సముద్రాన్నే ఈదేశాడు!

వయసు కేవలం పద్నాలుగు సంవత్సరాలు. పైగా మానసిక వైకల్యం... అయినా వెనకడుగు వేయలేదు... సముద్రాన్నే ఈదేశాడు. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించేశాడు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శ్యామ్‌ విలాస్‌ పాటిల్‌... ఇటీవల ఎలిఫెంటా గుహల నుంచి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వరకు అరేబియా సముద్రంలో దాదాపు 14 కిలోమీటర్ల

Updated : 31 Jul 2022 09:41 IST

సముద్రాన్నే ఈదేశాడు!

యసు కేవలం పద్నాలుగు సంవత్సరాలు. పైగా మానసిక వైకల్యం... అయినా వెనకడుగు వేయలేదు... సముద్రాన్నే ఈదేశాడు. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించేశాడు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శ్యామ్‌ విలాస్‌ పాటిల్‌... ఇటీవల ఎలిఫెంటా గుహల నుంచి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వరకు అరేబియా సముద్రంలో దాదాపు 14 కిలోమీటర్ల దూరాన్ని సునాయాసంగా ఈదేశాడు. ఇందుకోసం అతడికి నాలుగు గంటల తొమ్మిది నిమిషాలు పట్టింది. దీంతో శ్యామ్‌ పేరు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో నమోదైంది. అంతకు ముందు తనకు 10 సంవత్సరాలున్నప్పుడు సముద్రంలో అయిదు కిలోమీటర్ల దూరం ఈదిన రికార్డూ ఉంది. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లోనూ పలు బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. 2018లో ‘రాష్ట్రపతి అవార్డు’నూ పొందాడు. ‘ప్రధానమంత్రి బాల పురస్కారం-2022’నూ సొంతం చేసుకున్నాడు. మన ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలూ, ఆశీర్వాదాలూ అందుకున్నాడు.


వరదయ్య తెలివి!

రామాపురంలో సూరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అవసరం ఉన్నా లేకపోయినా... తెగ అప్పులు చేసేవాడు. న్యాయాధికారి దగ్గర నుంచి కూలీల వరకు ఎవరినీ వదలకుండా... అందరి దగ్గరా రకరకాల కారణాలు చెప్పి డబ్బులు తీసుకునేవాడు. అయితే తన దగ్గర డబ్బులు ఉన్నా, అప్పులు తీర్చేవాడు కాదు. ఎవరైనా నిలదీస్తే, ఏవో మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు. అప్పిచ్చిన వారు అడిగీ అడిగీ చివరకు విసుగొచ్చి, వాళ్లే వదిలేసేవారు. ఓసారి సూరయ్య... ఊరికి కొత్తగా వచ్చిన వరదయ్యను డబ్బు అప్పుగా అడిగాడు. సూరయ్య గురించి పూర్తిగా తెలియని అతడు, డబ్బులు ఇచ్చాడు. కానీ ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించలేదు. తాను కష్టపడి సంపాదించిన సొమ్ము పోగొట్టుకోవడం వరదయ్యకు ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా సరే.. తన డబ్బులు తాను తిరిగి పొందాలనుకున్నాడు. సూరయ్య తనలా చాలా మందికి డబ్బులు ఎగవేసినట్లు తెలుసుకున్నాడు. ఎలాగైనా సరే అతడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. సూరయ్య అందరి డబ్బులూ తిరిగి ఇచ్చేసి, తీర్థయాత్రలకు వెళ్లబోతున్నట్లు గ్రామంలో ఓ వార్త గుప్పుమంది. అప్పు ఇచ్చిన వారంతా అతడి ఇంటి ముందు గుమిగూడారు. ఒకేసారి అంత మంది ఇంటి మీదకు వచ్చేసరికి సూరయ్యకు గుండె ఆగినంత పనైంది. ఎంత సర్దిచెప్పినా వారు వినలేదు. అప్పు తీర్చాల్సిందేనని భీష్మించారు. చేసేది లేక, అప్పటికప్పుడు అందరి బాకీ తీర్చాడు సూరయ్య. వరదయ్యకూ డబ్బు ఇచ్చేశాడు. తాను తీర్థయాత్రలకు వెళ్లబోతున్నట్లు పుకారు సృష్టించింది ఎవరో మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఈ విషయం ఊర్లో వాళ్లకూ తెలియదు... ఒక్క వరదయ్యకు తప్ప! సూరయ్య ఎప్పుడు ఊరు వదిలిపోతాడో తెలియక... ఆరోజు నుంచి ఎవరూ అతడికి అప్పు ఇవ్వలేదు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..