Published : 25 Sep 2022 00:23 IST

సిసింద్రీ

నేలైనా.. గోడైనా.. రయ్‌.. రయ్‌!

హాయ్‌ నేస్తాలూ! మీరు రిమోట్‌ కారుతో ఆడుకునే ఉంటారు. మరి జీరో గ్రావిటీ లేజర్‌ రేసర్‌ గురించి తెలుసా! ఈ కారు బొమ్మ కేవలం నేల మీదే కాదు.. గోడల మీద కూడా పరుగులు పెట్టగలదు. అంతెందుకు పై కప్పు మీద కూడా నడవగలదు. అంటే అచ్చంగా స్పైడర్‌ మ్యాన్‌ గోడలపై పాకినట్లుగా! ఈ కారుతో పాటు ఓ లేజర్‌ గన్‌ వస్తుంది. ఈ చిన్ని గన్‌లోనే కారును కంట్రోల్‌ చేసే లేజర్‌ ఉంటుంది. ఈ గన్‌లో మూడు బ్యాటరీలుంటాయి. అలాగే కారులోనూ ఛార్జబుల్‌ బ్యాటరీ ఉంటుంది. కారు వెనక భాగంలో పవర్‌ బటన్‌, పవర్‌ మోడ్‌, నార్మల్‌ మోడ్‌ ఉంటాయి. లేజర్‌ గన్‌ను ఆన్‌చేసి కారుపై గురి పెడితే చాలు.. కారు దూసుకుపోతుంది. లేజర్‌గన్‌కు, కారుకు మధ్య ఆరు అడుగుల వరకు దూరం ఉండొచ్చు. అంటే మనం కారును ఆరడుగుల దూరం వరకు లేజర్‌గన్‌తో కంట్రోల్‌ చేయొచ్చు అన్నమాట. గోడ, పైకప్పుల మీద నడిపించేటప్పుడు పవర్‌ మోడ్‌, నేలపై ఆడుకునేటప్పుడు నార్మల్‌ మోడ్‌లో కారును నడిపించాల్సి ఉంటుంది. ఈ జీరో గ్రావిటీ లేజర్‌ కారు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. 


మూడు మాటలు!

పూర్వం శాకుంతల రాజ్యంలో సదానందుడు అనే పండితుడి గురుకులం ఉండేది. అక్కడ కొన్ని వందల మంది విద్యనభ్యసించేవారు. దేవదత్తుడనే విద్యార్థి మాత్రం దేనిలోనూ ప్రావీణ్యం సాధించలేకపోయాడు. చివరగా సదానందుడు, దేవదత్తుణ్ని పిలిచి... ‘నాయనా... నీకు విద్యలు అబ్బలేదు అని బాధపడకు. ఓ మూడు మాటలు చెబుతాను. అడుగూ అడుగూ కలిస్తే గమ్యం దగ్గరవుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కష్టపడితే ఫలితం దక్కుతుంది. వీటిని అనుసరించు. నీకు మంచే జరుగుతుంది’ అని హితబోధ చేశాడు. గురుకులం నుంచి బయటకు వెళ్లగానే దేవదత్తుడికి రాజధానికి వెళ్లాలనిపించింది. కానీ తన దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు. దాంతో అయిదు రోజులు నడిచి రాజధానికి చేరుకున్నాడు. అప్పుడు దేవదత్తుడికి గురువు చెప్పిన... ‘అడుగూ అడుగూ కలిస్తే గమ్యం దగ్గరవుతుంది’ అన్నమాట నిజమే అనిపించింది. అక్కడే ఏదో ఉపాధి చూసుకోవాలనుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వలేదు. నాకిక్కడ ఎవరూ పరిచయం లేదు. పని ఎవరిస్తారు... అని బాధపడ్డాడు. కానీ తన మాట తీరు మంచిగా ఉండటం వల్ల పెద్దగా కష్టపడకుండానే, ఓ దుకాణంలో పని దొరికింది. గురువు చెప్పిన మాట... ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనేదీ వాస్తవమే అనిపించింది. దుకాణంలో నమ్మకంగా, శ్రద్ధగా, నిజాయతీగా పనిచేస్తుండటంతో... యజమానికి దేవదత్తుడి మీద నమ్మకం కుదిరింది. వ్యాపారం మొత్తం దేవదత్తుడికి అప్పగించి ఊపిరి పీల్చుకున్నాడా యజమాని. తక్కువ సమయంలోనే వ్యాపారం రెట్టింపైంది. ఇలాంటి వ్యాపారదక్షత ఉన్న వ్యక్తిని వదులుకోవడం ఆ దుకాణ యజమానికి ఇష్టం లేదు. తనకు ఉన్నది ఒకే ఒక ఆడపిల్ల. అందుకే ఆమెను దేవదత్తుడికిచ్చి వివాహం చేశాడు. అలా కొన్ని నెలల్లోనే వ్యాపారం మరింత విస్తరించింది. ‘కష్టపడితే ఫలితం దక్కుతుంది’ అని సదానందుడు చెప్పిన మూడో మాట కూడా నిజమేననుకున్నాడు. తన శిష్యుడి ప్రయోజకత్వం తెలిసి గురువు కూడా చాలా సంతోషించాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని