సిసింద్రీ

  అక్బర్‌కు బీర్బల్‌ అంటే ఎంతో ఇష్టం. అయినా అప్పుడప్పుడూ సరదాగా ఆట పట్టిస్తుండేవాడు. కానీ బీర్బల్‌ తెలివిగా తప్పించుకునేవాడు. అక్బర్‌ చాలాసార్లు బీర్బల్‌ను ఓడించాలని చూసినా.. అది సాధ్యం కాలేదు. ఈసారి ఎలా అయినా బీర్బల్‌పై పైచేయి సాధించాలని అక్బర్‌ అనుకున్నాడు.

Published : 08 Jan 2022 23:31 IST

సిసింద్రీ


బీర్బలా మజాకా!

అక్బర్‌కు బీర్బల్‌ అంటే ఎంతో ఇష్టం. అయినా అప్పుడప్పుడూ సరదాగా ఆట పట్టిస్తుండేవాడు. కానీ బీర్బల్‌ తెలివిగా తప్పించుకునేవాడు. అక్బర్‌ చాలాసార్లు బీర్బల్‌ను ఓడించాలని చూసినా.. అది సాధ్యం కాలేదు. ఈసారి ఎలా అయినా బీర్బల్‌పై పైచేయి సాధించాలని అక్బర్‌ అనుకున్నాడు. ఓ రోజు సభ ప్రారంభం కాగానే... అక్బర్‌, బీర్బల్‌ను పిలిచాడు. ‘బీర్బల్‌.. నువ్వు రాజుకు విధేయుడివా? కాదా?’ అని అడిగాడు. ‘జహాపనా..! మీకెందుకొచ్చింది ఆ అనుమానం. ఎళ్లవేళలా నేను మీ విధేయుణ్నే’ అని బదులిచ్చాడు బీర్బల్‌. ‘అయితే... నేను ఏం చెప్పినా చేస్తావా?’ అని ప్రశ్నించాడు అక్బర్‌. ‘నా మేలు కోరే మీరు.. ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాను’ అన్నాడు బీర్బల్‌. ‘శెభాష్‌.. బీర్బల్‌.. నేను నీకు ఇప్పుడు కొన్ని ఇస్తాను. నువ్వు వాటిని తినాల్సి ఉంటుంది’ అన్నాడు అక్బర్‌. ‘ఓ.. తప్పకుండా’ అని వినయంగా బదులిచ్చాడు బీర్బల్‌. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి.. నీకు మరో అవకాశం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో.. చేస్తాను అని చెప్పి.. చేయకపోతే నాకు ఇష్టం ఉండదు. చాలా కోపం వస్తుంది. అలా చేస్తే శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా! ఇప్పటికైనా నువ్వు నీ మాట వెనక్కు తీసుకోవచ్చు. ఏ శిక్షా ఉండదు. అలా కాదని.. నేను ఇచ్చిన వాటిని తినలేకపోతే మాత్రం దండన తప్పదు’ అన్నాడు దర్పంగా అక్బర్‌. ‘కచ్చితంగా తింటాను ప్రభూ...!’ అన్నాడు ధైర్యంగా బీర్బల్‌. ‘ఎవరక్కడ?’ అని అక్బర్‌ చప్పట్లు చరిచాడు. భటుడు చేతిలో పళ్లెంతో వచ్చాడు. దాని మీద ఉన్న వస్త్రాన్ని తొలగిస్తే... ధగధగలాడుతూ వజ్రాలూ మిలమిలమెరిసే ముత్యాలూ ఉన్నాయి. అక్కడున్న వాళ్లు అంతటితో బీర్బల్‌ ఆట కట్టిందని ఆనందపడ్డారు. బీర్బల్‌ వెంటనే వాటిని తీసుకుని తన దగ్గర ఉన్న సంచీలో వేసుకుని.. అక్కడి నుంచి బయటకు వెళ్లబోయాడు. ‘బీర్బల్‌.. ఏం చేస్తున్నావ్‌? నేను వాటిని తినమన్నాను కదా?’ అన్నాడు అక్బర్‌. ‘నేనూ.. మీ ఆజ్ఞనే పాటిస్తున్నాను జహాపనా! మీరు తినమన్నారు కానీ.. ఎలా తినాలో.. ఎలా తినకూడదో చెప్పలేదు కదా! అందుకే వీటిని అమ్మేసి వచ్చిన డబ్బులతో హాయిగా జీవితాంతం తింటా’ అన్నాడు. వెంటనే అక్బర్‌ ‘శెభాష్‌!’ అంటూ చప్పట్లు చరిచాడు. ఆ వజ్రాలూ ముత్యాలన్నింటినీ బీర్బల్‌నే కానుకగా తీసుకోమన్నాడు. సభలో ఉన్నవాళ్లంతా కరతాళ ధ్వనులతో బీర్బల్‌ను అభినందించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..