సిసింద్రీ

సిసింద్రీ

Published : 04 Dec 2022 00:28 IST

సిసింద్రీ

కుటుంబాన్ని కాపాడాడు!

ది ఓ ఉదయం. కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం కారులో దావణగెరె జిల్లాలోని జగలూర్‌ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగసనహళ్లిలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళుతోంది. మరో 400 మీటర్ల దూరం వెళితే చాలు ఆలయం వచ్చేస్తుంది. కానీ ఇంతలోనే కారు ఓ కాలువలోకి దూసుకెళ్లింది. అప్పుడు ఆ కారు తలుపులు తెరుచుకోలేదు. అది కాస్త పాత కారు కావడం వల్ల దానికి ఎయిర్‌బ్యాగ్స్‌ కూడా లేవు. ఆ కారులో ఇరుక్కున్న వారు గాయపడ్డారు. అదే కారులో ఉన్న 12 సంవత్సరాల బాలుడు కీర్తి వివేక్‌ ధైర్యం చేశాడు. తన చేతికి దొరికిన స్టీల్‌ వాటర్‌ బాటిల్‌తో కారు ముందు అద్దం పగలగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఎంత గట్టిగా కొట్టినా అది పగలలేదు. ఓ నాలుగైదుసార్లు ప్రయత్నించేసరికి అది పగిలింది. ముందుగా భయంతో అరుస్తున్న ఎనిమిది సంవత్సరాల వయసున్న తన చెల్లెలు సాత్వికను కారు నుంచి బయటకు తీశాడు. తర్వాత కారు నడుపుతూ గాయపడ్డ తన తండ్రిని అతికష్టం మీద బయటకు తీయగలిగాడు. వివేక్‌ వాళ్ల అమ్మ చేతి ఎముక విరిగి తీవ్రంగా గాయపడింది. పాపం ఆమె స్పృహ కూడా కోల్పోయింది. వివేక్‌, వాళ్ల నాన్నా కలిసి ఆమెను కారు నుంచి బయటకు తెచ్చారు. తర్వాత వివేక్‌ పోలీసులకూ, అంబులెన్స్‌కూ ఫోన్‌ చేసి వాళ్ల సాయం కోరాడు. తీవ్రంగా గాయపడ్డ అమ్మను వాళ్ల సహకారంతో ఆసుపత్రికి తరలించారు. అలా వివేక్‌ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి పెద్ద ప్రమాదం నుంచి తాను బయటపడడంతోపాటు తన కుటుంబాన్ని కూడా కాపాడుకున్నాడు. కేవలం ఏడో తరగతే చదువుతున్న వివేక్‌ ప్రదర్శించిన ధైర్యాన్నీ, సమయస్ఫూర్తినీ గుర్తించిన కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ‘హోసల శౌర్య అవార్డు- 2022’తో సత్కరించింది. ఇటీవల జరిగిన బాలలదినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దాన్ని అందించారు.


మంత్రి లౌక్యం!

విక్రమసింహుడు ఒకసారి కోటలో పండితుల కోసం విందు ఏర్పాటు చేశాడు. మంత్రి విజయవర్మతో సహా చాలా మంది హాజరయ్యారు. రుచికరమైన వంటకాలు అక్కడ సిద్ధం చేశారు. విక్రమసింహుడు కూడా అతిథులు, పండితులతో కలిసి అక్కడే భోజనానికి కూర్చున్నాడు. అక్కడున్న కూరలన్నింటిలోకీ బంగాళాదుంప ఆయనకు బాగా నచ్చింది. అదే విషయాన్ని మంత్రి విజయవర్మతో చెప్పాడు. ‘అవును ప్రభూ.. బంగాళాదుంప చాలా రుచికరమైనది. అసలు ఈ భూప్రపంచం మీద వంకాయ తర్వాత అత్యంత రుచికరమైనది బంగాళాదుంపే. పైగా మీలాంటి రాజులు తినదగ్గ కూర. వంకాయ, బెండకాయ ఇలాంటివి మొక్కల కొమ్మలకు కాస్తాయి. కానీ బంగాళదుంప మొక్క వేర్లకు కాస్తుంది రాజా!’ అని చెప్పాడు మంత్రి విజయవర్మ. విక్రమసింహుడి మొహం వెలిగిపోయింది. అప్పట్నుంచి విక్రమసింహుడు తన ఆహారంలో రోజూ బంగాళాదుంప ఉండాలని సేవకులను ఆదేశించాడు. మొదట్లో రుచికరంగా అనిపించినా, కొన్నాళ్లకు బంగాళాదుంప అంటే విసుగు పుట్టింది. ఇక లాభం లేదని ఓ రోజు వంటవాడిని పిలిచి ఆ రోజు నుంచీ తనకు బంగాళాదుంప కూర వడ్డించవద్దని చెప్పాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి విజయవర్మ... ‘అవును ప్రభూ..! బంగాళాదుంప ఎక్కువ తింటే వాతం అంటారు. అందుకే దేవుడు దాన్ని భూమిలో పాతిపెట్టినట్టు, నేల లోపల పండేలా చేశాడు’ అన్నాడు. విక్రమసింహుడికి విపరీతమైన కోపం వచ్చింది. ‘వంకాయ తర్వాత అత్యంత రుచికరమైంది బంగాళాదుంపే అని ఆనాడు చెప్పింది నువ్వే. మళ్లీ ఇప్పుడు ఇలా అంటున్నావు?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘క్షమించండి ప్రభూ! నేను మీకు మంత్రిని, బంగాళాదుంపకు కాదు కదా! మీకు ఏది నచ్చితే నాకూ అదే నచ్చుతుంది.  అయినా రాజాజ్ఞకు ఎదురు చెప్పేంత గొప్పవాడినా నేను’ అని వినయంగా బదులిచ్చాడు విజయవర్మ. మంత్రి లౌక్యానికి విక్రమసింహుడు నవ్వుకున్నాడు. అప్పటి వరకు ఉన్న కోపం క్షణాల్లోనే మటుమాయమైపోగా మంత్రికి కొన్ని కానుకలూ ఇచ్చి పంపించాడు రాజు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..