సిసింద్రీ

‘భౌ భౌ... ఏంటి.. చదువు నేర్పడం ఏంటి?’ అని మీ చిట్టి బుర్రలు ఆశ్చర్యపోతున్నాయి కదూ! అవును భౌ.. భౌ..నే మనలాంటి పిల్లలకు చదువు నేర్పుతుంది. ‘హాట్‌ డాట్స్‌’ అని పిలిచే

Published : 17 Apr 2022 00:54 IST

సిసింద్రీ

చదువు నేర్పే భౌ భౌ..!

‘భౌ భౌ... ఏంటి.. చదువు నేర్పడం ఏంటి?’ అని మీ చిట్టి బుర్రలు ఆశ్చర్యపోతున్నాయి కదూ! అవును భౌ.. భౌ..నే మనలాంటి పిల్లలకు చదువు నేర్పుతుంది. ‘హాట్‌ డాట్స్‌’ అని పిలిచే సెట్‌లో పుస్తకాలు, కార్డులు, ఓ పెన్నూ వస్తాయి. ఆ కలం కుక్క ఆకారంలో ఉంటుంది. గుడ్లగూబ, పిల్లి, టెడ్డీబేర్‌ వంటి ఆకృతుల్లో ఉన్నవీ ఉన్నాయి. ముందుగా మనం హాట్‌డాట్స్‌ పుస్తకాన్ని తెరిస్తే బొమ్మలు, వాటికింద డాట్‌లూ, పక్కన ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఆ డాట్‌ మీద ఈ భౌ.. భౌ.. పెన్‌ను పెడితే చాలు! అది పైన ఉన్న చిత్రమేంటో చదివి చెబుతుంది. ఇలా తేలిగ్గా మనం నేర్చుకోవచ్చు. ఈ పెన్ను బ్యాటరీల సాయంతో పనిచేస్తుంది. రంగురంగుల లైట్లు, ఆకర్షణీయమైన ఆకారం, ఫన్నీ వాయిస్‌తో ఇది మనలాంటి చిన్నారులను ఎంతో అలరిస్తుంది. అదే సమయంలో మనకు చదువునూ నేర్పుతుంది. అంటే.. ఆహ్లాదాన్నీ, విజ్ఞానాన్నీ పంచుతుందన్నమాట. ఈ హాట్‌డాట్స్‌ రీడింగ్‌ సెట్‌ మూడు విభాగాల్లో అందుబాటులో ఉంది. హాట్‌డాట్‌ టాట్స్‌.. ఇది 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు, హాట్‌డాట్‌ జూనియర్‌.. ఇది 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు, హాట్‌డాట్స్‌... ఇది 5 నుంచి 12 సంవత్సరాల లోపు వారికి ఉపయోగపడుతుంది. మొత్తానికి ఈ చదివించే భౌ భౌ.. నేస్తం.. భలే ఉంది కదూ ఫ్రెండ్స్‌!


లెక్క సరిపోయింది!

అది ఎర్రటి ఎండాకాలం. పగలంతా సూర్యుడు భగభగ మండుతున్నాడు. రాజ్యంలో చాలా చోట్ల బావుల్లో నీళ్లు అడుగంటాయి. కరవుఛాయలు కనిపిస్తున్నాయి. ఒకనాడు అక్బర్‌ చక్రవర్తి ఆరుబయట తన పాన్పు మీద వెల్లకిలా పడుకొని ఉన్నాడు. ఆకాశంలోని నక్షత్రాలు మిలమిల మెరుస్తూ కనిపించాయి. ‘ఈ చక్కని చుక్కలు ఎన్ని ఉంటాయి?’ అనే ఆలోచన అక్బర్‌కు వచ్చింది. మర్నాడు దర్బారులో ఇదే సందేహం వెలిబుచ్చాడు. ఆకాశంలో ఉన్న చుక్కల లెక్కలు చెప్పినవారికి రత్నాలు, ముత్యాలు కానుకగా ఇస్తానని ప్రకటించాడు. ఎవరూ ముందుకు రాలేదు. ‘బీర్బల్‌.. చుక్కల లెక్క చెప్పగలవా?’ అని అక్బర్‌ అడిగాడు. తనకు మూడు రోజులు గడువు ఇస్తే చెప్పగలనన్నాడు. అక్బర్‌ ఒప్పుకున్నాడు. నాలుగోరోజు దర్బారు కొలువు తీరింది. అందరూ బీర్బల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే బీర్బల్‌ తన భుజాన ఓ మూట వేసుకుని వచ్చాడు. ‘జహాపనా! నన్ను క్షమించాలి. నక్షత్రాలను లెక్కబెట్టడం పూర్తయ్యేసరికి కాస్త ఆలస్యమైంది’ అన్నాడు బీర్బల్‌. ‘ఏంటీ.. నిజంగా చుక్కలను లెక్కబెట్టావా?’ అన్నాడు అక్బర్‌. ‘చిత్తం.. కానీ అంకెల్లో చెప్పడం సాధ్యం కానందున నక్షత్రానికో ఇసుక రేణువు చొప్పున మూటగట్టుకుని తెచ్చాను. గణికులను నియమించి వీటిని లెక్కపెట్టించండి. అలాగే నేను కేవలం రాత్రి పూట కనిపించిన చుక్కలను మాత్రమే లెక్కించాను. కానీ, కరవు పరిస్థితుల వల్ల ప్రజలకు బతుకు భారమై పగటిపూటే చుక్కలు కనిపిస్తున్నాయి. వాటిని ఇంకా లెక్కించలేదు. మీరు మరో మూడు రోజులు గడువిస్తే.. వాటి లెక్కకూడా చెబుతా’ అన్నాడు బీర్బల్‌. ప్రజలు కరవుతో అల్లాడుతుంటే, తాను వారి గురించి ఆలోచించకుండా.. అనవసర విషయాల కోసం సమయం వృథా చేస్తున్నా అని బీర్బల్‌ తనకు చురకలంటిస్తున్నాడు అనే విషయం అక్బర్‌కు అర్థమైంది. వెంటనే అక్బర్‌ తన తప్పు దిద్దుకుని కరవు నివారణ చర్యలు ప్రారంభించాడు. పన్నుల భారం తగ్గించాడు. ఊరూరా గంజికేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయించాడు.








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..