సిసింద్రీ

విక్రమపురి రాజ్యాన్ని విక్రమసింహుడు పరిపాలించేవాడు. తన ఆస్థానంలో తెలివైన వ్యక్తి ఒకరు ఉంటే బాగుంటుందని రాజుకు అనిపించింది. అలాగే అతనితో యువరాజుకు తెలివితేటలు పెరిగేలా శిక్షణ ఇప్పించాలి అని కూడా అనుకున్నాడు.

Published : 27 Mar 2022 00:03 IST

సిసింద్రీ

మనసులో మాట!

విక్రమపురి రాజ్యాన్ని విక్రమసింహుడు పరిపాలించేవాడు. తన ఆస్థానంలో తెలివైన వ్యక్తి ఒకరు ఉంటే బాగుంటుందని రాజుకు అనిపించింది. అలాగే అతనితో యువరాజుకు తెలివితేటలు పెరిగేలా శిక్షణ ఇప్పించాలి అని కూడా అనుకున్నాడు. ఇదే విషయం మంత్రికి చెప్పి రాజ్యమంతటా దండోరా వేయించాడు. ‘రాజ్యంలో తెలివైన వ్యక్తి ఎంపిక జరుగుతోంది. మీలో ఎవరైనా తెలివైన వారు ఉంటే పరీక్షకు రండి. గెలిచిన వారికి ఆస్థానంలో కొలువు దొరుకుతుంది’ అని దాని సారాంశం. ఆసక్తి ఉన్నవారందరూ తండోపతండాలుగా తరలి వచ్చారు. ఒక్కొక్కర్నే రాజు తన ముందుకు పిలుస్తున్నాడు. ‘నా మనసులో ఏముంది? ప్రస్తుతం దేని గురించి ఆలోచిస్తున్నానో చెప్పండి’ అని వాళ్లను అడుగుతున్నాడు. ఒక్కరూ సరిగా సమాధానం చెప్పలేదు. మరికొందరు సరైన సమాధానమే చెప్పినా.. రాజు ఒప్పుకోవడం లేదు. ఇంతలో వివేకవర్మ వంతు వచ్చింది. మిగతావాళ్లను అడిగిన ప్రశ్ననే రాజు వివేకవర్మను కూడా అడిగాడు. ‘ప్రపంచంలోని రాజ్యాలన్నింటిలోకెల్లా విక్రమపురి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇదే విషయం మీ మనసులో ఉంది. ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించి, పాలనలో మిమ్మల్ని మించిన వారు లేరన్న నిజాన్ని మరోసారి ప్రపంచానికి చాటాలనుకుంటున్నారు. ప్రస్తుతం దీని గురించే మీరు ఆలోచిస్తున్నారు’ అని వివేకవర్మ సమాధానం చెప్పాడు. విక్రమసింహుడు నిజానికి మరో ఆలోచనలో ఉన్నాడు. కానీ.. ‘కాదు’ అనడం తన గౌరవానికే భంగం. అందుకే వెంటనే.. ‘అద్భుతం వివేకవర్మా.. అద్భుతం..! నువ్వు నూటికి నూరుశాతం నిజమే చెప్పావు. నీకు ఆస్థానంలో కొలువు ఇస్తున్నాను. అలాగే యువరాజుకు కూడా నిన్ను వ్యక్తిగత శిక్షకుడిగా నియమిస్తున్నాను’ అని విక్రమసింహుడు ఆజ్ఞ జారీ చేశాడు. వివేకవర్మ ఆనందంగా కొలువులో చేరాడు. చాలా సమస్యలను తన యుక్తితో పరిష్కరించి, తక్కువ సమయంలోనే మంత్రి పదవినీ చేపట్టాడు.


గిరాగిరా.. ఎగిరే డ్రోన్‌!

చూడడానికి కాస్త ఫ్లైయింగ్‌ సాసర్‌(యూఎఫ్‌ఓ)లా కనిపిస్తున్న ఇది నిజానికి ఓ డ్రోన్‌. మనలాంటి పిల్లల కోసమే దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. చూసేందుకు బుజ్జి డ్రోనే అయినప్పటికీ ఇందులో చాలా విశేషాలున్నాయి. అవేంటంటే... ఇది రిమోట్‌ సాయంతో పనిచేస్తుంది. అలాగే దీనికి హ్యాండ్‌ కంట్రోల్‌ సెన్సర్‌ కూడా ఉంది. అంటే గాల్లో ఎగురుతున్న డ్రోన్‌కు కాస్త దగ్గరగా మీ చేతిని ఉంచితే.. అది తన దిశ మార్చుకుని ప్రయాణిస్తుంది. ‘అమ్మో! డ్రోన్‌ బ్లేడ్లు తగిలితే మాకు గాయాలవుతాయేమో?’ అనే భయాలూ, అనుమానాలూ అవసరం లేదు. ఎందుకంటే దీని చుట్టూ రక్షణ కోసం గూడులాంటి నిర్మాణం ఉంటుంది. కిందపడ్డా విరగనీ, పగలనీ పదార్థంతో దీన్ని తయారు చేశారు. డ్రోన్‌ వేగాన్ని మార్చుకునేందుకు రెండు స్పీడ్‌ అడ్జెస్ట్‌మెంట్లున్నాయి. చీకట్లోనూ ఆడుకునేందుకు వీలుగా ఎల్‌ఈడీ లైట్లు కూడా ఉన్నాయి. దీంతో ఒక్కరే కాదు, ఓ అయిదారుగురు కలిసి జట్టుగా కూడా ఆడుకోవచ్చు. యూఎస్‌బీ ఛార్జర్‌తో దీన్ని ఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఈ యూఎఫ్‌ఓ డ్రోన్‌ అందుబాటులో ఉంది.


మీరే చెప్పారు మరి!

టీచర్‌: బంటీ.. నీ మ్యాథ్స్‌ టెక్ట్స్‌ బుక్‌ ఏది? అస్సలు స్కూలుకు తేవడం లేదు నువ్వు?

బంటి: చెత్తబుట్టలో పారేశా టీచర్‌.

టీచర్‌: ఏంటీ.. చెత్తబుట్టలో పారేశావా! ఎందుకు?

బంటి: మొన్న మీరే చెప్పారు కదా టీచర్‌... సమస్యలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని! ఆ బుక్‌లో అన్నీ ప్రాబ్లమ్సే మరి! అందుకే దాన్ని పారేశా!

టీచర్‌: ఆఁ!!



జవాబులు

పోలికలేంటి?: అడ్డం: జ్యూస్‌, విమానం బొమ్మ, కంప్యూటర్‌; నిలువు: పుచ్చకాయ, గ్లోబు, అద్దం; ఐమూలగా: చేతి వాచీ, పూల చొక్కా.

తేడాలేంటి?: 1. చపాతీ పిండి ముద్ద 2. జగ్గు పైన పువ్వు 3. ట్రేలో గుడ్డు 4. మధ్యలో ఉన్న బాబు చేతిలోని గరిటె 5. చివరనున్న బాబు చొక్కాపైన డిజైన్‌ 6. డబ్బా హ్యాండిల్‌ 7. బుట్టలోని అరటి పండు 8. గ్యాస్‌ స్టవ్‌ మీద బర్నర్‌.

గుర్తించగలరా?: Boat, Binoculars, Banana, Bat, Balloon, Butterflies, Birds, Bicycle.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..