చూపిస్తూ.. చెరిపేస్తుంది..!

హాయ్‌ నేస్తాలూ! మీ జామెట్రీబాక్స్‌లో ఏం ఉన్నా లేకున్నా... ఎరేజర్‌ కచ్చితంగా ఉంటుంది కదూ! అది కూడా రంగురంగులతో, పండ్లు, మిఠాయిలు, కామిక్‌ పాత్రల ఆకారాల్లో. కానీ మీకు ట్రాన్సపరెంట్‌ ఎరేజర్‌ గురించి తెలుసా.

Published : 22 Oct 2022 23:41 IST

చూపిస్తూ.. చెరిపేస్తుంది..!

హాయ్‌ నేస్తాలూ! మీ జామెట్రీబాక్స్‌లో ఏం ఉన్నా లేకున్నా... ఎరేజర్‌ కచ్చితంగా ఉంటుంది కదూ! అది కూడా రంగురంగులతో, పండ్లు, మిఠాయిలు, కామిక్‌ పాత్రల ఆకారాల్లో. కానీ మీకు ట్రాన్సపరెంట్‌ ఎరేజర్‌ గురించి తెలుసా. దీన్ని జపాన్‌కు చెందిన ఓ కంపెనీ అభివృద్ధి చేసింది. ఆ కంపెనీకి ఈ ఆలోచన వచ్చిన అయిదు సంవత్సరాల తర్వాత కానీ ఈ ఎరేజర్‌ను తయారు చేయలేకపోయింది. ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాతే అనుకున్న ఫలితం వచ్చింది. ప్రత్యేక పదార్థంతో తయారైన ఈ ఎరేజర్‌ పారదర్శకంగా ఉంటుంది. దీని వల్ల మనం కాగితం మీద ఏదైనా చెరిపేస్తూనే ఏం చెరిపేస్తున్నామో స్పష్టంగా చూడొచ్చు. హోంవర్క్‌ చేస్తున్నప్పుడో, క్లాస్‌ వర్క్‌ చేస్తున్నప్పుడో చెరపాల్సిన దాని కన్నా.. ఎక్కువ చెరిపేయడం మనకు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది! ఈ మాత్రం ఇబ్బంది కూడా లేకుండా మనకు ఈ ఎరేజర్‌ ఉపయోగపడుతుందన్నమాట. కేవలం మనలాంటి విద్యార్థులకే కాదు, చిత్రకారులకూ ఈ ఎరేజర్‌తో ఎంతో ప్రయోజనం ఉంది. మొత్తానికి ఈ ట్రాన్సపరెంట్‌ ఎరేజర్‌ భలే ఉంది కదూ!


జ్ఞానోదయం!

శ్రద్ధానందుడు తన ఆశ్రమంలో ఎంతో మందికి విద్యాబుద్ధులు చెబుతుండేవాడు. వారిలో శ్రవణుడు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. ఓసారి శ్రద్ధానందుడు విషయం ఏంటని అడిగాడు. ‘గురువుగారూ.. నాకు ఎంతకూ తరగని సంపదలు కావాలి. మీరు చెబుతున్న విద్యల్లో ఏదీ నాకు పనికి వచ్చేలా కనిపించడం లేదు. నాకు ఇవన్నీ కాదు, కేవలం ధనం సంపాదించే విద్యలు మాత్రమే చెప్పండి చాలు’ అన్నాడు శ్రవణుడు. అప్పుడిక శ్రవణుడికి ఏం చెప్పినా వినడని శ్రద్ధానందుడు గ్రహించాడు. అందుకే... ‘తప్పక శ్రవణా.. ఇక్కడికి దూరంగా ఓ చోటుంది. అక్కడ నేర్పిస్తాను సరేనా! మధ్యలో అడవులూ, వాగులూ, వంకలూ దాటాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉండు’ అని హెచ్చరించాడు. దానికి శ్రవణుడు ‘ఓ.. తప్పకుండా గురువుగారూ’ అన్నాడు. మరుసటి రోజు ప్రయాణం ప్రారంభమైంది. కొంతదూరం వెళ్లాక ఓ అడవి వచ్చింది. దాన్ని దాటాక ఓ ఊరు వచ్చింది. అప్పటికే శ్రవణుడికి బాగా ఆకలి వేస్తోంది. ఇదే విషయాన్ని గురువుగారితో చెప్పాడు. శ్రద్ధానందుడు శ్రవణుణ్ని ఓ విందుకు తీసుకెళ్లాడు. అక్కడ శ్రవణుడు కడుపునిండా తిన్నాడు. అప్పుడు శ్రద్ధానందుడు.. ‘అదేంటి అప్పుడే ఆపేశావు. ఇంకా తిను. మనం ఓ నాలుగైదు రోజులు ప్రయాణించి, పెద్ద ఎడారిని దాటాల్సి ఉంది’ అన్నాడు. ‘అమ్మో.. ఇక నా వల్ల కాదు. ఇప్పటికే కడుపు నిండా తిన్నా. అయినా ఏ రోజు తినాల్సింది ఆ రోజే.. అదీ కొద్దికొద్దిగానే తినగలం’ అన్నాడు శ్రవణుడు. దానికి గురువుగారు.. ‘మరి ధనం విషయంలోనూ ఎందుకు నువ్వు ఇలా ఆలోచించడం లేదు? ఏ రోజుకారోజు కష్టపడి సంపాదించుకోవడంలో తప్పేముంది. వీలైతే అందులో కాస్త పొదుపు చేసుకోవచ్చు. అత్యాశ మంచిది కాదు’ అని చెప్పాడు శ్రద్ధానందుడు. ‘గురువుగారూ.. మీరు నా కళ్లు తెరిపించారు. నాకు ధనం సంపాదించే విద్యలేమీ వద్దు. విజ్ఞానాన్ని పంచే విద్యలు బోధించండి చాలు. పదండి ఆశ్రమానికే వెళదాం’ అని గురువుగారితో పాటు వెనుదిరిగాడు శ్రవణుడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..