సిసింద్రీ

మామూలుగా సిక్స్‌ ప్యాక్‌ అనేది పెద్దవాళ్లలో ఫిట్‌నెస్‌కు కొలమానం. దాన్ని సాధించాలంటే చాలా కష్టం. కానీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన పదకొండేళ్ల పూజా బిష్ణోయ్‌ సిక్స్‌ప్యాక్‌ సొంతం చేసుకుంది. అదీ

Published : 29 May 2022 00:17 IST

సిసింద్రీ

సిక్స్‌ ప్యాక్‌ చిన్నారి!

మామూలుగా సిక్స్‌ ప్యాక్‌ అనేది పెద్దవాళ్లలో ఫిట్‌నెస్‌కు కొలమానం. దాన్ని సాధించాలంటే చాలా కష్టం. కానీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన పదకొండేళ్ల పూజా బిష్ణోయ్‌ సిక్స్‌ప్యాక్‌ సొంతం చేసుకుంది. అదీ తనకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే. ఆసియా ఖండం మొత్తం మీద ఏ బాలికా ఇంత చిన్న వయసులో సాధించలేదు. ఈ చిన్నారి అథ్లెట్‌ కూడా. 2017లో తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు 10 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 43 నిమిషాల్లోనే పరిగెత్తింది. 3000 మీటర్లు, 1500 మీటర్లు, 800 మీటర్ల విభాగాల్లో పలు పతకాలూ గెలుచుకుంది. ఈ చిన్నారి తపనను గుర్తించిన విరాట్‌ కోహ్లీ ఫౌండేషన్‌ తనకు సాయం చేస్తోంది. ఇటీవలే పూజా మూడు కిలోమీటర్ల దూరాన్ని 12.50 నిమిషాల్లో పరిగెత్తి వరల్డ్‌ రికార్డూ సాధించింది. ఉదయం మూడు గంటలకే నిద్రలేవడంతో పూజా దినచర్య ప్రారంభం అవుతుంది. ఎనిమిది గంటల వరకూ వ్యాయామాలు చేస్తుంది. తర్వాత మళ్లీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ కసరత్తులకే సమయం కేటాయిస్తుంది. ఆహారం విషయంలోనూ నిక్కచ్చిగా ఉంటుంది. తన మేనమామ శిక్షణ వల్లే ఇవన్నీ సాధించానంటోంది. 2024లో జరగనున్న యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం తీసుకురావడమే లక్ష్యమని చెబుతోంది ఈ బాలిక. ఇంత చిన్న వయసులోనే ఇన్ని ఘనతలు సాధించిన పూజా బిష్ణోయ్‌ నిజంగా గ్రేట్‌ కదూ!


సమయస్ఫూర్తి!

పూర్వం కావేరీ నది తీరాన మధురాపురి రాజ్యం ఉండేది. దానికి భూపతివర్మ రాజు. శ్రవణశర్మ అనే వ్యక్తి ఆస్థాన జ్యోతిష్కుడిగా ఉండేవాడు. భూపతివర్మ మంచివాడే కానీ, అప్పుడప్పుడు వినోదం కోసం సభలో ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు. ఓరోజు రాజు తన పరివారంతో సమావేశమయ్యాడు. ఈ సారి భూపతివర్మ దృష్టి శ్రవణశర్మపైన పడింది. ‘మీరు మా రాజవంశీయులకు సరిగా జాతకాలు చెప్పడం లేదనీ, మంచి ముహూర్తాలూ పెట్టడం లేదనీ నాకెందుకో సందేహం వస్తోంది. దీనికి మీరేమంటారు?’ అని ప్రశ్నించాడు. ‘మహారాజా! అలాంటిదేమీ లేదు. నా శక్తి మేరకు నేను మీకు సేవ చేస్తున్నా’ అని శర్మ సమాధానమిచ్చాడు. ‘అయినా నాకెందుకో నీ విద్యను పరీక్షించాలనిపిస్తోంది. ఇప్పుడు నీ వయసు ఎంత? ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు బతకగలవో చెప్పు?’ ప్రశ్నించాడు రాజు. ‘ప్రభూ.. నాకిప్పుడు యాభై సంవత్సరాలు. నాకు ఎనభై రెండు సంవత్సరాల ఆయువుంది’ చెప్పాడు శ్రవణశర్మ. ‘అవునా.. అయితే భటులారా.. శ్రవణశర్మ శిరస్సు ఖండించండి ఇప్పుడే’ అన్నాడు భూపతివర్మ గట్టిగా నవ్వుతూ. పాపం.. శ్రవణశర్మకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. కానీ, వెంటనే తేరుకుని... ‘ప్రభూ.. నేనింకా చెప్పడం పూర్తి కాలేదు. నాకు ఎనభై రెండు సంవత్సరాల ఆయువుంది.. కానీ ఈలోపు ఎవరైనా నా చావుకు కారణమైతే... వాళ్ల ప్రాణం కూడా నేను చనిపోయిన ఏడురోజుల్లోపు ఎప్పుడైనా పోవచ్చు. సరే.. ప్రభూ.. నాకు ఇప్పుడు మరణ శిక్ష విధించండి. పర్లేదు. ఎలాగూ మనం కొన్ని రోజుల్లోనే స్వర్గంలో కలుసుకుంటాంగా’ అన్నాడు. శ్రవణశర్మ తెలివిగా చెప్పిన సమాధానానికి భూపతివర్మ కంగుతిన్నాడు. అయినా సభలో పరువు పోతుందని.. జ్యోతిష్కుడికి ఏ శిక్షా విధించకుండా ‘సరే శ్రవణశర్మా..! మనిద్దరం ఎనభై రెండు సంవత్సరాల తర్వాతే స్వర్గంలో కలుసుకుందాంలే. ఇప్పుడు వెళ్లి మీ స్థానంలో కూర్చోండి’ అని చెప్పి... ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటి నుంచి ఇంకెప్పుడూ ఎవ్వరినీ ఆటపట్టించే ప్రయత్నం చేయలేదు భూపతివర్మ.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు