Updated : 07 Aug 2022 01:18 IST

గిరగిరా.. బుడగలే బుడగలు!

బుడగలు అంటే మనలాంటి పిల్లలకు భలే ఇష్టం కదూ! అలాగే గాల్లోకి ఎగిరే బొమ్మలన్నా మనం ఆసక్తి చూపుతాం. మరి అవి రెండూ ఒకే బొమ్మలో ఉంటే... ‘అయ్య.. బాబోయ్‌! ఇంకా ఏమైనా ఉందా!’ అని ఎగిరి గంతులేస్తాం కదా! ‘బాంబూ డ్రాగన్‌ ఫ్లై బబుల్‌ మెషీన్‌’ అలాంటిదే. ఈ బొమ్మలో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. రెక్కలున్న భాగం గాల్లోకి ఎగురుతూ బుడగలు వెదజల్లుతుంది. రెండో భాగం మొదటి భాగాన్ని గాల్లోకి ఎగిరేలా చేస్తుంది. ముందుగా బుజ్జి పిల్లి ముఖం ఆకృతిలో ఉన్న భాగంలో సోప్‌ వాటర్‌ను నింపుకోవాలి. తర్వాత రెక్కలున్న భాగాన్ని అమర్చాలి. ఇప్పుడు బబుల్‌ మెషీన్‌కున్న బటన్‌ను నొక్కాలి... అంతే..! రెక్కలున్న భాగం అమాంతం గాల్లోకి ఎగురుతుంది. అప్పుడు దానికున్న కాళ్లవంటి నిర్మాణాల నుంచి బుడగలు బయటకు వస్తాయి. ఇలా ఈ బొమ్మతో ఇన్‌డోర్‌లోనూ, అవుట్‌డోర్‌లోనూ చక్కగా ఆడుకోవచ్చు. దీనికి బ్యాటరీలూ అవసరం లేదు.భలే గుణపాఠం!

రామాపురంలో పరంధామయ్య అనే జమీందారు ఉండేవాడు. ఆయన దానధర్మాలు ఎక్కువగా చేస్తుండేవాడు. ఓరోజు జమీందారు దగ్గరకు శీనయ్య వచ్చి.... ‘అయ్యా! పేదవాడినైన నాకు ఉపాధి చూపించరూ?’ అని అడిగాడు. జమీందారు అతడికి ఓ ఆవును దానంగా ఇచ్చాడు. కానీ మర్నాడు మళ్లీ వచ్చి.... ‘అయ్యా... మీరు నాకు ఆవునిచ్చారు. దాన్ని ఉంచడానికి మా దగ్గర సరైన వసతి లేదు’ అన్నాడు. పశువుల పాక వేసుకోమని చెప్పి... జమీందారు కొంత ధనాన్ని శీనయ్యకు ఇచ్చి పంపించాడు. మరో రెండు రోజుల తర్వాత శీనయ్య వచ్చి.... ‘అయ్యా.... ఆవుకు మేత ఎలా కొనాలో అర్థం కావడం లేదు’ అని వాపోయాడు. ఆవుకు కావాల్సిన దాణా, గడ్డీ తన ఇంటి నుంచే తీసుకు వెళ్లమన్నాడు జమీందారు. వారం తర్వాత శీనయ్య మళ్లీ వచ్చి.... ‘మేం ఇంతకు ముందు భిక్షాటన చేసుకుని బతికేవాళ్లం. ఇప్పుడు ఆవుకు చాకిరీ చెయ్యడం, ఇంట్లో వండుకోవడం మాకు కష్టంగా ఉంది’ అన్నాడు. ‘సరే, మీకు శ్రమ లేకుండా పనివాళ్లను పంపిస్తా’నన్నాడు. చెప్పినట్లుగానే... ఓ పని మనిషినీ, ఓ వంట మనిషినీ పంపించాడు. నాలుగు రోజుల తర్వాత శీనయ్య మళ్లీ జమీందారు దగ్గరకొచ్చాడు. ‘అయ్యా... ఇప్పుడున్న ఇల్లు నాకూ, నా భార్యకే సరిపోవడం లేదు. ఇప్పుడు ఇద్దరు పనివాళ్లూ వస్తున్నారు. కాబట్టి నాకో పెద్ద ఇల్లు ఇప్పించండి’ అన్నాడు. ‘సరేలే...
నీ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాను’ అని జమీందారు శీనయ్యకు చెప్పి పంపించాడు. తెల్లవారే సరికి... శీనయ్య ఇంటి ముందు పశువుల పాకలో ఆవు లేదు. పనివాళ్లూ రాలేదు. శీనయ్య వెంటనే జమీందారు దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి జరిగింది చెప్పాడు. ‘అవును శీనయ్యా...
నీ ఇల్లు చిన్నది కదా... పనివాళ్లు వస్తే ఇబ్బంది అని, వాళ్లను మానిపించాను. వాళ్లే లేనప్పుడు ఆవు బాగోగులు ఎవరు చూస్తారని దాన్నీ ఇక్కడికే తెప్పించాను’ అన్నాడు. అత్యాశకు పోతే మొదటికే మోసం వచ్చిందని శీనయ్యకు అర్థమై, జమీందారు కాళ్ల మీద పడ్డాడు. తన పొరపాటును మన్నించమన్నాడు. దానం ఇచ్చినవి, తిరిగి తీసుకునేంత సంకుచిత మనస్తత్వం తనకు లేదనీ, పనివాళ్లు ఆ ఆవును పక్కన ఉన్న అడవిలోకి మేతకు తీసుకెళ్లారనీ చెప్పిన జమీందారు ఇక నుంచైనా కష్టపడి బతకడం అలవాటు చేసుకోమని శీనయ్యను మందలించి, పంపించాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని