సిసింద్రీ

సిసింద్రీ

Updated : 30 Jan 2022 01:18 IST

సిసింద్రీ



వృత్తి ధర్మం!

పూర్వం విజయపురం అనే ఊరిలో రత్నసేనుడు అనే వైద్యుడు ఉండేవాడు. ఆయనకు పేదల వైద్యుడిగా పేరు. ఒక రోజు ఒక బందిపోటు దొంగను తరుముతూ రాజభటులు వెంబడించారు. అప్పుడు అతడు ఈ వైద్యుడి ఇంట్లోకి దూరి తలుపేసుకున్నాడు. ‘నన్ను సైనికులు తరుముతున్నారు. నువ్వు అరిచావో నిన్ను చంపేస్తాను’ అన్నాడు. ముందు వైద్యుడు భయపడ్డాడు. తర్వాత బందిపోటు వీపు నుంచి ధారగా రక్తం కారుతుండడాన్ని గమనించి అతడికి నచ్చచెప్పి వైద్యం చేశాడు రత్నసేనుడు. కాసేపటి తర్వాత తలుపు తట్టిన చప్పుడైంది. తెరవడానికి వైద్యుడు లేచాడు. వెంటనే బందిపోటు కత్తితో వైద్యుణ్ని బెదిరించాడు. ‘వచ్చినవాళ్లు భటులై ఉంటారు. ఇప్పుడు నేను తలుపు తెరవకుంటే... వాళ్లు సందేహించి, తలుపులు బద్దలు కొడతారు. నువ్వు దొరికిపోతావ్‌. నీకు మత్తు కూడా ఇచ్చాను. నువ్వు ఈ స్థితిలో ఎక్కువదూరం పరిగెత్తలేవు. భయపడకు, నీ గురించి చెప్పనులే’ అని వైద్యుడు అభయం ఇచ్చాడు. బందిపోటు ఒప్పుకోవడంతో వైద్యుడు వెళ్లి తలుపు తెరిచాడు. వైద్యుణ్ని గుర్తుపట్టిన భటులు ‘సామీ... ఓ బందిపోటు పారిపోయి ఇటు వచ్చాడు. జాగ్రత్తగా ఉండండి. మీకేమన్నా సమాచారం తెలిస్తే మాకు చెప్పండి’ అని చెప్పి వెళ్లిపోయారు. బందిపోటు వైద్యుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తానిక బయలుదేరతా అన్నాడు. దానికి వైద్యుడు ‘నీకైన గాయం మామూలుదికాదు. నువ్వు తప్పక విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే అది మానడం అసాధ్యం’ అని చెప్పాడు. వైద్యుడి మాటలు నిజమే అనిపించాయి. పైగా తనకు రత్నసేనుడి మీద నమ్మకం కుదరడంతో ఒప్పుకున్నాడు. ఇక మూడో రోజుకు బందిపోటు కోలుకున్నాడు. ఇదే విషయం వైద్యుడితో చెప్పి తానిక వెళ్లివస్తాను అని బయలుదేరబోయాడు. ఇంతలోనే రాజభటులు వచ్చి బందిపోటును బంధించారు. తమకు సమాచారం ఇచ్చినందుకు వైద్యుడిని అభినందించారు. ‘ద్రోహీ... ముందు నాకు సాయం చేసి... తర్వాత నన్ను భటులకు అప్పగిస్తావా. నిన్ను చంపేస్తాను’ అని బందిపోటు బెదిరించాడు. ‘చూడు మిత్రమా! ముందు వైద్యుడిగా నా వృత్తి ధర్మం నిర్వర్తించి నీ ప్రాణాలు కాపాడాను. నువ్వు కోలుకున్నాక రాజుగారికి సమాచారం అందించి నా దేశభక్తిని చాటుకున్నాను. ఇందులో నేను చేసిన ద్రోహం ఏమీ లేదు. పైగా నేను నీ ప్రాణాలు కాపాడాను. నువ్వు చంపాలనుకుంటే ఇప్పుడే చంపేయొచ్చు. ఈ భటులెవ్వరూ అడ్డురారు’ అని చెప్పాడు వైద్యుడు. రత్నసేనుడి మాటలకు బందిపోటు ఆలోచనలో పడ్డాడు. తన ప్రాణాలు కాపాడిన వైద్యుడు ఆ సమయంలో దేవుడిలా కనిపించాడు. రత్నసేనుడికి చేతులు జోడించి అక్కడి నుంచి సైనికులతో పాటు వెళ్లిపోయాడు. చెరసాల నుంచి విడుదల అయిన తర్వాత బందిపోటు ఇంకెప్పుడూ దొంగతనాలూ, దోపిడీలూ చేయలేదు. కష్టపడి పనిచేసి పొట్టపోసుకున్నాడు.




లెక్కల చిక్కులు విప్పేద్దామా!

నేస్తాలూ! ఇది చూశారా! చూడ్డానికి ల్యాప్‌టాప్‌లా ఉంది కదూ! కానీ ఇదొక ఫోల్డబుల్‌ గేమ్‌ ప్యాడ్‌. ఇందులో లెక్కలకు సంబంధించిన ఆటలుంటాయి. అంటే ఆడుతూనే లెక్కలు నేర్చేసుకోవచ్చన్నమాట. గణితం అంటే భయం ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సరదాగా ఆడుకుంటూ లెక్కలెలా చేయాలో తెలుసుకోవచ్చు. అలాగే మన మెదడుకు పదునుపెట్టే ప్రశ్నలూ, బోలెడు పజిళ్లూ ఉంటాయి. అంతేనా కథలు కూడా ఇందులోనే వినొచ్చు, చూడొచ్చు. అందులో కథల చివర ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు కూడా కథల్లోనే ఉంటాయి. ఆ ప్రశ్నలూ భలే తమాషాగా అనిపిస్తాయి. ఈ కిట్‌ ద్వారా మానసిక వికాసాన్నీ పొందవచ్చు. ఈ ప్యాడ్‌తో పాటు పజిళ్ల కిట్‌ కూడా అందులోనే ఉంటుంది. అన్నట్టు గేమ్‌ ప్యాడ్‌లో అవన్నీ ఎలా
వస్తాయని సందేహం వచ్చే ఉంటుంది కదా! ఆ ప్యాడ్‌ను తెరిచి శిలిగీబివీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలి. అప్పుడే ఆపరేట్‌ అవుతుంది. ఇదెలా ఆడాలో కూడా ఆ కిట్‌లోనే ఉంటుంది. అదన్నమాట సంగతి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..