సిసింద్రీ

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఎండలు భలే మండిపోతున్నాయి కదూ! బయటకు వెళ్లి ఆడుకోలేం. ఎంతసేపని ఆ కార్టూన్‌ నెట్‌వర్క్‌లు చూస్తూ కూర్చుంటాం. స్మార్ట్‌ఫోన్‌కే అతుక్కుపోవడమూ సరికాదు. ఇలాంటి పరిస్థితుల్లో

Updated : 08 May 2022 01:52 IST

సిసింద్రీ

బొమ్మలు గీద్దామా స్మార్ట్‌గా..!

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఎండలు భలే మండిపోతున్నాయి కదూ! బయటకు వెళ్లి ఆడుకోలేం. ఎంతసేపని ఆ కార్టూన్‌ నెట్‌వర్క్‌లు చూస్తూ కూర్చుంటాం. స్మార్ట్‌ఫోన్‌కే అతుక్కుపోవడమూ సరికాదు. ఇలాంటి పరిస్థితుల్లో మనలాంటి బుజ్జి బుడతల కోసమే ఉంది... ఈ స్మార్ట్‌స్కెచ్చర్‌. ఇది ప్రొజెక్టర్‌ సాయంతో మనకు బొమ్మల్ని గీయడం నేర్పిస్తుంది. దీన్ని ఎడాప్టర్‌ సాయంతో వాడుకోవచ్చు. సెల్‌ బ్యాటరీలతోనూ ఉపయో గించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే... ముందుగా స్మార్ట్‌స్కెచ్చర్‌ ఆప్‌ను మన స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. స్మార్ట్‌ఫోన్‌-స్మార్ట్‌స్కెచ్చర్‌లను ఆప్‌ సాయంతో అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు అందులో కొన్ని చిత్రాలు వస్తాయి. వాటిని సెలక్ట్‌ చేసుకుంటే ప్రొజెక్టర్‌ కింది భాగంలో ఆ చిత్రం కనిపిస్తుంది. సెల్‌ఫోన్‌లో ఫొటో తీసిన వాటినీ ప్రొజెక్టర్‌తో షేర్‌ చేసుకోవచ్చు. చిత్రం కనిపించే చోట మనం ఓ పేపర్‌ను పెట్టాలి. విచిత్రంగా ఆ చిత్రం కాగితం మీద ప్రతిబింబంలా పడుతుంది. ప్రొజెక్టర్‌ చూపిస్తున్న బొమ్మ అంచుల వెంబడి జాగ్రత్తగా పెన్సిల్‌తో గీస్తూ వెళ్లడమే. అప్పటికీ కష్టం అనిపిస్తే... స్టెప్‌బై స్టెప్‌ చిత్రం ప్రతిబింబం పడేలా చేసుకునే ఆప్షన్‌ కూడా ఉంది. మన దగ్గర స్మార్ట్‌ఫోన్‌ లేకపోయినా ఇబ్బందేం లేదు. ఈ ప్రొజెక్టర్‌లో కొన్ని చిత్రాలు ఇన్‌బిల్ట్‌గానూ ఉంటాయి. ఇలా ఈ ప్రొజెక్టర్‌ సాయంతో ఎంచక్కా బొమ్మలు గీసేసుకోవచ్చు.









తేలు కుట్టిన దొంగ!

పూర్వం ఒక గ్రామంలో రామయ్య, సోమయ్య అనే స్నేహితులుండేవారు. రామయ్య వ్యాపార నిమిత్తం వేరే రాజ్యానికి వెళ్లాలనుకున్నాడు. అతని దగ్గర కొన్ని బంగారు నగలున్నాయి. వాటిని దాచే విషయమై సోమయ్యను సలహా అడిగాడు. ‘ఊరి చివర ఓ పాడుబడిన ఇల్లుంది. అక్కడ పాతిపెడదాం’ అన్నాడు సోమయ్య. ఆ రోజు రాత్రే తమ పథకాన్ని అమలుపరిచారు. తర్వాత వ్యాపార నిమిత్తం రామయ్య వెళ్లిపోయాడు. కొంతకాలానికి సోమయ్యకు దుర్బుద్ధి పుట్టి దాచిన నగలను తెచ్చుకున్నాడు. కొన్ని నెలల తర్వాత రామయ్య తిరిగి వచ్చాడు. ముందుగా నగలు దాచిన చోట తవ్వి చూసి, తాను మోసపోయినట్లు గ్రహించాడు. మోసాన్ని మోసంతోనే జయించాలనుకొని నేరుగా సోమయ్య ఇంటికి వెళ్లాడు. రామయ్యను చూడగానే సోమయ్య గుండె గుభేలుమంది. కాస్త ధైర్యం తెచ్చుకుని ‘రామయ్యా..! వ్యాపారం బాగా జరిగిందా?’ అని అడిగాడు. ‘మంచి లాభాలు వచ్చాయి. చాలా నగలు కొన్నాను. మనం రేపు రాత్రి వీటిని కూడా అక్కడ దాచి, నేను మళ్లీ వ్యాపారానికి వెళ్లాలి’ అని చెప్పాడు. సోమయ్య ఆ రోజే నగలన్నింటినీ ఎక్కడి నుంచి తీశాడో అక్కడే పూడ్చిపెట్టి వచ్చాడు. రామయ్య మరి కొన్ని నగలు పాతిపెట్టి వ్యాపారానికి వెళ్లగానే మొత్తం దోచేద్దాం అనుకున్నాడు. మర్నాడు రాత్రి సోమయ్య, రామయ్య కోసం చాలా సేపు ఎదురు చూశాడు. కానీ అర్ధరాత్రైనా రామయ్య రాలేదు. ఇక లాభం లేదని సోమయ్యే రామయ్య ఇంటికి వెళ్లాడు. ‘సోమయ్యా!  నేను ఇప్పుడప్పుడే వ్యాపారానికి వెళ్లడం లేదు. నగలు దాయడానికి తర్వాత వెళ్దాంలే’ అని చెప్పాడు. సోమయ్య నిరాశగా ఆ పాడుబడ్డ ఇంటికి వెళ్లి నగలు దాచిన చోట తవ్వి, కుండను బయటకు తీస్తే, అందులో రాళ్లూరప్పలు తప్ప ఇంకేమీ లేవు. ఇదంతా రామయ్య పనే అని గ్రహించి, తేలు కుట్టిన దొంగలా కిక్కురుమనకుండా ఉండిపోయాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..