చల్లచల్లని ఐస్‌క్రీం..!

మనకు ఐస్‌క్రీం అంటే భలే ఇష్టం కదూ! మరి అది ఎలా పుట్టిందో దాని సంగతులేంటో తెలుసుకుందామా. మొట్టమొదటి ఐస్‌క్రీంను తయారు చేసింది చైనావాళ్లు. సుమారు నాలుగువేల ఏళ్ల క్రితం చైనా చక్రవర్తి మందిరంలో ఓ వంటవాడు ఒకరోజు పళ్లు, పళ్లరసాలు, మంచుగడ్డలతో ఓ చల్లని పదార్థాన్ని తయారు చేసి ఇచ్చాడు.

Published : 01 Oct 2022 23:27 IST

చల్లచల్లని ఐస్‌క్రీం..!

నకు ఐస్‌క్రీం అంటే భలే ఇష్టం కదూ! మరి అది ఎలా పుట్టిందో దాని సంగతులేంటో తెలుసుకుందామా. మొట్టమొదటి ఐస్‌క్రీంను తయారు చేసింది చైనావాళ్లు. సుమారు నాలుగువేల ఏళ్ల క్రితం చైనా చక్రవర్తి మందిరంలో ఓ వంటవాడు ఒకరోజు పళ్లు, పళ్లరసాలు, మంచుగడ్డలతో ఓ చల్లని పదార్థాన్ని తయారు చేసి ఇచ్చాడు. ఐస్‌క్రీంకు దీన్నే తొలిరూపంగా చెప్పుకోవచ్చు. అలాగే పూర్వకాలంలో చైనాలో అన్నం, పాలను మంచుతో కలిపి చేసిన పదార్థాలను వీధుల్లోనూ అమ్మేవారట. రెండు వేల ఏళ్ల క్రితం రోమ్‌ చక్రవర్తి నీరో... పళ్లు, తేనెను మంచుతో కలిపి తినేవాడట. చైనా నుంచి ఐస్‌క్రీం ఇటలీకి చేరుకోవడానికి ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. ప్రపంచ పర్యటనకు బయలుదేరిన మార్కోపోలో వస్తూవస్తూ 13వ శతాబ్దంలో ఐస్‌క్రీం తెచ్చి రోమన్లకు రుచి చూపించాడట. ఇప్పుడు కాసేపు అమెరికాకు వెళదాం! అక్కడ జాకబ్‌ ఫస్సెల్‌.. పాల మీగడ, మంచుతో పెద్దఎత్తున ఐస్‌క్రీంలు తయారు చేయించాడు. ఇదంతా 1851లో జరిగింది. దీన్నే మొదటి ఐస్‌క్రీం ఫ్యాక్టరీగా పిలుచుకోవచ్చు. భలే ఉన్నాయి కదూ ఐస్‌క్రీం సంగతులు. ఇదంతా చదివాక మీకూ నోరూరుతోంది కదా! ఇంకేం మీరూ ఎంచక్కా ఐస్‌క్రీంను లాగించేయండి సరేనా!


పిరికి జింక!

వనంలో ఒక జింక ఉండేది.  అది సీతాకోక చిలుకను చూసినా బెదిరిపోయేది. అందుకే జంతువులన్నీ దాన్ని ‘పిరికి జింక’ అని ఏడిపించేవి. జింక ఈ వెక్కిరింతలు భరించలేకపోయింది. అందుకే ఒకరోజు ఎలాగో ధైర్యం తెచ్చుకుని తన సమస్యకు పరిష్కారం చూపించమని తాబేలును అడిగింది.  ‘నీకన్నా చిన్న జంతువులకు నువ్వు భయపడాల్సిన పనిలేదు. అలా అని వాటిని చులకనగా చూడొద్దు. నీతో సమానమైన వాటితో స్నేహంగా ఉండు. హాయిగా నవ్వుతూ వాటిని పలకరించు. పెద్ద జంతువులతో వినయంగా ఉండు.  వీటిని పాటిస్తే నిన్ను ఎవ్వరూ పిరికిపంద అనరు’ అని చెప్పింది తాబేలు. దానికి కృతజ్ఞతలు చెప్పి, అక్కడి నుంచి  వెళ్లిపోయింది జింక. దారిలో దానికొక కుందేలు కనిపించింది. ‘మిత్రమా బాగున్నావా?’ అని  పలకరించింది. ‘ఎప్పుడూ నన్ను చూడగానే భయంతో పారిపోయే ఈ జింక ఏంటి ఈ రోజు ఇలా పలకరిస్తోంది!’ అనుకుంది కుందేలు. ‘నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు కదా!’ అని సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్లింది కుందేలు. జింక చెరువు వైపు నడిచింది. అక్కడ కొంగల గుంపును చూసి... ‘మిత్రులారా... మీరు పాలలాగా స్వచ్ఛమైన రంగులో ఉన్నారు. మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా... కానీ మీతో నాకు స్నేహం లేకపోవడం బాధాకరం’ అంది.  అవి నవ్వుతూ మాట కలిపాయి. అక్కడి నుంచి బయలుదేరిన జింకకు ఏనుగు ఎదురైంది. ‘ఏనుగన్నా... బాగున్నారా?’ అని వినయంగా దాన్ని పలకరించింది. జింక తనను అంత వినయంగా పలకరించేసరికి ఏనుగు పులకరించిపోయింది. వెంటనే తన చాటంత చెవులూపుతూ... ‘బాగున్నాను... జింకా... నువ్వెలా ఉన్నావు?’ అని సమాధానం ఇచ్చింది. ‘మీలాంటి గజరాజులు ఈ అడవికి రక్షణగా ఉండగా... మాకెందుకు బెంగ’ అంది జింక. దీంతో ఏనుగు మరింతగా పొంగిపోయింది. ఇలా అడవి జంతువులన్నింటితో జింకకు స్నేహం ఏర్పడింది. తనలోని పిరికితనాన్ని పోగొట్టి, జీవులన్నింటితో స్నేహం ఏర్పడేలా చేసిన తాబేలుకు కృతజ్ఞతలు చెప్పింది జింక.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..