సిసింద్రీ

హాయ్‌... ఫ్రెండ్స్‌! మీకు పాప్‌కార్న్‌ అంటే ఇష్టమేనా... అయినా పాప్‌కార్న్‌ అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరుంటారు! ఖాళీ దొరికితే చాలు కరకరలాడిస్తూనే ఉంటాం కదూ. ఇప్పుడే కాదు... సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం నుంచే పాప్‌కార్న్‌ ఉంది.

Published : 24 Apr 2022 00:02 IST

సిసింద్రీ

కర... కర... పాప్‌కార్న్‌!

హాయ్‌... ఫ్రెండ్స్‌! మీకు పాప్‌కార్న్‌ అంటే ఇష్టమేనా... అయినా పాప్‌కార్న్‌ అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరుంటారు! ఖాళీ దొరికితే చాలు కరకరలాడిస్తూనే ఉంటాం కదూ. ఇప్పుడే కాదు... సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం నుంచే పాప్‌కార్న్‌ ఉంది. అంటే అంత ప్రాచీనమైనదన్నమాట. ఆధునిక పాప్‌కార్న్‌ యంత్రాన్ని మాత్రం చార్లెస్‌ క్రెటర్స్‌ 1885లో కనిపెట్టాడు. వేయించినప్పుడు పాప్‌కార్న్‌ సుమారు మూడు అడుగుల ఎత్తు వరకు గాల్లో ఎగురుతుంది. ఇది వేగిన తర్వాత గుండ్రటి ఆకారంలో ఉంటే దాన్ని మష్రూమ్‌ పాప్‌కార్న్‌ అనీ, విచ్చుకున్న ఆకారాల్లో ఉంటే దాన్ని బటర్‌ఫ్లై పాప్‌కార్న్‌ అనీ అంటారు. ఇవన్నీ సరే, అసలు పాప్‌కార్న్‌ అలా ఎందుకు విచ్చుకుంటుందో తెలుసా... మొక్కజొన్న గింజలో కొద్ది మొత్తంలో నీరు ఉంటుంది. నిర్ణీత ఉష్ణోగ్రతకు చేరుకోగానే అది ఆవిరైపోతుంది. అప్పుడు గింజ పగిలి విచ్చుకుని పాప్‌కార్న్‌గా మారుతుంది. ఇలా మారే క్రమంలో ముందుకన్నా మూడు రెట్లు ఎక్కువ పెద్దగా తయారవుతుంది. మనం తేలిగ్గా మొక్కజొన్న అనేస్తాం కానీ ఇందులో ప్రధానంగా పాడ్‌కార్న్‌, స్వీట్‌కార్న్‌, ఫ్లోర్‌కార్న్‌, డెంట్‌కార్న్‌, ఫ్లింట్‌కార్న్‌, పాప్‌కార్న్‌ అనే ఆరు రకాలుంటాయి. ప్రపంచం మొత్తంమీద అమెరికన్లే ఎక్కువగా పాప్‌కార్న్‌ తింటారు. ఏటా జనవరి 19న అమెరికాలో ‘జాతీయ పాప్‌కార్న్‌ దినోత్సవం’ జరుపుకుంటారు. మీకు మరో విషయం తెలుసా... గతంలో ఆ దేశంలో సినిమా థియేటర్లలో పాప్‌కార్న్‌ను నిషేధించారు... ఎందుకంటే తినేటప్పుడు వాటి నుంచి వచ్చే కరకర శబ్దమేనట. తర్వాత నిషేధం ఎత్తివేశారులే! ఫ్రెండ్స్‌... మొత్తానికి ఇవీ పాప్‌కార్న్‌ సంగతులు! 


 



గుర్రం గుడ్డు!

పూర్వం రామాపురంలో సోమయ్య అనే కవి ఉండేవాడు. అతని కవిత్వం వింటే అందరికీ తలనొప్పి వచ్చేది. సోమయ్య మాత్రం రాజుగారి ఆస్థానంలో చోటు కోసం విశ్వప్రయత్నాలు చేసేవాడు. అతనికి వెర్రన్న అనే వెర్రిబాగుల కొడుకు ఉండేవాడు. ఒకనాడు వెర్రన్న, సోమయ్యతో... ‘నాన్నా... నీకు రాజుగారి ఆస్థానంలో స్థానం ఎందుకు దొరకడం లేదో... నాకు తెలిసింది’ అన్నాడు. ‘అవునా... ఏంటో చెప్పు బాబూ!’ అన్నాడు సోమయ్య. ‘నీకు గుర్రం లేకపోవడమే అసలు కారణం. ఈసారి నువ్వు గుర్రం మీద వెళితే... నీ డాబూ దర్పం చూసి వెంటనే ఆస్థాన కవిగా నియమించుకుంటారు’ అని చెప్పాడు. వెర్రన్న చెప్పింది సబబుగానే అనిపించి సోమయ్య కొంత డబ్బు తీసుకువచ్చి కొడుక్కు ఇచ్చాడు. గుర్రం కొని తేవడం కోసం వెంటనే బయలుదేరాడు వెర్రన్న. దారి పక్కన పొలంలో గడ్డి మేస్తున్న గుర్రాలు కనిపించాయి. వాటి పక్కనే గుర్రం గుడ్లూ ఉన్నాయి! ‘గుర్రానికి ధర ఎక్కువ ఉంటుంది. గుడ్లైతే తక్కువ ధరకే వస్తాయి’ అనుకున్నాడు. గుర్రాలను మేపుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి ‘గుర్రాలు నీవేనా?’ అని అడిగాడు. ‘అవును... మాది పొరుగూరు’ అన్నాడు ఆ వ్యక్తి. ‘అది సరే... ఆ గుర్రం గుడ్లు కూడా నీవేనా?’ అన్నాడు వెర్రన్న. వెటకారం ఆడుతున్నాడేమో అనుకుని ఆ వ్యక్తి కూడా సరదాగా ‘ఆ... నావే’ అన్నాడు. ‘నాకొకటి కావాలి. ఎంతకు అమ్ముతావు’ అని అడిగాడు వెర్రన్న. ‘ఎంత... వంద వరహాలు’ అన్నాడు కాపరి. ‘భలే చౌక బేరం’ అనుకుంటూ వెర్రన్న ఇచ్చేశాడు. ‘నిజంగానే వీడు వెర్రిబాగులోడే’ అనుకుని అతడు అడిగిన వస్తువును ఇచ్చేసి చకచకా తన గుర్రాలను తీసుకుని వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. గుర్రం గుడ్డును తల మీద పెట్టుకుని ఇంటికి వెళ్లాడు వెర్రన్న. కొడుకును చూసి సోమయ్య గబగబా బయటకు వచ్చి చుట్టూ చూశాడు. కానీ, ఎంతసేపటికీ గుర్రం జాడ లేకపోయేసరికి... ‘దిష్టి తీయడానికి బూడిద గుమ్మడికాయ తెచ్చావు సరే... ఇంతకూ గుర్రం ఏది?’ అన్నాడు సోమయ్య. అది గుర్రంగుడ్డు కాదని అప్పటికి తెలిసింది వెర్రన్నకు. తాను మోసపోయినట్లు అర్థమై... సోమయ్యకు జరిగిందంతా చెప్పాడు. ‘బూడిద గుమ్మడి కాయను గుర్రం గుడ్డు అనుకోవడం ఏంట్రా?’ అని కర్ర తీసుకుని నాలుగు తగిలించాడు. దెబ్బల బాధకు వెర్రన్న బేర్‌మంటే, డబ్బులు పోయినందుకు సోమయ్య ఏడుస్తూ కూర్చున్నాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..