సిసింద్రీ

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా.. ఈ రోజు మనం ఓ కొత్త ఆట గురించి తెలుసుకుందామా.. అదే మ్యూజికల్‌ స్టిక్స్‌! పది నుంచి పదిహేను మంది వరకూ ఈ ఆట ఆడుకోవచ్చు.

Updated : 05 Jun 2022 06:48 IST

సిసింద్రీ

మ్యూజికల్‌ స్టిక్స్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా.. ఈ రోజు మనం ఓ కొత్త ఆట గురించి తెలుసుకుందామా.. అదే మ్యూజికల్‌ స్టిక్స్‌! పది నుంచి పదిహేను మంది వరకూ ఈ ఆట ఆడుకోవచ్చు. ముందుగా అందరూ వృత్తాకారంలో, చేయి పూర్తిగా చాపినా తగలనంత దూరంలో నిల్చోవాలి. ప్రతి ఒక్కరూ తమకంటే కాస్త తక్కువ ఎత్తు ఉండే వెదురు కర్రలను చేతులతో పట్టుకోవాలి. ఇప్పుడు ఈ వృత్తంలోని వారు కాకుండా బయట ఉన్న పిల్లవాడు సెల్‌ఫోన్‌లో కానీ సౌండ్‌ సిస్టమ్‌లో కానీ ఏదైనా ఒక పాటను ప్లే చేయాలి. కొద్ది క్షణాల తరవాత పాటను సడన్‌గా ఆపేయాలి. అప్పుడు వృత్తంలో నిల్చున్న పిల్లలు తాము పట్టుకున్న కర్రలను వదిలేసి, ఎడమ వైపునకు కదలాలి. పక్కన ఉన్నవారు వదిలి వెళ్లిన కర్రను పట్టుకోవాలన్నమాట. అది పడిపోకముందే పట్టుకున్నవాళ్లు ఆటలో ఉన్నట్లు. కర్ర పడిపోయేలోపు పట్టుకోలేనివారు ఓడిపోయినట్లు లెక్క. అంటే, ఇక వాళ్లు ఆట నుంచి తప్పుకోవాలి. ఇలా ఆఖరున ఒకరు మిగిలేంత వరకూ ఆడాలి. చివరిదాకా నిలిచినవారే విజేత. నేస్తాలూ.. మొత్తానికి ‘మ్యూజికల్‌ స్టిక్స్‌’ ఆట భలే సరదాగా ఉంది కదూ!


మరో బహుమతి!

క్బర్‌కు పక్షులంటే చాలా ఇష్టం. ఒక రోజు అతని రాజ్యానికి విదేశాల నుంచి ఓ పక్షుల వ్యాపారి వచ్చాడు. అతడు ఓ విచిత్రమైన పక్షిని తీసుకువచ్చాడు. అది రంగురంగులతో చూడడానికి భలే అందంగా ఉంది. దాన్ని అక్బర్‌ ముందు ఉంచి.. ‘జహాపనా.. ఈ అరుదైన పక్షిని మీకు అమ్మడానికి తీసుకువచ్చాను’ అని చెప్పాడు. అక్బర్‌ ఆ పక్షుల వ్యాపారి అడిగినట్లు వెయ్యి బంగారు నాణేలు ఇచ్చాడు. ‘జహాపనా..! ఆ పక్షి రంగులతో భలే అందంగా ఉంది. కానీ, పాపం దానికి చాలా రోజులుగా స్నానం చేయించినట్లు లేరు. కాస్త శుభ్రం చేసి అప్పగించమని వ్యాపారికి చెప్పండి’ అని అక్బర్‌తో అన్నాడు బీర్బల్‌. ‘వ్యాపారీ.. మా మంత్రిగారు చెప్పినట్లు చేయండి’ అని ఆజ్ఞాపించాడు అక్బర్‌. వ్యాపారి వణుకుతున్న చేతులతో పక్షి మీద నీళ్లు పోశాడు. అంతే.. పక్షికున్న రంగులు పోవడం ప్రారంభమైంది. కాసేపటికి అది వింతపక్షి కాదు, ఓ తెల్లపావురం అని తేలింది. అక్బర్‌కు పట్టరాని కోపం వచ్చింది. వ్యాపారి నుంచి వెయ్యి వరహాలు స్వాధీనం చేసుకొని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. ‘ఆశ్చర్యంగా ఉంది బీర్బల్‌.. మాకెవ్వరికీ రాని అనుమానం, నీకెలా వచ్చింది?’ అని అక్బర్‌ ప్రశ్నించాడు. ‘మరేంలేదు జహాపనా.. ఆ వ్యాపారి చేతి గోళ్లకు రంగులు అంటుకుని ఉన్నాయి. అందుకే నాకు సందేహం వచ్చింది’ అన్నాడు బీర్బల్‌. సంతోషంతో ఆ వెయ్యి వరహాలను బీర్బల్‌కు అందించాడు అక్బర్‌. ‘ప్రభూ.. నాకు ఈ వరహాలతోపాటు మరో బహుమతీ కావాలి’ అని కోరాడు బీర్బల్‌. ఏంటో చెప్పమన్నాడు అక్బర్‌. ‘ప్రభూ... మీ దగ్గర కొన్ని వందల రకాల పక్షులు బందీలుగా ఉన్నాయి. పాపం.. వాటన్నింటికీ స్వేచ్ఛను ప్రసాదించండి. మీకు అంతగా పక్షులంటే ఇష్టం ఉంటే.. ప్రకృతిలో హాయిగా విహరిస్తున్న వాటిని చూసి ఆనందించండి’ అని చెప్పాడు బీర్బల్‌. పెద్దమనసుతో సరేనన్నాడు అక్బర్‌.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..