Published : 17 Sep 2022 23:56 IST

సిసింద్రీ

పుస్తకాలే... పుస్తకాలు!

హాయ్‌ నేస్తాలూ... చిన్నారులమైన మనకు ఆటపాటలతోపాటు పుస్తకాలన్నా భలే ఇష్టం కదూ! ‘ఆఁ!! బుక్సా?’ అని డీలా పడకండి. తరగతి పుస్తకాలు కాదు ఫ్రెండ్స్‌... కథల పుస్తకాలు. ఇవంటే మనకు కచ్చితంగా ఇష్టం ఉంటుంది. మన దగ్గర ఇప్పటికే కొన్ని ఉండి ఉంటాయి. కానీ https://www.getepic.com/in/ ఈ వెబ్‌సైట్‌లో బోలెడన్ని పుస్తకాలున్నాయి. వీడియోగేమ్స్‌, స్మార్ట్‌ఫోన్స్‌తో సమయం వృథా చేసుకునే బదులు కాసేపు పుస్తకాలు చదివితే భలే ఉంటుంది తెలుసా... వినోదానికి వినోదం, విజ్ఞానానికి విజ్ఞానం. అవార్డ్‌ విన్నర్స్‌, నాన్‌ఫిక్షన్‌, క్యాట్స్‌ అండ్‌ డాగ్స్‌... ఇలా పలు విభాగాల్లో పుస్తకాలున్నాయి. మనకు కావాల్సిన పుస్తకాన్ని ఎంచుకుని, ఎంచక్కా ఆన్‌లైన్‌లోనే చదువుకోవచ్చు. ‘ఆ... ఎంతసేపని చదువుతాం’ అని నిరుత్సాహపడకండి. ఎందుకంటే ఇందులో ఆడియో బుక్స్‌ కూడా ఉన్నాయి. అంటే... చదవడం విసుగ్గా అనిపించినప్పుడు పుస్తకాలను హాయిగా వినొచ్చన్నమాట.


అతితో అనర్థం!

యమునా నదీ తీరాన ఉన్న గురుకులంలో వేల సంఖ్యలో విద్యార్థులుండేవారు. ఆ గురుకులం సత్యానందుడిది. ఇక్కడున్న విద్యార్థులందరిలో ప్రదీపుడు చాలా చురుకైనవాడు. కేవలం చదువులోనే కాదు... ఆటపాటల్లోనూ ముందుండేవాడు. కానీ అవసరానికంటే చాలా ఎక్కువ మాట్లాడేవాడు. ఈ విషయాన్ని సత్యానందుడు గ్రహించినా... ఏదో ఒక రోజు ప్రదీపుడే గుర్తించి, సరిచేసుకుంటాడని అనుకున్నాడు. ఇలా రోజులు గడిచాయి. ప్రదీపుడి విద్య పూర్తి కావొచ్చింది కానీ అప్పటికీ అతిగా మాట్లాడటం తగ్గించుకోలేదు. ఎలాగైనా అతడిలో మార్పు తేవాలనుకున్నాడు సత్యానందుడు. ఒకరోజు గురుకులంలో ఉన్న మొక్కలకు ప్రదీపుడు నీళ్లు పడుతున్న సమయంలో గురువు పలకరించాడు. మాటల మధ్యలో... మితంగా మాట్లాడటం గొప్పవారి లక్షణాల్లో ఒకటని చెప్పాడు. ‘మేధావులూ, విజ్ఞానవంతులూ తమ మాటలూ, ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం కలిగించాలి కదా... మాట్లాడకుంటే ఎలా గురువు గారూ... అయినా కొలతలేసుకుని మాట్లాడటం సాధ్యమవుతుందా... పైగా మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిగా ఎదగాలనే నా ధ్యేయం’ అని తన అనుమానాన్ని వెలిబుచ్చాడు. అందుకు గురువు చిరునవ్వు నవ్వి... ‘బావిలోని కప్పలు ఎప్పుడూ బెకబెక అని అరుస్తూనే ఉంటాయి. కానీ, అవి చేసే శబ్దాలతో ఎవరికీ పెద్దగా ఉపయోగం ఉండదు. అసలు వాటిని పట్టించుకోనే పట్టించుకోరు. అదే కోడిపుంజును చూడు... వేకువజామునే తన కూతతో ఊరందరినీ మేల్కొలుపుతుంది. మనం ఎంత ఎక్కువగా మాట్లాడాం అనే దానికంటే... ఎంత పనికి వచ్చేలా మాట్లాడాం అనేదే ప్రధానం. సాధనతో ఏదైనా సాధ్యమే. మాట్లాడే ముందు కాసేపు ఆలోచిస్తే, అనవసరపు మాటలు నోరు దాటి బయటకు రావు. ఎన్నో ఉపద్రవాలకు అనవసరపు మాటలే కారణం’ అని ప్రదీపుడికి వివరంగా చెప్పాడు సత్యానందుడు. గురువు మాటల్లోని వాస్తవం అర్థమైన ప్రదీపుడు అప్పటి నుంచీ అవసరం అయితేనే మాట్లాడేవాడు. తక్కువ మాట్లాడుతూనే గొప్ప వక్తగా పేరు సంపాదించుకున్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని