సిసింద్రీ

 సిసింద్రీ

Published : 20 Feb 2022 02:33 IST

సిసింద్రీ


మూడు బొమ్మలు!

మొగల్‌ సామ్రాజ్యాన్ని అక్బర్‌ పాలించేవాడు. తన రాజ్యంలోని ప్రజలతో చాలా ప్రేమ, ఆప్యాయతలతో మెలిగేవాడు. శత్రురాజ్యాల రాజులు కూడా అక్బర్‌ మంచితనానికి ముగ్ధులయ్యేవారు. వాళ్లు అక్బర్‌ను చాలా గౌరవించేవారు. అక్బర్‌ ఆస్థానంలో ప్రపంచంలోకెల్లా అత్యంత తెలివైన తొమ్మిది మంది వ్యక్తులతో న్యాయస్థానం ఉండేది. వాళ్లలో బీర్బల్‌ ఒకరు. బీర్బల్‌ తన తెలివితేటలతో అక్బర్‌ చక్రవర్తిని ఎంతో మెప్పించేవాడు. ఏ సమస్యనైనా చిటికెలో పరిష్కరించేవాడు. అందువల్ల న్యాయస్థానంలో ఉన్న మిగతా ఎనిమిదిమంది బీర్బల్‌ను చూసి అసూయపడుతుండేవారు. ఒకరోజు అక్బర్‌ కొలువుకు ఒక శిల్పి మూడు బొమ్మలతో వచ్చాడు. అతడు ఆ మూడింటినీ అక్బర్‌ ముందు పెట్టి.. ‘జహాపనా... ఈ మూడు బొమ్మలు మనుషుల మనస్తత్వాలకు ప్రతీకలు. ఇవి చూడడానికి ఒకేలా కనిపిస్తున్నాయి కదూ! కానీ ఇందులో ఒకటి మాత్రమే ఉత్తమమైనది. మీరు మీ దగ్గర ఉన్న తొమ్మిది మంది తెలివైన వ్యక్తులతో ఈ మూడింట్లో ఏది ఉత్తమమైనదో చెప్పించగలరా?’ అన్నాడు. ఎనిమిది మందీ ప్రయత్నించి ఓడిపోయారు. ఇక ఆఖర్లో అక్బర్‌, బీర్బల్‌కు అవకాశం ఇచ్చాడు. బీర్బల్‌ ఆ మూడు బొమ్మలనూ తన చేతిలోకి తీసుకుని చాలా జాగ్రత్తగా గమనించాడు. బొమ్మల చెవులు, నోట్లో చిన్న చిన్న రంధ్రాలున్న విషయాన్ని పసిగట్టాడు. పొడుగ్గా సన్నగా ఉండే ఒక తీగను తెప్పించుకున్నాడు. దాన్ని మొట్టమొదటి బొమ్మ చెవిలోకి చేర్చాడు. ఆ తీగ బొమ్మ నోట్లోంచి బయటకు వచ్చింది. తర్వాత రెండో బొమ్మను తీసుకుని ఆ తీగను చెవిలోకి పెట్టగా.. ఈ సారి అది మరో చెవి నుంచి బయటకు వచ్చింది. చివరికి మూడో బొమ్మను చేతిలోకి తీసుకుని తీగను దాని చెవిలో పెట్టాడు. ఆ తీగ విగ్రహం కడుపులోకి వెళ్లింది. బీర్బల్‌ ఆ మూడో విగ్రహాన్ని ఉత్తమమైనదిగా తేల్చి చెప్పాడు. బీర్బల్‌ మాటలు విన్న శిల్పి.. కారణమేంటో చెప్పమన్నాడు. అప్పుడు బీర్బల్‌... ‘ప్రతి బొమ్మను ఓ మనిషి, తీగను రహస్యంగా అనుకుంటే... మొదటి బొమ్మ చెవి నుంచి తీగను లోపలికి పంపిస్తే అది నోటి నుంచి బయటకు వచ్చింది. అలాంటి వ్యక్తులు రహస్యాలు దాచలేరు. రెండో బొమ్మ చెవిలో తీగను పెడితే.. అది మరో చెవి నుంచి బయటకు వచ్చింది. అంటే ఆ మనిషి ఒక చెవితో విని, మరో చెవితో దాన్ని వదిలేస్తాడని అర్థం. అంటే రహస్యానికి అంత విలువ కూడా ఇవ్వలేదు. అదే మూడో బొమ్మ చెవిలో తీగను పెడితే అది బొమ్మ కడుపులోకి వెళ్లిపోయింది. అంటే.. అతను రహస్యాలను చక్కగా దాస్తాడన్నమాట. అందుకే ఈ మూడో బొమ్మే అతి ఉత్తమమైన బొమ్మ’ అని వివరంగా చెప్పాడు బీర్బల్‌. అక్బర్‌ ఎంతో సంతోషించి బీర్బల్‌ తెలివితేటలను మెచ్చుకున్నాడు. తగిన బహుమతులిచ్చి పంపాడు. తన ఆస్థానంలో ఉన్న తొమ్మిది మంది తెలివైన వాళ్లలో ఎవరు అత్యంత తెలివైన వ్యక్తో తెలుసుకునేందుకే అక్బర్‌ ఆ శిల్పిని పురమాయించాడన్న సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియదు.. అక్బర్‌కూ శిల్పికీ తప్ప!


చెప్పుకోండి చూద్దాం!

1. అది మనకు మాత్రమే సొంతం. కానీ, ఇతరులే ఎక్కువగా వాడతారు. అదేంటో చెప్పుకోండి చూద్దాం?
2. నీటిలో ఎగిరెగిరి పడుతుంది. నేలపైన కూలబడుతుంది. ఏంటో తెలుసా?


ఎడారి మొక్క... బొమ్మయింది ఎంచక్కా!

డారుల గురించీ అక్కడ పెరిగే మొక్కల గురించీ పాఠాల్లో విని ఉంటాం. టీవీల్లో చూసి ఉంటాం. కొమ్మలు ఆకులు లేకుండా కేవలం కాండంతోనే పెరిగే ఆ మొక్కలు భలే ఉంటాయి కదూ!  అందుకే, మనలాంటి పిల్లలను ఆకట్టుకునేలా అచ్చం ఎడారి మొక్కల మాదిరి ఉండే బొమ్మలూ మార్కెట్లోకి వచ్చేశాయి. ఓస్‌..  ఇంతేనా అని తేలిగ్గా తీసేయకండి ఫ్రెండ్స్‌! ఈ బొమ్మ మొక్క దగ్గరకు వెళ్లి ‘నీ పేరేంటీ’ అని అడిగారనుకోండీ... ఆ మొక్క కూడా మిమ్మల్ని ‘నీ పేరేంటీ’ అని అడుగుతుంది. అంటే - మీరేం మాట్లాడినా ఆ మాటలను రిపీట్‌ చేస్తుందన్నమాట. అంతేకాదు, ఈ మొక్కలు పాడతాయీ, అందుకు తగినట్లు లైటింగ్‌తోపాటు డ్యాన్సూ చేస్తాయి. ఇంట్లో అలంకరణ వస్తువుగా ఉంచుకోవచ్చు లేదా మన స్నేహితుల పుట్టినరోజుకు బహుమతిగానూ ఇవ్వొచ్చు. మనకు హాని కలిగించని ఫ్యాబ్రిక్‌తో తయారైన ఈ బొమ్మలు బ్యాటరీ సహాయంతో పనిచేస్తాయి. మొత్తానికి ‘డ్యాన్సింగ్‌ కాక్టస్‌ టాయ్‌’ సూపర్‌ కదూ!



జవాబులు

పోలికలేంటి:  అడ్డం: టేబుల్‌ ఫ్యాన్‌, శానిటైజర్‌ సీసా, గొడుగు;  నిలువు: టేబుల్‌ ల్యాంప్‌, వాక్యూమ్‌ క్లీనర్‌, పెంపుడు జంతువు;  ఐమూలగా: మెట్లు, గోడరంగు.

తప్పులే తప్పులు: 1. సైకిల్‌ చక్రం త్రిభుజాకారం  2. చెట్టుపైన ఆక్టోపస్‌  3. ఉడుతకు ఎలుక తోక  4. ఇంద్రధనుస్సులో ఎనిమిది రంగులు  5. పార్కింగ్‌ బోర్డులో స్పెల్లింగ్‌ తప్పు.

తెలుసా.. తెలుసా..!: apple (astronaut, pigeon, piano, lion, elephant).

చెప్పుకోండి చూద్దాం!: 1. పేరు 2. కెరటం.

ఏ ఒక్కటి?: పుస్తకం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..