Published : 21 Jan 2023 23:51 IST

సిల్లీ పాయింట్‌

నందరికీ లీపు సంవత్సరం నాలుగేళ్ళకోసారి వస్తుంది... ఆ ఏడాది ఫిబ్రవరికి ఒకరోజుని కలుపుకుంటాం. అదే చైనా, హిబ్రూ క్యాలండర్‌లలోనైతే ఈ లీపు సంవత్సరం మూడేళ్ళకోసారి వస్తుంది. ఆ ఏడాది వాళ్ళు తమ క్యాలెండర్‌కి అదనంగా ఒక్క రోజుని కాదు... ఏకంగా ఒక నెలని జతచేస్తారు.

* 1950లోనే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఆటగాళ్ళు షూ వాడటం తప్పనిసరి అన్న నిబంధనను తీసుకొచ్చారు. అంతకుముందు వరకూ ఒట్టికాళ్ళతో ఆడినా అనుమతించేవారు. 1948 ఒలింపిక్స్‌లో భారతీయులు
షూ లేకుండానే ఆడారు. 

* అక్బర్‌ పాలన 49 ఏళ్ళపాటు సాగింది. మొఘల్‌ చక్రవర్తుల్లో అత్యధిక కాలం పాలించినవాడిగా అక్బర్‌ నిలిచేవాడే కానీ, ఆయన మనవడు ఔరంగజేబు మరో ఏడాది అదనంగా- అంటే, 50 ఏళ్ళు పాలించి ఆ రికార్డును తాను సొంతం చేసుకున్నాడు.

* తేనెటీగలు మనిషిని కుట్టాక బతకవు. మన శరీరంలో ఏదో విషముండి అలా జరగదు... మనల్ని కుట్టడానికి చర్మంలోకి పంపించిన సూది మొనని మళ్ళీ బయటకు తీయడం దాని తలకి మించిన పని. శక్తికొద్దీ దాన్ని లాగే క్రమంలో పొట్టలోని భాగాలన్నీ బయటకొచ్చి... చచ్చిపోతుంది!

* గొంతు క్యాన్సర్‌ రావడం ఆడవాళ్ళకన్నా మగవాళ్ళలోనే ఎక్కువ. ఒక్క మనుషుల్లోనే కాదు కుక్కలూ పిల్లుల్లోనూ ఇంతేనట!

* లద్దాక్‌కి కొత్తగా వెళ్ళిన వాళ్లెవరైనా సరే... కనీసం ఓ రోజంతా బెడ్డుపైనే ఉండాలన్న నియమం ఉంది. ఆక్సిజన్‌ తక్కువగా ఉన్న ఆ ప్రాంతానికి శరీరం అలవాటు కావాలి కాబట్టి... ఈ విశ్రాంతి తప్పనిసరట!

* 1930ల దాకా పుస్తకాలని అడ్వాన్స్డ్‌ బుకింగ్‌ కిందే కొనేవాళ్ళు. అంటే, పుస్తకానికి సంబంధించి ఒక ప్రతి మాత్రమే ముద్రించి... అది పాఠకులకి చూపించి వాళ్ళచేత ‘మేం దీన్ని కొంటాం’ అని ఒప్పందం చేసుకునేవారు. అలా ఒప్పుకున్నమేరకు మాత్రమే పుస్తకాలని ముద్రించేవాళ్ళు!

* ఒకప్పటి ఐరోపాలో... కలరా, ప్లేగుల్లాంటివి ప్రబలినప్పుడు ప్రజలు దాహమేస్తే నీళ్ళకి బదులు మద్యం తాగేవాళ్ళు. కలుషితమైన నీటికన్నా పులిసిన పళ్ళతో చేసిన మద్యం స్వచ్ఛమైనదని వారి నమ్మకమట!


 టైటానిక్‌ ఓడ మునిగిపోతున్నప్పుడు దానికి ఏడెనిమిది మైళ్ళ దూరంలో ఎస్‌ఎస్‌ క్యాలిఫోర్నియా అన్న ఓడ లంగరేసి ఉంది. మునిగిపోతున్న ఓడ నుంచి ‘ప్రమాదం జరిగింద’ని ఔట్లు, రాకెట్లు పేలుస్తున్నా... ‘ఎస్‌ఎస్‌ క్యాలిఫోర్నియా’ పట్టించుకోలేదట. కారణం... అందులోని కెప్టెన్‌ మంచి నిద్రలో ఉండటం!


మనుషులుసహా పాలిచ్చే జీవులన్నింటికీ పాలపళ్ళు ఊడి గట్టి పళ్ళు రావడం ఒక్కసారే జరుగుతుంది. ఏనుగులూ కంగారూలకూ మాత్రం వాటి జీవితకాలంలో కనీసం ఆరుసార్లయినా... పళ్ళు ఊడి మళ్ళీ వస్తాయట!


 ఐఫోన్‌ ‘సిరి’ వాయిస్‌ అసిస్టెంట్‌ని... 2010లో పరిచయం చేశారు. కానీ దాన్ని రికార్డు చేసింది 2005లో... అంటే ఐఫోన్‌ని సృష్టించడానికన్నా ముందన్నమాట!


 సెక్రటరీ బర్డ్‌... ఆఫ్రికాలోనే అత్యంత అందమైన పక్షి అని పేరు. నాలుగడుగుల ఎత్తున ఉండే ఈ పక్షి... శత్రువులనుకున్నవాళ్ళని కాళ్ళతోనే కొట్టి తరిమేస్తుందట... మనుషుల్నైనా సరే!


శుపక్ష్యాదులకూ, మనుషులకే కాదు... బ్యాక్టీరియా వైరస్‌ల బారి నుంచి కాపాడటానికి వాణిజ్య చేపలకీ టీకాలు వేస్తారు!


పెంగ్విన్‌ పక్షి నేలమీద ఉన్నప్పటికంటే, నీటిలో ఉన్నప్పుడే దాని కంటి చూపు మెరుగ్గా ఉంటుంది.


ప్రపంచంలో అత్యధికంగా సాగుచేసే పళ్ళు... ద్రాక్షలే!


కప్ప వారానికోసారి తన చర్మాన్ని పూర్తిగా తొలగిస్తుంది. దాన్ని అదే తినేస్తుంది కూడా.


ప్రపంచంలో తొలిసారి సినిమా సమీక్షని రాసిన పత్రిక... ‘బయోస్కోప్‌.’ 1908లో ఇంగ్లండు నుంచి వచ్చిన మేగజైన్‌ అది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు