సిసింద్రీ

మొసలి అంటే మనందరికీ చాలా భయం కదా! నేల మీద కన్నా... నీళ్లలో దానికి మరింత శక్తి ఉంటుంది. ఏనుగులూ, పులులూ, సింహాలూ, గేదెల వంటి పెద్ద పెద్ద జీవుల్ని సైతం అది కరకర లాడించేస్తుంది. అలాంటిది ఓ పద్నాలుగేళ్ల అబ్బాయి తన

Updated : 19 Jun 2022 05:22 IST

సిసింద్రీ

‘సాహో’రే బాహుబలి!

మొసలి అంటే మనందరికీ చాలా భయం కదా! నేల మీద కన్నా... నీళ్లలో దానికి మరింత శక్తి ఉంటుంది. ఏనుగులూ, పులులూ, సింహాలూ, గేదెల వంటి పెద్ద పెద్ద జీవుల్ని సైతం అది కరకర లాడించేస్తుంది. అలాంటిది ఓ పద్నాలుగేళ్ల అబ్బాయి తన ప్రాణాలు తోడేయాలని చూసిన మొసలినే ఓడించాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇటీవల ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో నేషనల్‌ పార్క్‌ సమీపంలోని నదిలో ఈత కొట్టడానికి అరజా గ్రామానికి చెందిన కొందరు పిల్లలు వెళ్లారు. వాళ్లు
నది ఒడ్డుకు దగ్గరగా ఈత కొడుతుండగా ఉన్నట్లుండి దాదాపు ఏడు అడుగుల పొడవున్న పెద్ద మొసలి ఒకటి అమాంతం ఓం ప్రకాశ్‌ సాహోపై దాడి చేసింది. నోట కరుచుకుని నీళ్లలోకి లాక్కెళ్లింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన సాహో గట్టిగా కేకలు వేశాడు. ఒడ్డుపైన ఉన్న మిగతా పిల్లలూ సాయం కోసం అరిచారు. అప్పటికే సాహోను మొసలి తన నోట్లో బంధించింది. మరికొన్ని సెకన్లు ఆలస్యమైతే పిల్లాడి శరీరం ఛిద్రమై ఉండేది. కానీ, సాహో వెంటనే ప్రతిదాడికి దిగాడు. తన చేతులతో దాని తల, కళ్లపైన పిడిగుద్దులు గుద్దాడు. ఆ దెబ్బల ధాటికి మొసలి తాళలేకపోయింది. బతుకుజీవుడా అనుకుంటూ మన సాహోను వదిలేసింది. ఇదే అదునుగా చకచకా ఒడ్డుకు చేరుకున్నాడు ఈ సాహస బాలుడు. చేతికీ, కాలికీ చిన్న చిన్న గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ ప్రాంతంలో నెల వ్యవధిలో ఇలాగే మొసలి దాడిలో ఇద్దరు చనిపోయారట. ఆయుధాలు ఏమీ లేకున్నా... గుండె నిబ్బరంతో ఉత్త చేతులతో మొసలిని దాని స్థానబలమున్న నీటిలోనే ఓడించిన ఓం ప్రకాశ్‌ సాహో... నిజంగా బాహుబలే కదూ!








ఆకాశంలో భవంతి!

పూర్వం అవంతికాపురాన్ని విజయేశ్వర వర్మ పాలిస్తుండేవాడు. ఒక రోజు ఆయనకు కలలో ఆకాశంలో తేలుతూ అందమైన భవనం కనిపించింది.  మరుసటి రోజు సభలో తనకొచ్చిన కలను వివరించాడు రాజు. దాన్ని నిజం చేయాలని ఆదేశించాడు. సభలోని వారంతా... ‘గాలిలో తేలే భవంతి కట్టడం అసాధ్యం కదా!’ అని రాజుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘అదంతా నాకు అనవసరం. మీరేం చేస్తారో నాకు తెలియదు... కానీ నా కల నిజమవ్వాలి అంతే!’ అని ఆయన తేల్చిచెప్పాడు. దాంతో మంత్రితో సహా అక్కడి వారందరూ నిర్ఘాంతపోయారు. కొన్ని రోజులకు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో అతి కష్టమ్మీద కర్ర సాయంతో నడుస్తున్నాడు. ‘నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి’ అని రాజును కోరాడు. ‘నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు. తప్పకుండా నీకు న్యాయం చేస్తా’ అని విజయేశ్వర వర్మ హామీ ఇచ్చాడు. ‘ప్రభూ...! నా వెయ్యి బంగారు నాణేలు ఒకరు దొంగిలించుకుపోయారు. అతడెవరో నాకు తెలుసు. నా నాణేలు నాకు ఇప్పించండి’ అని ఆ వృద్ధుడు విన్నవించాడు. ‘ఈ దొంగతనం ఎవరు చేశారు?’ అని ప్రశ్నించాడు రాజు. ‘మీరే ప్రభూ! నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే ఇదంతా చేశారు’ అన్నాడా ముసలి వ్యక్తి. రాజుకు చాలా ఆగ్రహం వచ్చింది. ‘ఏమిటీ వెటకారం! కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా?’ అని కోప్పడ్డాడు. ఆ మాట విన్న వృద్ధుడు... తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి నిలుచున్నాడు. తీరా చూస్తే అతడు మంత్రి చంద్రశేఖరుడు. ‘క్షమించండి స్వామీ... మీకు కలలో వచ్చిన గాల్లో తేలే భవంతిని నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేయాల్సి వచ్చింది’ అంటూ వివరణ ఇచ్చాడు మంత్రి. విజయేశ్వర వర్మకు కోపం తగ్గి నవ్వొచ్చింది. ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా చెప్పిన చంద్రశేఖరుణ్ని అభినందించి, తగిన బహుమతులూ ఇచ్చి సత్కరించాడు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..