సిల్లీ పాయింట్‌

భారత సైన్యం వాహనాలు గస్తీ తిరుగుతున్నప్పుడు హెడ్‌లైట్స్‌ వేయడం తప్పనిసరి... అది పగలైనా సరే!తమ విధులకి ఎవరూ అడ్డురాకూడదనే హెచ్చరికట అది.

Updated : 05 Mar 2023 00:48 IST

సిల్లీ పాయింట్‌

భారత సైన్యం వాహనాలు గస్తీ తిరుగుతున్నప్పుడు హెడ్‌లైట్స్‌ వేయడం తప్పనిసరి... అది పగలైనా సరే!తమ విధులకి ఎవరూ అడ్డురాకూడదనే హెచ్చరికట అది.

* మామూలుగా మనం తల నిలువుగా ఊపితే... అవునన్నట్టు, అడ్డంగా ఊపితే కాదన్నట్టు అర్థంకదా! బల్గేరియా ప్రజలేమో... అవుననడానికి అడ్డంగానూ... కాదనడానికి నిలువుగానూ తలూపుతారు.

* స్నేహితులూ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదలడాన్ని తీవ్ర అవమానంగా భావిస్తారు... మెక్సికోలో! చెప్పులేసుకుని ఇంట్లోకి వెళ్ళడమే అక్కడ గౌరవం!

* అమెరికాలో విడుదలయ్యే ఏ కొత్త సినిమా అయినా సరే... టికెట్టు ధర 25 డాలర్లకి మించదు! కానీ, భారతీయ సినిమాలకి మాత్రం వందడాలర్ల దాకా వసూలు చేస్తారు... అంతపెట్టినా చూస్తారన్న ధీమా వాళ్లది!

* అమెరికన్‌ చట్టప్రకారం మనం పెన్సిల్‌ లేదా క్రేయాన్‌తోనూ దస్తావేజుల్లో సంతకాలు చేయొచ్చు! \

* ఇప్పుడిప్పుడే పాపులర్‌ అవుతున్నా... ఎలక్ట్రిక్‌ కార్లు కొత్తవేమీ కావు. ఇవి 1835లోనే తయారైతే, పెట్రోలు(1885), డీజిలు(1930)వి ఆ తర్వాతే వచ్చాయి!

* మానసిక సమస్యల్లో ‘కోటార్డ్స్‌ సిండ్రోమ్‌’ అని ఉంటుంది. తాను ఎప్పుడో చనిపోయాననీ... ప్రస్తుతం ఆత్మగానే సంచరిస్తున్నాననీ నమ్ముతుంటారు దీని బాధితులు.

* మనం వాడుతున్న ఇయర్‌ఫోన్‌ని ఎదుటివాళ్ళకీ ఇవ్వడం అంటే... మన ప్రేమని పరోక్షంగా వ్యక్తంచేయడంగానే భావిస్తారు పాశ్చాత్యదేశాల్లో! గులాబి, ఉంగరం-లాంటివి ఇవ్వడంలాంటిదట ఇది కూడా!

* రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ మొదట్లో తుపాకుల్ని తయారుచేస్తుండేది. అందువల్లే మోటార్‌ సైకిళ్ల తయారీ రంగంలోకి వచ్చాక 1901లో తమ మొదటి బైకులకి బుల్లెట్‌ అని పేరుపెట్టింది!


మనదేశంలో ఆస్కార్‌ గౌరవ పురస్కారం అందుకున్న ఏకైక వ్యక్తి సత్యజిత్‌ రే! కాకపోతే, ఆయన అనారోగ్యం కారణంగా కోల్‌కతాలో ఆసుపత్రిలో
ఉండగా ఈ అవార్డును స్వీకరించారు.


బీజింగ్‌ నగరంలో ట్రాఫిక్‌ రద్దీలో ఏదైనా కారు చిక్కుకుందనుకోండి... దాని యజమానిని బైకు మీద వాళ్ళ గమ్యానికి చేర్చేవాళ్ళుంటారు. తరువాత కారునీ వాళ్ళే ఇంటికి తీసుకొస్తారు. ఇదో పెద్ద బిజినెస్‌ అక్కడ... గంటకి ఐదువేలు తీసుకుంటారు!


పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్‌ డార్విన్‌కి రక్తాన్ని చూస్తే చచ్చేంత భయమట. ఆ కారణం వల్లే వైద్యుడిగా ప్రాక్టీస్‌వదిలేసి... జీవశాస్త్రవేత్త అయ్యాడు.


డర్టీ, స్ట్రాబెర్రీ, గోల్డెన్‌, ప్లాటినమ్‌, పెరాక్సైడ్‌... ఇవన్నీ రాగిరంగు జుట్టు(బ్లాండ్‌)లోని వివిధ షేడ్‌లకు ఉన్న పేర్లు!


జపాన్‌లో ప్రతి కంపెనీకీ ఓ పాట ఉంటుంది. ఉదయాన ఆఫీసుకి వచ్చినవాళ్ళందరూ ఓ బృందంగా ఆ పాటని పాడాకే... పనుల్లోకి దిగుతారు!


గోథె, హెర్మన్‌ హెస్‌, గుంటర్‌ గ్రాస్‌... ఇలా తమ దేశానికి చెందిన 17 మంది రచయితల గౌరవార్థం పుస్తకాలతో ఓ పెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేసింది జర్మనీ దేశం. రాజధాని బెర్లిన్‌లో 40 అడుగుల పొడవున్న ఈ లోహవిగ్రహంలో ఒక్కో పుస్తక నమూనా సుమారు రెండు టన్నుల బరువుంటుంది!  


ఫ్రాన్స్‌ బడుల్లోని పిల్లలు... ఊదారంగు(పర్పుల్‌) సిరా పెన్నుల్నే వాడతారు. నీలం లేదా నలుపు రంగు ఇంకు వాడకం పెద్దయ్యాకే వాళ్లకి పరిచయం అవుతుంది.


నేనూ రుచి చూద్దామని...

భార్యాభర్తలిద్దరూ రోడ్డు పక్కనున్న పానీపూరీ బండి దగ్గర ఒకే ప్లేటులో తింటున్నారు. తనవంకే తదేకంగా చూస్తున్న భర్తని ‘అలా చూస్తున్నారేంటీ’ అని గోముగా అడిగింది భార్య.

అందుకు భర్త ‘నువ్వు కొంచెం నెమ్మదిగా తింటే నేను కూడా రుచి చూద్దామని. ఇప్పటివరకు ఒక్కటి కూడా తినలేకపోయా’ చెప్పాడు దిగులుగా.


అలాగా!

పరీక్ష అనేది యూజర్‌ నేమ్‌ లాంటిది, అందరికీ చెప్పొచ్చు. కానీ రిజల్ట్‌ పాస్‌వర్డ్‌ లాంటిది ఎవరికీ చెప్పకూడదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..