ఆలయాల రథశిల్పి

కల్యాణం తర్వాత దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను రథంపైన ఊరేగించడం ఆనవాయితీ. అందుకే ఆలయ ఉత్సవాల్లో రథ యాత్ర ఓ కీలక ఘట్టం.

Updated : 05 Mar 2023 04:43 IST

ఆలయాల రథశిల్పి

కల్యాణం తర్వాత దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను రథంపైన ఊరేగించడం ఆనవాయితీ. అందుకే ఆలయ ఉత్సవాల్లో రథ యాత్ర ఓ కీలక ఘట్టం. ఈ రథ నిర్మాణ కళలో తన విశిష్టతను చాటుతున్నారు శిల్పి సింహాద్రి గణపతి ఆచారి. యాదాద్రి, అంతర్వేది, రామతీర్థం, అన్నవరం... లాంటి ఆలయాల్లోని రథాలు ఆయన చేతులమీదుగా రూపుదిద్దుకున్నాయి. తాజాగా ద్రాక్షారామ భీమేశ్వరునికి ఆకర్షణీయమైన రథాన్ని రూపొందించారాయన.

రథ యాత్ర అనగానే ముందుగా గుర్తొచ్చేది పూరీ జగన్నాథుడే. సింహాద్రి ఆచారి తండ్రి వీరాచారి ఏటా ఆ రథ నిర్మాణ పనులకు వెళ్తూ రథాల తయారీలో పట్టు సాధించారు. వీరిది శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం నౌపాడ. చిన్నప్పట్నుంచీ తండ్రితోపాటు వెళ్తూ ఈ కళలో నైపుణ్యం సాధించారు సింహాద్రి. 1980ల్లో హైదరాబాద్‌ చుట్టుపక్కల ఎక్కువగా పనులు ఉండటంతో అక్కడకు వెళ్లి స్థిరపడింది వీరి కుటుంబం. 15వ ఏటే తండ్రిని కోల్పోయినా.. ఆయన వద్ద నేర్చుకున్న విద్యతో రథాల నిర్మాణంలో నిష్ణాతుడిగా ఎదిగారు సింహాద్రి.   సికింద్రాబాద్‌లో వర్క్‌షాప్‌ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కణ్నుంచి కొన్ని పనులు చేస్తూనే ఏ ఊళ్లో రథం తయారుచేయాలంటే అక్కడికి 2-3 నెలలపాటు కుటుంబ సమేతంగా వెళ్లి నిర్మాణం పూర్తయ్యేంతవరకూ ఉంటారు.

అమెరికాలోనూ రథ నిర్మాణం...

ముప్పై ఏళ్ల కిందట మొదట భిలాయిలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి రథాన్ని నిర్మించారు సింహాద్రి. బ్రహ్మంగారి మఠంలో పాతికేళ్ల కిందట 35 అడుగుల రథాన్ని రూపొందించారు. యాదాద్రి ఆలయ రథాన్ని ఇరవై ఏళ్ల కిందట తీర్చిదిద్దిన సింహాద్రి... ఇటీవల దాని స్థానంలో కొత్తదాన్ని మళ్లీ అదే రూపు రేఖలతో నిర్మించారు. ఇప్పటివరకూ సింహాద్రి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న రథాల్లో అత్యంత ఎత్తయినది అంతర్వేది రథం. 45 అడుగుల ఎత్తుండే ఈ రథాన్ని రెండేళ్ల కిందట రూ.1.5కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇటీవలే ద్రాక్షారామలోని భీమేశ్వరునికి రథం తయారుచేశారు సింహాద్రి. అన్నవరం, రామతీర్థం, శృంగేరి శారదా పీఠం, ద్వారకా తిరుమల... పుణ్యక్షేత్రాలతోపాటు హైదరాబాద్‌లోని తితిదే ఆలయం, అష్టలక్ష్మీ ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం... ఇలా అనేకచోట్ల రథాలు నిర్మించారు. అమెరికాలో ఓ ఆలయానికి 21 అడుగుల ఎత్తున్న రథాన్ని నిర్మించారు. విడిభాగాల్ని ఓడలో తరలించి ఆ తరవాత అక్కడికి వెళ్లి రథ నిర్మాణం పూర్తిచేశారు సింహాద్రి.

ఆలయాన్ని అనుసరించే...

రథ నిర్మాణానికి నాణ్యమైన టేకుని వినియోగిస్తారు.  ఆలయ గర్భగుడిని అనుసరించి చతుర్భుజి, అష్టభుజి, దీర్ఘచతురస్రాకారాల్లో రథ మండపాన్ని తీసుకుంటారు. ఆలయ విశిష్టతలు రథంపైన ప్రతిబింబించేలా దశావతారాల బొమ్మలూ, అష్టలక్ష్ములు, శివ లింగాలు, వినాయకుడు, ఏనుగులు... మొదలైనవి చెక్కుతారు. ఈ పనుల్ని సింహాద్రితోపాటు ఆయన భార్య రేఖ కూడా పర్యవేక్షిస్తారు. రథాన్ని నియంత్రించడానికి లారీలకు ఉపయోగించే స్టీరింగ్‌, పంపు బ్రేకులను అమర్చుతారు. ఇటీవల హైడ్రాలిక్‌ జాకీల్ని ఉపయోగించి రథాల్ని అడుగు పైకి ఎత్తేలా చేస్తున్నారు. రథాలతోపాటే తెప్పలూ, వాహనాలూ, పల్లకీలూ, ఆలయ ద్వారాలూ తయారు చేస్తారు సింహాద్రి. ప్రస్తుతం బిట్రగుంట, పెన్న అహోబిలం ఆలయాలకి రథాల్ని రూపొందిస్తున్నారు.

 

నరాల త్రిమూర్తులు
న్యూస్‌టుడే, ద్రాక్షారామ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..