సిసింద్రీ

అక్బర్‌ ఆస్థానంలో బీర్బల్‌ కొత్తగా చేరిన రోజులవి. అక్బర్‌ను పొగడ్తలతో ప్రసన్నం చేసుకోవాలని బీర్బల్‌కు ఉండేది. అలాగే బీర్బల్‌కు ఏపాటి తెలివితేటలూ, సమయస్పూర్తీ ఉన్నాయో తెలుసుకోవాలని అక్బర్‌కూ ఆసక్తిగా ఉండేది.

Published : 06 Mar 2022 00:11 IST

సిసింద్రీ

అక్బర్‌ సందేహం!

అక్బర్‌ ఆస్థానంలో బీర్బల్‌ కొత్తగా చేరిన రోజులవి. అక్బర్‌ను పొగడ్తలతో ప్రసన్నం చేసుకోవాలని బీర్బల్‌కు ఉండేది. అలాగే బీర్బల్‌కు ఏపాటి తెలివితేటలూ, సమయస్పూర్తీ ఉన్నాయో తెలుసుకోవాలని అక్బర్‌కూ ఆసక్తిగా ఉండేది. ఒకనాడు సభలో అక్బర్‌, బీర్బల్‌తో.. ‘ఎప్పటి నుంచో నాకో సందేహం ఉంది బీర్బల్‌. అది నువ్వే తీర్చగలవని నా విశ్వాసం’ అన్నాడు. ‘ప్రభువులకు సందేహమా? దాన్ని ఈ సామాన్య ఉద్యోగి తీర్చడమా? అదేమిటో సెలవియ్యండి జహాపనా... నా శక్తి మేరకు మీ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తా’ అన్నాడు బీర్బల్‌. ‘మరేం లేదు, అది మనందరికీ పరిచయమున్న విషయమే. కానీ ఎందువల్ల అలా జరుగుతుందో కారణం తెలియక ఇప్పుడిలా నిన్ను అడుగుతున్నాను’ అన్నాడు అక్బర్‌. ‘చిత్తం ప్రభూ.. ఇంతకీ ఆ సందేహం ఏంటో సెలవియ్యండి’ అని వినయంగా బదులిచ్చాడు బీర్బల్‌. ‘ఏముంది బీర్బల్‌... మన శరీరమంతటా వెంట్రుకలు కొంతలో కొంతైనా ఉంటాయి. కానీ నా అరిచేతుల్లో ఎందువల్ల లేవన్నది నా అనుమానం’ అన్నాడు అక్బర్‌. సభంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. బీర్బల్‌ ఏం సమాధానం చెబుతాడా.. అని అంతా ఆసక్తిగా ఉన్నారు. ‘ప్రభూ! ప్రజల యోగక్షేమాల కోసం నిత్యం మీరు చేసే దానధర్మాల వల్ల మీ అరిచేతుల్లో వెంట్రుకలు మొలవడం లేదు’ అన్నాడు బీర్బల్‌. చాలా యుక్తిగా జవాబు చెప్పిన బీర్బల్‌ను కాస్త తికమకపెట్టాలనుకున్నాడు అక్బర్‌. అందుకే వెంటనే.... ‘దానధర్మాల వల్ల నా అరిచేతుల్లో వెంట్రుకలు మొలవడం లేదు సరే.. మరి నీ అరిచేతుల్లోనూ వెంట్రుకలు లేవేం?’ అని ప్రశ్నించాడు. ‘ఏమున్నది ప్రభూ.. మీరిచ్చే లెక్కలేనన్ని కానుకలూ, దానధర్మాలూ అందుకుంటూ ఉండటం వల్ల నా అరిచేతుల్లోనూ వెంట్రుకలు మొలవడం లేదు’ అని బీర్బల్‌ మరింత తెలివిగా సమాధానం చెప్పాడు. ‘ప్రజల యోగక్షేమాలు చూడటం, దానధర్మాలు చేయడంలో మీకు ఎవ్వరూ సాటి రారు అని..’ ప్రశంసా పూర్వకంగా చెప్పిన బీర్బల్‌ జవాబుకు అక్బర్‌ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వెంనే వెయ్యి బంగారు వరహాలు కానుకగా ఇచ్చాడు. పొగడ్తల వల్ల అక్బర్‌ మొహం, కానుక వల్ల బీర్బల్‌ మొహం వెలిగిపోయాయి.  


చెప్పగలరా?

రేష్మికి వాళ్ల టీచర్‌ అయిదు లీటర్లది ఒకటి, మూడు లీటర్లది ఒకటి డబ్బాలు ఇచ్చి...  ‘లీటర్‌ నీళ్లు మాత్రమే కావాలంటే ఎలా కొలుస్తావు?’ అని అడిగింది. మీరూ ఆలోచించండి.


తమాషా ప్రశ్న

రెడ్‌, బ్లూ, వైట్‌ కలర్స్‌లో మూడు హౌస్‌లు ఉన్నాయి. మధ్యలో ఉన్న ఇంటికి రెడ్‌ ఎడమ వైపూ, బ్లూ కుడి వైపూ ఉన్నాయి. అయితే, వైట్‌హౌస్‌ ఎక్కడుంది?


ఆలోచన అదిరింది

‘మనల్ని బడిలోనో బయటో ఎవరైనా ఏడిపిస్తే ఏం చేస్తాం?’ - అమ్మానాన్నలతో చెప్పి ఏడుస్తాం. కానీ ఎవరితోనూ చెప్పలేక లోలోపలే దిగులుపడుతుంటారు కొందరు. ఇటువంటి సమస్యల పరిష్కారానికే గుడ్‌గావ్‌కి చెందిన 13 ఏళ్ల అనౌష్క జాలీ... ‘కవచ్‌’ పేరిట ఓ ఆప్‌ను రూపొందించింది. ఇటీవల ఓ బిజినెస్‌ రియాల్టీ షోలో ఈ స్టార్టప్‌ రూ.50 లక్షల పెట్టుబడీ సాధించింది. అంతేకాదు, ఈ షోలో పాల్గొన్న అతిపిన్న వయస్కు రాలిగానూ అనౌష్క నిలిచింది. దాదాపు యాభై వేల దరఖాస్తులు రాగా.. వాటిలో కేవలం 190 మాత్రమే ప్రశంసలతోపాటు ఫండింగ్‌నూ దక్కించుకున్నాయి. అందులో ‘కవచ్‌’ ఒకటి. అసలు ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే - అయిదేళ్ల క్రితం స్కూల్లో తన స్నేహితురాలిని కొందరు ఏడిపించారట. అంతకుముందు ఒక జూనియర్‌ని హేళన చేయడాన్నీ గమనించిందామె. ఈ సంఘటనలే ‘యాంటీ బుల్లీయింగ్‌ స్వ్కాడ్‌ (ఏబీఎస్‌)’ ఏర్పాటుకు దారి తీశాయి. వేధింపులపై అవగాహన కల్పించడంతోపాటు వాటిని నిరోధించడం ఈ వేదిక ఉద్దేశం. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఏబీఎస్‌, ఇప్పటివరకూ దాదాపు 2000 మంది విద్యార్థులకు అండగా నిలిచింది. సేవలు మరింత విస్తృతం చేసేందుకు ఇటీవలే ఆప్‌ను రూపొందించిన అనౌష్క... రియాల్టీ షోలో ఏబీఎస్‌, కవచ్‌ల ఏర్పాటునూ వాటి పనితీరూ భవిష్యత్తు ప్రణాళికలనూ వివరించి న్యాయనిర్ణేతల మెప్పు పొందింది.  



జవాబులు

గప్‌చుప్‌!: 1. సైకిల్‌ బుట్టలో 2. కుందేలు చెట్టుమీద ఉంది 3. సెలైన్‌ స్టాండ్‌ 4.balls, butterfly, bat, book, binocular, bag

పోలికలేంటి: అడ్డం: అన్ని బొమ్మలూ ఒకే రంగులో ఉన్నాయి, బొమ్మలన్నీ ఒకేవైపు ఉన్నాయి, బొమ్మల మీద అంకెలున్నాయి; నిలువు: అన్నీ రిమోట్‌ బొమ్మలు, బొమ్మలు పడిపోయి ఉన్నాయి, బంతి; ఐమూలగా: విమానం బొమ్మ, హెలికాప్టర్‌ బొమ్మ.

చెప్పగలరా?: మొదట చిన్న డబ్బా నిండుగా నీళ్లు తీసుకొని పెద్దదాంట్లో పోయాలి. అంటే, అయిదు లీటర్ల డబ్బాలో ఇంకా రెండు లీటర్లు పడతాయి. మళ్లీ మూడు లీటర్ల డబ్బాలో నిండుగా నీళ్లు తీసుకొని పెద్దడబ్బా నింపాలి. ఇప్పుడు కచ్చితంగా చిన్న డబ్బాలో ఒక లీటర్‌ నీళ్లుంటాయి.

తమాషా ప్రశ్న: అమెరికాలో...

ప్రతిబింబం ఏది: డి

ఇంతకీ ఏ ముక్క!: 3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..