సిసింద్రీ

పిల్లలూ... రేపు బాలల దినోత్సవం- అంటే, మన చాచా నెహ్రూ పుట్టిన రోజు కదా. ఆయనకి పిల్లలంటే ఇష్టమని మీకు తెలుసు కానీ ఒక పద్నాలుగేళ్ల పిల్లవాడు ఆయన్ని కాపాడిన సంగతి విని ఉండరు. ఆ విశేషాలు తెలుసుకుందామా మరి..!

Published : 13 Nov 2022 00:14 IST

సిసింద్రీ

నెహ్రూని కాపాడాడు..!

పిల్లలూ... రేపు బాలల దినోత్సవం- అంటే, మన చాచా నెహ్రూ పుట్టిన రోజు కదా. ఆయనకి పిల్లలంటే ఇష్టమని మీకు తెలుసు కానీ ఒక పద్నాలుగేళ్ల పిల్లవాడు ఆయన్ని కాపాడిన సంగతి విని ఉండరు. ఆ విశేషాలు తెలుసుకుందామా మరి..!

1957 అక్టోబరు 2న దిల్లీలో భారీ ఎత్తున రామ్‌లీలా కార్యక్రమం ఏర్పాటుచేశారు. అప్పటి ప్రధాని నెహ్రూతో పాటు పలువురు విదేశీ ప్రతినిధులు కూడా దానికి హాజరయ్యారు. వారంతా వీఐపీ విభాగంలో కూర్చుని ఉన్నారు. ఇంకా వేదిక మీద కార్యక్రమం మొదలవలేదు. నెహ్రూ ప్రసంగిస్తారని ప్రకటించగానే ప్రేక్షకులు ఆనందంతో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. వాటి తాలూకు నిప్పురవ్వలు అతిథులు కూర్చున్న చోట షామియానా మీద పడి మంటలు చెలరేగాయి. సభికులంతా కంగారుపడి అటూ ఇటూ పరుగులు తీశారు. బాయ్‌ స్కౌట్‌గా అక్కడ డ్యూటీలో ఉన్న హరీశ్‌ మెహ్రా వెంటనే స్పందించాడు. ఏమాత్రం భయపడకుండా నెహ్రూ చేయి పట్టుకుని గబగబా సురక్షితమైన చోటికి చేర్చాడు.

ఆ తర్వాత స్తంభం మీదికి ఎక్కి చేతులు కాలుతున్నా లెక్క చేయక తన జేబులో ఉన్న చిన్న కత్తితో మంటలు వ్యాపించకుండా షామియానాని కత్తిరించేశాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు స్కూల్లో హెడ్‌ మాస్టర్‌ హరీశ్‌ని పిలిచి ‘నువ్వు ప్రధానమంత్రిని కాపాడినందుకు ప్రభుత్వం నీకు గేలంట్రీ అవార్డు ప్రకటించింది’ అని చెప్పారు. ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు హరీశ్‌ చూపిన ధైర్యసాహసాల గురించి ప్రశంసాపత్రాన్ని ఇందిరాగాంధీ చదివి వినిపించగా, అతడి ధైర్యసాహసాలను తాను ప్రత్యక్షంగా చూశానని చెబుతూ నెహ్రూ అవార్డును అందజేశారు. అలా తొలి సాహస బాలుడి అవార్డు గ్రహీతగా, ప్రధానమంత్రిని రక్షించిన బాలుడిగా హరీశ్‌ చరిత్ర సృష్టించాడు.
పిల్లలది కల్మషం లేని స్వచ్ఛమైన మనసే కాదు, అవసరమైతే ప్రాణాలకు తెగించగల ధైర్యమూ వారి సొంతమేనని నిరూపించాడు. అందుకే చాచా నెహ్రూకి పిల్లలంటే అంత ఇష్టం మరి.


ఒకే మాట!

వంతీపురాన్ని శ్రీజయుడు పాలించేవాడు. ఓ రోజు ఉదయాన్నే లేచి తన చిన్నారి కుమారుడితో కలిసి గుర్రపుశాలకు వెళ్లాడు. అప్పుడు అక్కడ గంగయ్య అనే ఓ పనివాడు గుర్రం మాటవినడం లేదని దాన్ని చెర్నాకోలతో కొడుతున్నాడు. ‘గంగయ్యా! గుర్రాన్ని ఎందుకు అంతలా కొడుతున్నావ్‌?’ అని అడిగాడు శ్రీజయుడు. ‘దానికి మేతవేయడానికి వెళితే అది నన్ను తన్నబోయింది’ అన్నాడు గంగయ్య. ‘అయితే మాత్రం నోరులేని మూగజీవాన్ని అలా హింసించడం తప్పు కాదా?’ అని గంగయ్యను మందలించాడు మహారాజు. ‘తప్పైపోయింది మహాప్రభూ! ఈ ఒక్కసారికీ నన్ను మన్నించండి. ఇంకోసారి గుర్రాలను కొట్టను’ అని ప్రాధేయపడ్డాడు. గంగయ్య తమ గుర్రపుశాలలో కొన్ని సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు కాబట్టి రాజు కూడా క్షమించి వదిలేశాడు. కొద్దిరోజుల తర్వాత అలవాటుగా శ్రీజయుడు అడవికి వేటకెళ్లాడు. అక్కడ చాలా జంతువుల్ని వేటాడి చంపాడు. ఆయనతోపాటు వేటకు వెళ్లిన పరివారం వాటిని మోసుకొచ్చారు. విలువిద్యలో రాజుకు సాటిలేదనీ శ్రీజయుడు గొప్పవేటగాడనీ పొగిడారు. ఈ విషయాన్ని శ్రీజయుడి కుమారుడు గమనించాడు. వెంటనే ‘నాన్నగారూ... ఆరోజు మీరు గంగయ్య గుర్రాన్ని కొడుతుంటే మూగజీవిని హింసించడం పాపమన్నారు. మరి ఈ రోజు మీరు అమాయక ప్రాణులను వేటాడి వాటి ఊపిరి తీశారు. ఇది కూడా తప్పేగా?’ అని అడిగాడు. పరివారమంతా ఒక్కసారిగా బిత్తరపోయి మహారాజువైపు చూసింది. ఒక్కనిమిషం పాటు మౌనంగా ఉండిపోయిన శ్రీజయుడు.. ‘అవును.. నేను చేసింది ముమ్మాటికీ తప్పే. ఇక నుంచి నేను జంతువుల్ని వేటాడటం మానేస్తున్నా. నేనే కాదు, రాజ్యంలో ఇంకెవరూ సాధుజీవులను హింసించడానికి వీల్లేదు. ఇదే నా శాసనం’ అన్నాడు. ఈ నిర్ణయంతో రాజకుమారుడు ఎంతో సంతోషించాడు. తాను రాజయ్యాక కూడా ఇదే విధానాన్ని అవలంబించాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..