సిల్లీపాయింట్‌

దక్షిణాది భాషల్లో వచ్చిన చిట్టచివరి బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా ‘సంధ్యారాగం’. ఈ సినిమా కథ విని ఎవరూ నిర్మించడానికి ముందుకు రాకపోవడంతో... అతితక్కువ బడ్జెట్‌తో ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’లో నిర్మించాడు

Published : 19 Jun 2022 00:14 IST

సిల్లీపాయింట్‌

దక్షిణాది భాషల్లో వచ్చిన చిట్టచివరి బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా ‘సంధ్యారాగం’. ఈ సినిమా కథ విని ఎవరూ నిర్మించడానికి ముందుకు రాకపోవడంతో... అతితక్కువ బడ్జెట్‌తో ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’లో నిర్మించాడు దర్శకుడు బాలుమహేంద్ర. అయితేనేం... ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుందీ సినిమా!

* బాలాజీ అంటే మనందరికీ తిరుమల వెంకటేశ్వరస్వామే. కానీ ఉత్తర భారతదేశంలో హనుమంతుణ్నీ బాలాజీ అనే పిలుస్తారు... కొలుస్తారు!

* గుడ్లగూబకి... కంటిపాప ఉండదు.

* గాంధీజీకి నలభైయేళ్లున్నప్పుడే... దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహమప్పుడు జరిగిన దాడిలో... ముందరి పళ్లు ఊడిపోయాయి. అప్పటినుంచీ బోసినోటితోనే ఉండిపోయారు... తినేటప్పుడు మాత్రమే కట్టుడుపళ్లు వాడుతుండేవారు!

* ప్రపంచంలో బియ్యం ఎక్కువగా పండించడమే కాదు... దాన్ని అత్యధికంగా వాడే దేశం కూడా చైనాయే!

* జనాభా ప్రకారం ప్రపంచంలోనే ఐదో పెద్ద నగరం ఇస్తాంబుల్‌. ఇది రెండు ఖండాలకు వారధి. ఈ నగరంలో కొంత భాగం ఆసియా ఖండంలోకీ మిగిలిన భాగం యూరోప్‌లోకీ వస్తుంది. ఇలా రెండు ఖండాల్లో విస్తరించిన నగరం ప్రపంచంలో ఇదొక్కటే.


చైనా గోడ ఒక చివరి నుంచి మనం నడక మొదలుపెట్టాం అనుకోండి... రెండో చివరికి చేరడానికి తక్కువలో తక్కువ ఏడాదిన్నర పడుతుంది!


* బెలీజ్‌... కరీబియన్‌ దేశాల్లో ఒకటి. ప్రపంచంలో అత్యధిక రంగులున్న జెండా దీనిదే... దాదాపు 12 రంగులు ఉంటాయి ఇందులో.

* తెల్లటి మంచుదుప్పటి కప్పుకుని ఎప్పుడూ చల్లగా ఉంటేనేం... అంటార్కిటికా, ఆర్కిటిక్‌ ధ్రువప్రాంతాలని ఎడారి కిందనే పరిగణిస్తారు శాస్త్రవేత్తలు. అక్కడ వర్షం అన్నది లేదుకాబట్టి అలాగన్నమాట! ప్రపంచంలోని అతిపెద్ద ఎడారుల్లో తొలి రెండుస్థానాల్ని వీటికే ఇస్తారు... సహారాది ఆ తర్వాతి స్థానమేనట.


* బెల్జియం దేశంలోని సైన్యాన్ని ‘ఫ్రెంచ్‌’ అని అంటారు. వాళ్లు తయారుచేయడం వల్లే ‘ఫ్రెంచ్‌ ఫ్రైస్‌’కి ఆ పేరు వచ్చింది. అంతేతప్ప, వాటికీ ఫ్రాన్స్‌ దేశానికీ ఏ సంబంధమూ లేదు!


సినిమాలను శుక్రవారం రిలీజ్‌ చేయడం 1960లో హిందీ చిత్రం ‘మొఘల్‌-ఎ-ఆజమ్‌’తో మొదలైంది. ఆ పద్ధతి హాలీవుడ్‌ నుంచి వచ్చిందే. అక్కడ  కంపెనీలు జీతాలను శుక్రవారం ఇచ్చేవట. జీతం తీసుకుని నేరుగా థియేటర్‌కి వస్తారని ఆరోజే సినిమాలను విడుదల చేసేవారట.


ఫ్యాషన్‌ విషయంలో సెలెబ్రిటీలని అనుసరించడం వందల ఏళ్లకిందటే ఉంది. క్రైస్తవ పెళ్లిళ్లలో వధువుకి వాడే తెల్లటి దుస్తులు అలా ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం సాధించినవే. 1840లో బ్రిటిష్‌ మహారాణి విక్టోరియా తన వివాహ వేడుకలో తెల్లని గౌను వేసుకుందట. దాంతో అప్పటిదాకా వధువులు తమకిష్టమైన రంగుల దుస్తులు వాడుతున్న అలవాటు మారి... తెల్లదుస్తుల పద్ధతి వచ్చేసింది!


* టెన్నిస్‌ అన్న మాటకి అర్థం... (సర్వీస్‌ చేస్తున్నాను) ‘కాచుకో!’ అని.

* అనాస... పువ్వుగా పుట్టి కాయగా మారడానికి రెండేళ్లు పడుతుంది. అది పండటానికి మరో ఆరునెలలు తీసుకుంటుంది!


* రెండో ప్రపంచ యుద్ధం వచ్చే దాకా... దక్షిణాది రాష్ట్రాలవాళ్లకి గోధుమతోచేసే పూరీ చపాతీలతో పరిచయమే లేదు.


గిజా పిరమిడ్‌ నిర్మాణానికి వాడిన ఒక్కో రాయీ 2.5 టన్నుల బరువుంటుందట. అలాంటి రెండొందల కోట్ల రాళ్లతో నిర్మించారట దాన్ని. అది ఎలా... అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీయే!


* యాంగ్జైటీ అన్న పదం వినే ఉంటారు... మరి ‘రింగ్జైటీ’ని విన్నారా? అప్పుడప్పుడూ మొబైల్‌ ఫోన్‌ మోగకున్నా మోగినట్టు... భ్రమ కలుగుతుంటుంది కదా దానికే శాస్త్రవేత్తలు ఈ పేరు పెట్టారు.


చిన్నదో పెద్దదో మనం అడిగిన ఓ సమాచారాన్ని వెంటనే తెచ్చివ్వడానికి... గూగుల్‌లో అప్పటికప్పుడు వెయ్యి కంప్యూటర్‌లు పనిచేస్తాయి. కేవలం 0.02 క్షణాల్లో అవన్నీ సమన్వయమై మనం అడిగినవాటికి సమాధానం ఇస్తాయి!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..