సిసింద్రీ

హాయ్‌ ఫ్రెండ్స్‌... మీకు అట్లాస్‌ గురించి తెలిసే ఉంటుంది. మరి వీఆర్‌ అట్లాస్‌ గురించి విన్నారా? అదే నేస్తాలూ...! వర్చువల్‌ రియాల్టీ అట్లాస్‌ అన్నమాట. ఈ సెట్‌లో ఒక పుస్తకం, వీఆర్‌ కిట్‌, డైనోసర్‌ ఫాజిల్‌ మోడల్‌ ఉంటాయి.

Updated : 26 Jun 2022 01:00 IST

సిసింద్రీ

అదిరిపోయే అట్లాస్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌... మీకు అట్లాస్‌ గురించి తెలిసే ఉంటుంది. మరి వీఆర్‌ అట్లాస్‌ గురించి విన్నారా? అదే నేస్తాలూ...! వర్చువల్‌ రియాల్టీ అట్లాస్‌ అన్నమాట. ఈ సెట్‌లో ఒక పుస్తకం, వీఆర్‌ కిట్‌, డైనోసర్‌ ఫాజిల్‌ మోడల్‌ ఉంటాయి. ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో ‘వీఆర్‌ అట్లాస్‌’ ఆప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆప్‌ ఓపెన్‌ చేసిన తర్వాత వీఆర్‌, ఏఆర్‌, హైబ్రిడ్‌ మోడ్‌లుంటాయి. హైబ్రిడ్‌ మోడ్‌ను ఎంచుకుని స్మార్ట్‌ఫోన్‌ను వీఆర్‌ కిట్‌లో అమర్చుకోవాలి. ఇప్పుడు అందులోంచి అట్లాస్‌ను చూస్తే ప్రాంతాలూ, కట్టడాలూ త్రీడీ ఎఫెక్ట్‌తో కనిపిస్తాయి. కొన్ని ఎంపిక చేసిన దృశ్యాలూ ప్లే అవుతాయి. అవి మనం ప్రత్యక్షంగా ఆ ప్రాంతంలో ఉన్నామన్న అనుభూతిని కలిగిస్తాయి. డైనోసర్‌ ఫాజిల్‌ మోడల్‌ కూడా ఈ కిట్‌లో వస్తుందని చెప్పుకున్నాం కదా.. దాంతో ప్రాక్టికల్‌గా డైనోసర్‌ ఫాజిల్స్‌ గురించి కూడా తెలుసుకోవచ్చు.



భలే.. భలే.. సేనాని!

సింహపురి రాజ్యానికి జయశేఖరుడు రాజు. ఇదే రాజ్యంలో గోపీనాథుడు అనే అమాయకుడు ఉండేవాడు. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు, రాజు పర్యవేక్షిస్తున్న సైనిక ఎంపికకు హాజరయ్యాడు.  గోపీనాథుడికి దేహదారుఢ్యం లేదు.. కనీస యుద్ధ విద్యలూ రావు. ప్రతి పరీక్షలోనూ విఫలమయ్యాడు. చివరిగా బల్లెం విసిరే పోటీ జరిగింది. అన్నింట్లో ఓడిపోయి అవమాన భారంతో ఉన్న గోపీనాథుడు తన బలాన్నంతా కూడగట్టి కసిగా బల్లెం విసిరాడు. అది ఆకాశంలో చాలా ఎత్తుకు వెళ్లింది. అప్పుడే ఓ ముసుగు వ్యక్తి కత్తి తీసుకుని రాజు మీదకు దూకాడు. అదే సమయానికి గోపీనాథుడు విసిరిన బల్లెం గురి తప్పి ఆ ముసుగు వ్యక్తి భుజానికి దిగింది. అప్రమత్తమైన అంగరక్షకులు ఆ ముసుగు మనిషిని బంధించారు. బల్లెం విసిరిన గోపీనాథుడిని తన అంగరక్షకుల్లో ఒకడిగా నియమించాడు రాజు. ఓ రోజు రాజు తనకెంతో ఇష్టమైన పాయసాన్ని తాగాలనుకొని పాత్రను పట్టుకున్నాడు. అప్పుడే వచ్చిన గోపీనాథుడు.. నమస్కరించాలన్న ఉద్దేశంతో ‘మహారాజా!’ అని గట్టిగా అరిచాడు.

దెబ్బకు రాజు హడలిపోయి, చేతిలో ఉన్న పాత్రను జారవిడవడంతో పాయసమంతా నేలపాలైంది. ఇంతలోనే పెంపుడు పిల్లి దాన్ని తాగి కళ్లు తేలేసింది. రాజుకు విషయం అర్థమైంది. విషప్రయోగం నుంచి తనను కాపాడిన గోపీనాథుడికి పదోన్నతి కల్పించాడు. ఇందులో తన గొప్పతనం ఏమీ లేదని చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఒకరోజు రాజు వేటకు వెళ్లాడు. సరదాగా గోపీనాథుడు బాణం సంధిస్తే... పక్కనే పొదలో నక్కి రాజు గుర్రం మీదకు దూకబోయిన పెద్దపులి గుండెల్లోకి దిగింది. మరోసారి తనను కాపాడిన గోపీనాథుడిని.. సేనానిగా ప్రకటించాడు రాజు. ఇప్పటికైనా నిజం చెప్పకపోతే అనర్థాలు తప్పవని.. జరిగిన విషయాలన్నీ రాజుకు వివరించాడు గోపీనాథుడు. అతడి నిజాయతీ నచ్చడంతో ‘యుద్ధ విద్యలేవీ రాకుండానే నన్ను ఇన్నిసార్లు కాపాడావు. ఫర్వాలేదు అన్నీ నేర్చుకో’ అన్నాడు రాజు. గోపీనాథుడూ రాజు నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొద్దిరోజుల్లోనే విద్యలన్నీ నేర్చుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక తిరిగి సేనానిగా నియమితుడయ్యాడు. సింహపురి పేరు చెబితేనే శత్రువులు వణికిపోయేలా రాజ్యానికి రక్షణగా నిలిచాడు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..