనిపించే ఈ దేవి నిత్యసంతోషాన్ని ప్రసాదిస్తుంది.

మూడోరోజు- గాయత్రి: సకల మంత్రాలకూ, వేదాలకూ మూలశక్తిగా ప్రసిద్ధిగాంచిన గాయత్రి విజ్ఞానాన్ని అందిస్తుంది.

నాలుగోరోజు- అన్నపూర్ణ: చేతిలో అక్షయపాత్రతో తన బిడ్డల ఆకలిని తీర్చేందుకు అవతరించిన రూపమే అన్నపూర్ణ. ఈ దేవిని ఆరాధిస్తే... వాక్‌శుద్ధి సొంతమవుతుంది.

అయిదోరోజు- లలితా త్రిపుర సుందరి: లక్ష్మీ-సరస్వతులు వింజామరలు వీస్తుండగా.. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలతో దర్శనమిచ్చే లలితాదేవిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది.

ఆరోరోజు - మహాలక్ష్మి: సిరిసంపదలు, సౌభాగ్యం, సంతానం, ధైర్యం, విజయానికి అధిష్ఠాన దేవత మహాలక్ష్మి. ఈ దేవి సకల సంపదలనూ ప్రసాదిస్తుంది.

ఏడోరోజు- సరస్వతి: శ్వేతవస్త్రధారణలో వీణ, అక్షమాల, పుస్తకం చేతబూని... హంసవాహినిగా కనిపిస్తుంది. సరస్వతీ ఉపాసనతో వాక్కు, బుద్ధి, విద్య, విజ్ఞానం కలుగుతాయి.

ఎనిమిదో రోజు- దుర్గ: త్రిశూలాన్ని ధరించి దుర్గతుల నుంచి కాపాడే దేవతగా దుర్గ గుర్తింపుపొందింది.

తొమ్మిదోరోజు- మహిషాసురమర్దిని: దివ్యతేజస్సుతో, అనేక ఆయుధాలను ధరించి సింహవాహినిగా కనిపించే ఈ దేవి అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు.

పదోరోజు- రాజరాజేశ్వరి: చేతిలో చెరుకుగడతో అభయముద్రతో శాంతి స్వరూపిణిగా ఉండే ఈ రూపాన్ని పూజిస్తే అపజయమే ఉండదు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts