సిల్లీపాయింట్‌

మనదేశంలోని పార్శీల ఇంటి పేరు వాళ్లు చేసే వృత్తి, ఇష్టపడే తిండిని బట్టి మారుతూ ఉంటుంది. సోడాబాటిల్‌ ఓపెనర్‌వాలా, బిస్కెట్‌వాలా, పెప్పర్‌మింట్‌వాలా, కాజువాలా, బాదంవాలా, క్యాంటీన్‌వాలా, హోటల్‌వాలా, మెస్‌ మ్యాన్స్‌... ఇలా ఉంటుంది వాళ్ళ ఇంటి పేర్ల వరస!

Updated : 27 Nov 2022 01:08 IST

సిల్లీపాయింట్‌

మనదేశంలోని పార్శీల ఇంటి పేరు వాళ్లు చేసే వృత్తి, ఇష్టపడే తిండిని బట్టి మారుతూ ఉంటుంది. సోడాబాటిల్‌ ఓపెనర్‌వాలా, బిస్కెట్‌వాలా, పెప్పర్‌మింట్‌వాలా, కాజువాలా, బాదంవాలా, క్యాంటీన్‌వాలా, హోటల్‌వాలా, మెస్‌ మ్యాన్స్‌... ఇలా ఉంటుంది వాళ్ళ ఇంటి పేర్ల వరస!

* కశ్మీర్‌ నుంచి కన్యాకుమారికి ట్రెయిన్‌లో వెళ్లడానికి ఇంచుమించు 40 గంటల సమయం పడుతుంది. దాదాపు రెండురోజులపాటు సాగే ఈ ప్రయాణంలో... వివిధ స్టేషన్‌లలోని వ్యాపారుల దగ్గర 30 రకాల అరటిపళ్లని చూడొచ్చు. మనదేశంలోని మరే పండూ అన్ని వెరైటీల్లో దొరకదు మరి!

* మనం గల్లీక్రికెట్‌లో ఉపయోగిస్తున్న ‘రబ్బర్‌ బాల్‌’ని... భారతదేశంలో తప్ప ఎక్కడా చూడలేం. 1983లో తొలి వరల్డ్‌కప్‌ సాధించాక దేశంలో క్రికెట్‌ క్రేజ్‌ బాగా పెరగడంతో... వీధుల్లో ఆడినా ఎవరికీ గాయాలు కాకుండా, అప్పటికే ఉన్న టెన్నిస్‌బాల్‌ని పెద్దదిగా చేసి వీటిని తెచ్చాయి కంపెనీలు.

* కివి పండు పుట్టింది చైనాలో. దాన్ని న్యూజిలాండ్‌కి దిగుమతి చేసుకున్న కొత్తల్లో ‘చైనీస్‌ గూస్‌బెరీస్‌’ అనే పిలిచారట. దాని రూపం అటూఇటూగా కివి పక్షి రూపంలో ఉండటంతో... ఆ పేరుతోనే పిలవడం మొదలుపెట్టారు.

* సున్నాని కనిపెట్టింది భారతీయులేనని తెలుసు కదా! ప్రపంచంలో ఆవిష్కరించిన చిట్టచివరి అంకె కూడా అదే. నిజానికి, సున్నా వచ్చాక మరే కొత్త అంకెనీ కనిపెట్టాల్సిన అవసరం రాలేదు!


ఎడంచేతి వాటం ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేక పెన్నులే కాదు... వాళ్ళకి అనువైన కీబోర్డులూ మౌస్‌లూ ఉన్నాయిప్పుడు!


* మాంచినీల్‌ అనే చెట్టు అత్యంత విషపూరితమైనది ఈ చెట్టు ఆకుల నుంచి జారిపడిన వాన నీళ్లు పడ్డా చాలు చర్మం మండిపోతుంది.

* డిసెంబర్‌ 4ని... అమెరికాలో ‘బ్రౌన్‌ షూ వియరింగ్‌ డే’గా జరుపుకుంటారు! రొటీన్‌కి భిన్నంగా బ్లాక్‌ షూలకి బదులుగా బ్రౌన్‌వి వాడటమే కాదు... దుస్తులు కూడా ఫార్మల్స్‌కి బదులు క్యాజువల్స్‌ వేసుకుంటారు ఆ రోజు.

* గాంధీజీ స్వీయ క్షురకర్మ సంగతి అందరికీ తెలిసిందే! ఆయనే కాదు, ప్రపంచంలో 30 శాతం మంది మగవాళ్ళు తమ జుట్టుని తామే కత్తిరించుకుంటారని చెబుతోంది ఓ అధ్యయనం!

* మనం ఒక కన్నుమూసుకుని... ఏ వస్తువునీ క్యాచ్‌ పట్టలేం.


కమాండో, టెర్మినేటర్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాల హీరో అర్నాల్డ్‌ స్వార్జునేగర్‌... అమెరికా రాజకీయాల్లోకి వెళ్ళి గవర్నర్‌ పదవిని అందుకున్నవాడు. ఈ మధ్యే బాడీ బిల్డింగ్‌ కోచ్‌ అవతారమెత్తాడు. కాకపోతే, ఒక్కరోజు కోచింగ్‌కి ఆయన తీసుకునే ఫీజు కోటి రూపాయలు!


* పాదరసంలో బంగారం వేస్తే మునుగుతుంది... కానీ, ఇనుము మాత్రం మునగదు.

* థాయిలాండ్‌, శ్రీలంక వంటి కొన్ని దేశాల్లో కొబ్బరికాయలు దింపడానికి కోతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.


అమెరికాలో కనిపించే ‘మౌంటెయిన్‌ బ్లూ బర్డ్‌’ అన్న పిచ్చుకలే... ‘ట్విటర్‌’ లోగోకి స్ఫూర్తి. దానికి ‘ల్యారీ’ అని పేరు కూడా పెట్టారు ట్విటర్‌ వ్యవస్థాపకులు.


మనదేశంలో ఆధునిక కరెన్సీ కాగితాలు ఒకప్పుడు చిన్నపాటి ప్రామిసరీ నోట్లుగానే ఉండేవి. వాటిని కోల్‌కతా, బొంబాయి, చెన్నైలోని బ్యాంకులు మాత్రమే ముద్రించేవి!


* ఏనుగుల కాళ్ళకి గోళ్ళుంటాయి కానీ వేళ్ళుండవు.

* మనిషి ఎంత ప్రయత్నించినా సరే... మోచేతిని నాలుకతో తాకలేడు!


ప్రఖ్యాత కామెడీ పాత్ర ‘మిస్టర్‌ బీన్‌’కి ముందు ‘మిస్టర్‌ కాలిఫ్లవర్‌’ అనే పేరుపెట్టి... చివరి నిమిషంలో మార్చారట! ఇంతకీ ఈ పాత్ర పేరులోని ‘మిస్టర్‌’ అన్న పదం గౌరవ సూచకంగా ఉపయోగించింది కాదు... అతని ఇంటి పేరే అది!


ఆస్ట్రేలియాలోని పెంపుడు కుక్కల్లో 40 శాతంపైగా అధికబరువుతో బాధపడుతున్నాయట! అందుకే, విచక్షణారహితంగా తిండిపెట్టి వాటి ఊబకాయానికి కారణమయ్యే యజమానులకి శిక్షలు విధిస్తున్నారక్కడ!


ప్రపంచంలోనే ట్రాఫిక్‌ ఉల్లంఘనలకి అత్యధిక జరిమానా విధించే దేశం సింగపూర్‌. లైసెన్స్‌లేకుండా బండి నడిపితే 5.17 లక్షల రూపాయలు చెల్లించుకోవాల్సిందే!


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..