సిసింద్రీ

సిసింద్రీ

Updated : 13 Feb 2022 06:04 IST

సిసింద్రీ


ఉత్తమ శిష్యుడు!

కప్పుడు కపిలాపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరు చివర ఓ గురువుగారి కుటీరం ఉండేది. ఆయనకు సకల విద్యల్లో ప్రావీణ్యం ఉంది. ఆయన దగ్గర చాలా మంది శిష్యులు విద్య నేర్చుకుంటుండేవారు. గురువుగారు అప్పుడప్పుడు తన శిష్యులను చిక్కు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసేవాడు. చాలామంది జవాబు చెప్పలేకపోయేవారు. ఒకనాడు గురువు గారు దేవదత్తుడు అనే శిష్యుణ్ని పిలిచి, ‘దేవదత్తా... నువ్వు పురాణాలూ, ఇతిహాసాల మీద మంచి పట్టు సాధించావు కదా! నిన్ను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. సమాధానం చెబుతావా?’ అని అడిగాడు. దానికి దేవదత్తుడు ‘తప్పకుండా.. గురుదేవా!’ అని చెప్పి ఆయనకు నమస్కరించాడు. ‘ఒకప్పుడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెత్తుకొచ్చాడని వేదపురాణాల్లో ఉంది. ఎందుకలా..? ఆయన సేవకులను ఎవరినైనా పంపొచ్చు కదా.. ఆయనే స్వయంగా పరిగెత్తుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది?’ అని దేవదత్తుణ్ని అడిగాడు. ‘గురువర్యా! మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నాకు సమయం కావాలి’ అని అడిగాడు. గురువు దానికి ఒప్పుకొన్నాడు. కొన్నిరోజులు గడిచాయి. దేవదత్తుడు కపిలాపురానికి చెందిన ఓ మహిళను పిలిచి, ఆమె చేతికొక మైనపు బొమ్మను ఇచ్చాడు. అది అచ్చం పసికందులా ఉంది. ‘ఈ రోజు సాయంత్రం నేను గురువుగారితో కలిసి చెరువుగట్టుకు వస్తాను. అప్పుడు ఈ బొమ్మను తీసుకుని నీట్లో పడిపోయినట్లు నటించు. నీకు మంచి బహుమానం ఇస్తాను’ అని ఆ మహిళకు చెప్పాడు. ఆమె దానికి ఒప్పుకుంది. దేవదత్తుడూ, గురువుగారూ చెరువుగట్టు మీద నడుస్తున్నప్పుడు వాళ్లు చూస్తుండగా ఆ మహిళ జారి పడిపోయినట్లు నటించింది. తన చేతిలో ఉన్న శిశువు బొమ్మను నీళ్లలో పడేసింది. గురువుగారు ఈ దృశ్యం చూసిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నీళ్లలోకి దూకి కాపాడే ప్రయత్నం చేశాడు. తీరా చూస్తే అది శిశువు బొమ్మ. ఆ మహిళ మీద గురువుకు పట్టరాని కోపం వచ్చింది. కానీ ఆమెను ఏమీ అనకుండా గట్టు మీదకు చేరుకున్నాడు. ‘గురువర్యా! నాకూ ఈత వచ్చన్న విషయం మీకు తెలుసు. అయినా మీ శిష్యుడినైన నన్ను పక్కన పెట్టుకుని కూడా మీరే స్వయంగా నీళ్లలో ఎందుకు దూకారు. నన్ను పురమాయించొచ్చు కదా! ఒక శిశువు ప్రాణాపాయ స్థితిలో ఉందని మీరు ఎలా అయితే వెనకా ముందూ చూడకుండా ఆదుకోవాలనుకున్నారో.. అలాగే ఆ విష్ణుమూర్తి కూడా ఆ ఏనుగును కాపాడాలనుకున్నారు. ఇది చెప్పడానికే ఆ మహిళ సాయంతో ఈ నాటకం ఆడాను. నన్ను మన్నించండి’ అన్నాడు దేవదత్తుడు. తన శిష్యుడి తెలివితేటలకు గురువు సంతోషించి తన శిష్యగణంలోకెల్లా ఉత్తమ శిష్యుడిగా ప్రకటించాడు.



చేద్దామా ఫన్‌గామా!

దువులు, పుస్తకాలు, హోంవర్క్‌లు, ఆన్‌లైన్‌క్లాసులంటూ ఎప్పుడూ గజిబిజిగా బిజీబిజీగా ఉండిపోతున్నాం కదూ! మనలాంటి పిల్లలు కాసేపు సేదతీరడానికి, అదే సమయంలో విజ్ఞానం పెంపొందించుకునేందుకూ https://www.funology.com/ అనే వెబ్‌సైట్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో బొమ్మలు గీయడం, బొమ్మలు చేయడం, సైన్స్‌ ప్రయోగాలు, మంచి మంచి మ్యాజిక్కులు, ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌, మనకు నచ్చే స్నాక్స్‌ తయారీ... తదితర అంశాలు ఉంటాయి. ఇంకా ఈ సైట్లో కొత్త కొత్త ఇండోర్‌, అవుట్‌డోర్‌ గేమ్‌లు, అవి ఎలా ఆడుకోవాలో ఉంది. హాయిగా మనం నేర్చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఆట స్నేహితులతో ఆడుకోవచ్చు. అప్పటికీ బోర్‌ కొట్టిందనుకోండి... కాసేపు నవ్వుకోవడానికి జోక్స్‌ కూడా ఉన్నాయి ఈ సైట్‌లో. ఇంకేం నేస్తాలూ..! ఓ సారి అలా ‘ఫనాలజీ’ సైట్‌ను సందర్శించి... అలా అలా విహరించండి సరేనా.



జీవిత చరిత్ర అంటే ఇదా!

పింకి: చింటూ, ఏదో రాస్తున్నావు?
చింటు: నా జీవిత చరిత్ర రాస్తున్నా.
పింకి: అవునా.. మరేంటి.. అన్ని పేజీల్లోనూ. ‘బడి నుంచి ఇంటికి వచ్చాను. ఇంటి నుంచి బడికి వెళ్లాను. మధ్యలో ఆడుకున్నాను’ అని రాస్తున్నావు?
చింటు: మరి ఇప్పటి వరకూ నా జీవితం మొత్తం దాంతోనే నిండిపోయింది కదా!
పింకి: ఆఁ!!




దొంగ ఎవరు?

చింటూ వాళ్ల పక్కింట్లో మధ్యాహ్నం ల్యాప్‌టాప్‌ పోయింది. రాము, సోము, దాము మీద వాళ్లకు అనుమానం. పోలీసులొచ్చి ముగ్గురినీ విచారించారు. ‘నిన్న నువ్వు ఏం చేశావ్‌’ అని ఆ ముగ్గురినీ ప్రశ్నించారు. ‘నేను మధ్యాహ్నం పుస్తకం చదువుతున్నా’ అని రాము, ‘నేను అసలు ఇంట్లోనే లేను. క్రికెట్‌ ఆడుకోవడానికి వెళ్లాను’ అని సోము, ‘నేను టీవీలో ఒలింపిక్స్‌ చెస్‌పోటీలు చూశా’ అని దాము చెప్పారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా దొంగను పట్టుకోలేకపోయారు. చింటూ మాత్రం చిటికెలో దొంగెవరో కనిపెట్టి పోలీసులకు చెప్పాడు. మరి మీకు తెలుసా... దొంగెవరో?



జవాబులు

పోలికలేంటి:
అడ్డం: రైటింగ్‌ ప్యాడ్‌, చెట్టు, బంతి
నిలువు: పువ్వులు, గాలిపటం, సీతాకోకచిలుక
ఐమూలగా: కళ్లద్దాలు, టీషర్టు రంగు

దాగుడు మూతలు:
1.పడవ స్టీరింగ్‌ వీల్‌ దగ్గర స్టెతస్కోప్‌

2.నిచ్చెన దగ్గర సెలైన్‌ బాటిల్‌

3.చెట్టు మీద వంకాయ

4.ఆకుల్లో కొబ్బరిబోండాం

5.పొదలో ఉడుత

6.తెరచాప దగ్గర క్యాండిల్‌

7.జెండా స్తంభానికి ఫోర్క్‌

8.యాంకర్‌కు బల్బు  

ఆ రెండు.. ఏ రెండు...!: 1.A- 4 2.B- 5

దొంగ ఎవరు: దామునే దొంగ. ఎందుకంటే ఒలింపిక్స్‌లో అసలు చెస్‌ పోటీలుండవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..